గంటాకు చంద్ర‌బాబు ఫుల్ క్లాస్ అందుకే పీకేరా..

September 22, 2017 at 5:16 pm
chandra babu, TDP, Ganta Srinivas

“ఏడాదికి రూ.5 వేల కోట్లు ఇస్తున్నాను. ఇంత భారీ బ‌డ్జెట్ ఇస్తున్న శాఖ ఏదైనా ఉంటే చూపించండి. అయినా కూడా మీరు క‌ష్ట‌ప‌డ‌డం లేదు. స్కూళ్లు ప్రారంభ‌మై నాలుగు నెల‌లు పూర్త‌వుతున్నాయి. అయినా కూడా క‌నీసం బ‌యో మెట్రిక్ మిష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌లేక పోయారు. బ‌యోమెట్రిక్ మిష‌న్ల టెండ‌ర్ల విష‌యంలోనూ మీకు క్లారిటీ లేదు. మ‌ధ్యా హ్న భోజ‌నం వండే ఏజెన్సీల‌కు సిలెండ‌ర్ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌మ‌న్నాం అది కూడా మీరు ప‌ట్టించుకోలేదు. ఇంత చిన్న చిన్న విష‌యాల‌కే మీరు ప‌ట్టించుకోక‌పోతే.. విద్యా ప్ర‌మాణాల‌ను ఏవిధంగా ప‌ట్టించుకుంటారు“- అని సీఎం చంద్ర‌బాబు మంత్రి గంటా శ్రీనివాస‌రావుపై నిన్న జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో విరుచుకుప‌డ్డారు.

ఒకానొక సంద‌ర్భంలో మీ ప‌నితీరు బాగోలేదు! అని ముఖంపైనే చెప్పేశారు. పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి ఆ శాఖకు సంబంధించి వివిధ అంశాలను వివరిస్తూ, పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరును అమలు చేస్తున్నామని తెలిపారు. దీనిపై స్పందించిన ఒక జిల్లా అధికారి, తమ జిల్లాలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ హాజరు విధానం పనిచేయడం లేదని సీఎంకు తెలిపారు. నాలుగు యంత్రాలను కలిపి ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాటు చేశారని, ఫిర్యాదు చేస్తే తమ యంత్రాల్లో తప్పు లేదంటూ ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారని తెలిపారు. దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ సీఎంకు చెప్పారు.

దీనిపై స్పందించిన సీఎం బయోమెట్రిక్ హాజరుకు నాలుగు యంత్రాలను అమర్చడమేమింటూ విద్యా శాఖ అధికారిని ప్రశ్నించారు. మిష‌న్ల విష‌యంలో టెండ‌ర్ల‌ను వేరే సంస్థ పిలిచింద‌ని, మ‌రో సంస్థ వాటిని ఏర్పాటు చేసింద‌ని తెలిపారు. వెంట‌నే స్పందించిన సీఎం మూడు, నాలుగు ఏజెన్సీలకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. చేతకాకపోతే అడగాలి కదా ? అని ప్రశ్నించారు. విఫలం చేసేందుకు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లోకి వెళ్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్సును అమలు చేసేందుకు సిద్ధం అవుతున్న తరుణంలో ఇంకా బయో మెట్రిక్ విధానం అమలు చేయలేకపోవడాన్ని సీఎం చంద్ర‌బాబు తప్పుపట్టారు.

విద్యా శాఖలో జరుగుతున్న వ్యవహారాలను గమనించాలంటూ మంత్రి గంటా శ్రీనివాసరావును ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన నాయకత్వం కావాలని, చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి గంటా.. తనను బయోమెట్రిక్ హాజరుకు సంబంధించి పరికాలను అడిగితే, కొనుగోలు చేయమన్నానని, నిర్దిష్టంగా తనకు వాటి గురించి తెలియదన్నారు. తెలియ‌పోతే ఎలా తెలుసుకోవ‌ద్దా? అని సీఎం ఘాటుగానే ప్ర‌శ్నించారు. మొత్తానికి మంత్రి గంటా వ్య‌వ‌హార శైలిపైనే చంద్ర‌బాబు అనుమానం, ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

 

గంటాకు చంద్ర‌బాబు ఫుల్ క్లాస్ అందుకే పీకేరా..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share