టీడీపీ కొత్త క‌మిటీల ఎఫెక్ట్‌… పార్టీలో చంద్ర ‘ బాంబు ‘

ఏపీ అధికార పార్టీ టీడీపీలో ఇప్పుడు నిప్పులేకుండానే సెగ‌లు రాజుకుని పొగ‌లు క‌క్కుతున్నాయి. నిన్న పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబు పార్టీలో జాతీయ‌, రాష్ట్రీయ క‌మిటీల‌ను నియ‌మించారు. వ‌చ్చే ఏడాది చివ‌రిలో కానీ, ఆ పై ఏడాది మొద‌ట్లో కానీ సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఉన్నందున గెలుపే ధ్యేయంగా ఏపీలోనూ క‌నీసం స‌గం సీట్లు సాధించాల‌నే ల‌క్ష్యంతో తెలంగాణ‌లోనూ ఈ క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. అయితే, కొంద‌రు త‌మ‌కు ఈ క‌మిటీల్లో చోటు ద‌క్క‌లేద‌ని భావిస్తూ.. అల‌క పాన్పు ఎక్కారు. ఫిరాయింపుదారులకు పెద్దపీట వేశారని మ‌రికొంత మంది సీనియర్లు మండిపడుతున్నారు.

మంత్రివర్గ విస్తరణలో పక్కనపెట్టిన తమకు కనీసం పార్టీ పదవుల్లోనైనా న్యాయం జరుగుతుందని భావించిన సీనియర్లకు క‌నీసం పార్టీ ప‌ద‌వుల్లోనూ చోటు ల‌భించ‌క‌పోవ‌డంతో హ‌ర్ట్ అయ్యారు. గత కమిటీల్లో ఉన్న సీనియ‌ర్ నేత, ప్ర‌స్తుత ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, బండారు సత్యనారాయణమూర్తి, కరణం బలరాం, బోండా ఉమ, గాలి ముద్దు కృష్ణమనాయుడు లాంటి సీనియర్‌ నాయకులను పక్కన పెట్టడం పట్ల తెలుగు తమ్ముళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో చంద్రబాబుపై విమర్శలు చేయ‌డ‌మే వీరు చేసినా పాప‌మా ? అని ఈ నేత‌ల అనుచ‌రులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఆయారాం.. గయారాంలకు టీడీపీ వేదికగా మారిందని గతంలో చంద్రబాబుకు గోరంట్ల లేఖ రాశారు. కాపుల గొంతు కోశారని బోండా ఉమ విమర్శలు చేశారు. మంత్రి పదవి రాలేదని బండారు గన్‌మెన్‌లను సరెండర్‌ చేశారు. తనకు పదవి రాలేదని ధూళిపాళ్ల, గౌతు శివాజీ రాజీనామాలకు కూడా సిద్ధపడ్డ సంగతి తెలిసిందే. ఫిరాయింపు నేతలను ప్రోత్సహించవద్దని గతంలో కరణం బలరాం బహిరంగ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా వీరికి సీట్లు ఇచ్చేది అనుమనమేనని టీడీపీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడిన వారిని పక్కన పెట్టడంపై పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. మ‌రి భ‌విష్య‌త్తులో టీడీపీ ప‌రిస్థితి ఏంట‌నేది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.