య‌న‌మ‌ల‌, రాజ‌ప్ప‌కు బాబు వ‌ద్ద ప్ర‌యారిటీ త‌గ్గుతోందా…. ఇదే నిద‌ర్శ‌నం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కాకినాడ మేయ‌ర్ ఎంపిక‌లో అదే జిల్లాకు చెందిన ఇద్ద‌రు సీనియ‌ర్ మంత్రులు నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌తో పాటు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుకు దిమ్మ‌తిరిగిపోయే షాక్ ఇచ్చారు. కాకినాడ కార్పొరేష‌న్‌లో టీడీపీ తిరుగులేని విజ‌యం సాధించింది. ముందునుంచి పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిన‌ట్టుగానే మేయ‌ర్ పీఠాన్ని కాపుల‌కు ఇస్తామ‌ని చెప్ప‌డంతో ఈ వ‌ర్గంలో గెలిచిన నలుగురు మ‌హిళ‌లు పోటీప‌డ్డారు.

సుంక‌ర ల‌క్ష్మీప్ర‌స‌న్న‌, సుంక‌ర పావని, మాకినీడి శేషుకుమారి, అడ్లూరి వ‌ర‌ల‌క్ష్మి పోటీప‌డ్డారు. వీరి న‌లుగురికి న‌లుగురు గాడ్‌ఫాద‌ర్లు మ‌ద్ద‌తు ఇచ్చారు. ఇద్ద‌రు మంత్రులతో పాటు పుర‌పాల‌క మంత్రి నారాయ‌ణ‌, స్థానిక ఎమ్మెల్యే వ‌న‌మాడి కొండ‌బాబు, ఎంపీ తోట‌న‌ర‌సింహం ఎవ‌రికి వారు తాము చెప్పిన వాళ్ల‌కే మేయ‌ర్ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో అస‌లు కాకినాడ మేయ‌ర్ పీఠం ఎవ‌రికి ద‌క్కుతుందా ? అన్న ఉత్కంఠ నెల‌కొంది. అయితే చంద్ర‌బాబు ఈ రోజు ఈ ఉత్కంఠ‌కు తెర‌దించుతూ సుంక‌ర పావనిని కాకినాడ మేయ‌ర్‌గా ఎంపిక చేశారు. పావ‌ని భ‌ర్త‌ సుంకర తిరుమల కుమార్ ప్రస్తుతం కాకినాడ నగర టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. డిప్యూటీ మేయ‌ర్‌గా రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని 2వ డివిజ‌న్‌కు చెందిన కాలా స‌త్తిబాబు ఎంపిక‌య్యారు.

ఇద్ద‌రు మంత్రులు, ఎమ్మెల్యేకు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన చంద్ర‌బాబు:

జిల్లాకు చెందిన ఇద్ద‌రు మంత్రులు అయిన నిమ్మ‌కాయ చిన‌రాజ‌ప్ప‌, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుతో పాటు స్థానిక ఎమ్మెల్యే వ‌న‌మాడి కొండ‌బాబు ప్ర‌తిపాదించిన వారిని చంద్ర‌బాబు నిర్దాక్షిణ్యంగా ప‌క్క‌న పెట్టేసి షాక్‌ ఇచ్చారు. చివ‌రి క్ష‌ణంలో మంత్రులు ఇద్ద‌రూ కూడా సుంక‌ర శివ‌ప్ర‌స‌న్న‌కు మేయ‌ర్ ప‌ద‌వి ఇవ్వాల‌ని బాబు వ‌ద్ద తీవ్ర‌స్థాయిలో లాబీయింగ్ చేశారు. వీరిద్ద‌రు ఆమె కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేశారు. ఈమె 40వ డివిజ‌న్ నుంచి గెలుపొందారు.

శివ‌ప్ర‌స‌న్న భ‌ర్త సుంక‌ర విద్యాసాగ‌ర్ అయితే ఓ కీల‌క నాయ‌కుడికి చాలా త‌క్కువ రేటుకే కాకినాడ న‌గ‌రంలో ఓ పెద్ద బిల్డింగ్ కూడా కొనిపెట్టిన‌ట్టు టాక్ ఉంది. వీరి ప్ర‌తిపాద‌న‌ను ఏ మాత్రం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోని బాబు స్థానిక ఎమ్మెల్యే వ‌న‌మాడి కొండ‌బాబు ప్ర‌తిపాదించిన అడ్లూరి వ‌ర‌ల‌క్షిని కూడా ప‌క్క‌న పెట్టేశారు. కొండ‌బాబు అయితే ప్ర‌స్తుతం మేయ‌ర్‌గా ఎంపికైన సుంక‌ర పావ‌నికి అస్స‌లు ఇవ్వ‌వ‌ద్ద‌ని బాబుకు వ‌ద్ద నెత్తినోరు బాదుకుని మ‌రీ చెప్పివ‌చ్చార‌ట‌. అయితే బాబు ఆయ‌న మాట‌ను కూడా ప‌క్క‌న పెట్టేశారు.

పావ‌ని ఎంపిక వెన‌క అస‌లు కోణం ఇదే…

ఇక మంత్రులు ఇద్ద‌రూ, స్థానిక ఎమ్మెల్యే చెప్పిన వారిని కాకుండా చంద్ర‌బాబు సుంక‌ర పావ‌నిని మేయ‌ర్‌గా ఎంపిక చేయ‌డం వెన‌క బాబు పెద్ద వ్యూహంతో పాటు విధేయ‌త‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకున్నార‌ని తెలుస్తోంది. సుంక‌ర పావ‌ని భ‌ర్త సుంక‌ర తిరుమల కుమార్ ప్ర‌స్తుతం కాకినాడ న‌గ‌ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి వీరి కుటుంబం టీడీపీలో ఎంతో విధేయ‌త‌తో ప‌నిచేసింది. మ‌ధ్య‌లో కొన్ని నెలలు మాత్రం వీరు ప్ర‌జారాజ్యంలోకి వెళ్లి వెంట‌నే టీడీపీలోకి వ‌చ్చేశారు. ఇక సుంక‌ర పావ‌ని కుటుంబానికి మెట్ట‌లో బ‌ల‌మైన కాపు సామాజిక‌వ‌ర్గంలో మంచి ప‌ట్టు ఉంది. తిరుమ‌ల కుమార్ వ‌ల్ల కాకినాడ‌లో పార్టీకి మంచి మైలేజ్ కూడా వ‌స్తుంద‌ని భావించిన చంద్ర‌బాబు పావ‌నికే మేయ‌ర్ పీఠం ఓకే చేశారు.

రాజ‌ప్ప‌, య‌న‌మ‌ల‌పై బాబుకు త‌గ్గుతోన్న న‌మ్మ‌కం:

ఇక కీల‌క జిల్లాలో రెండు కీల‌క శాఖ‌ల‌కు మంత్రులుగా ఉన్న య‌న‌మ‌ల‌, రాజ‌ప్ప‌కు బాబు వ‌ద్ద ప్ర‌యారిటీ త‌గ్గుతుంద‌ని కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లే చెపుతున్నాయి. మేయ‌ర్ ఎంపిక‌లో వీళ్ల మాట‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు అంత‌కు ముందు ఎన్నిక‌ల విష‌యంలో కూడా వీరు చేసిన ప‌నుల‌తో తీవ్ర అస‌హ‌నానికి గుర‌వ్వ‌డంతో పాటు వీరికి షాకులు ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే టిక్కెట్ల ఎంపిక‌లో రాజ‌ప్ప అడ్డగోలుగా వ్య‌వ‌హ‌రించార‌న్న ఫిర్యాదుల మేర‌కు ఆయ‌న‌కు ఎన్నిక‌ల బాధ్య‌త‌ల నుంచి మ‌ధ్య‌లోనే త‌ప్పించిన సంగ‌తి తెలిసిందే.