చంద్ర‌బాబు అభివృద్ధి బీజేపీ అక్కౌంట్‌లోకా..

రాష్ట్రంలో రోజుకు 18 గంట‌లు క‌ష్ట ప‌డుతూ.. తాను ప‌డుకోకుండా.. అధికారుల‌ను కూడా ప‌డుకోనివ్వ‌కుండా ఆరు ప‌దుల వ‌యసు దాటి మ‌న‌వ‌డిని, కుటుంబాన్ని సైతం వ‌దిలి రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం క‌ష్టిస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు క‌ష్టం మొత్తం ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి చేరిందా? అంటే ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కులు. రాష్ట్రంలో 2014 ఎన్నిక‌ల త‌ర్వాత అధికారం చేప‌ట్టిన బాబు.. తీవ్ర క‌ష్ట న‌ష్టాలు స‌హా రాజ‌ధాని సైతం లేని ఏపీని అభివృద్ధి బాట ప‌ట్టించేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే చైనా, సింగ‌పూర్‌, బ్రిట‌న్‌, అమెరికా వంటి అనేక దేశాల్లో సైతం ప‌ర్య‌టించి పెట్టుబ‌డులు కురిపిస్తున్నారు చంద్ర‌బాబు. అదే క్ర‌మంలో రాష్ట్రంలో అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తున్నారు. అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దుతున్నారు. తానే క‌ష్ట‌ప‌డ‌డం కాకుండా మంత్రుల‌ను ఎమ్మెల్యేల‌ను సైతం ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు నిన్న అమిత్ షా విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌తో బాబు క‌ష్టం బీజేపీ పాలైపోయింద‌నే టాక్ వినిపిస్తోంది.

రాష్ట్రంలో ఎన్నో ర‌కాల సంస్థ‌ల్ని కేంద్రం ఏర్పాటు చేసింద‌నీ, పోల‌వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కూడా క‌ల్పించామ‌ని అమిత్ షా అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్ర‌తీ రూపాయీ కేంద్రం ఇచ్చిందే అని ఆయ‌న చెప్పారు. న‌రేంద్ర మోడీ స‌ర్కారు ఆధ్వ‌ర్యంలో మొత్తంగా 106 ర‌కాల ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌న్నారు.

ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీతో క‌లిసి పొత్తు ఉంద‌నీ, భాజ‌పా నాయ‌కుడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా ఉన్నార‌నీ, ఆయ‌న శాఖ ఎన్నో విజ‌యాలు సాధించింద‌ని అమిత్ షా మెచ్చుకోవ‌డం విశేషం! విజ‌య‌వాడ ప‌ట్ట‌ణం భార‌తీయ జ‌న‌తా పార్టీకి విజ‌యాన్ని అందించే వాడ‌గా మారాల‌ని ఆకాంక్షించారు. సో.. షా ప్ర‌సంగం విన్న వారికి బాబు చేస్తున్న‌ది ఏమీ లేద‌నే అభిప్రాయం క‌ల‌గ‌క‌మాన‌దు. మ‌రి దీనికి టీడీపీ నేత‌లు ఎలా కౌంట‌ర్ ఇస్తారో చూడాలి .