ఇక‌.. ఎమ్మెల్సీ ప‌ర‌కాల‌! ప్ర‌మోష‌న్ ఇవ్వ‌నున్న బాబు

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ మీడియా స‌ల‌హాదారుగా ఉన్న ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌కి త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్ ఇవ్వ‌బోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న స‌ల‌హాదారుగా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వంలో కీల‌క అంశాల్లోఆయ‌న ముద్ర క‌నిపిస్తోంది. ముఖ్యంగా చంద్ర‌బాబు విదేశీ టూర్ల‌కు ఈయ‌నే ప్లాన్ చేస్తున్నార‌ని, అక్క‌డి నుంచి మీడియాకు వార్త‌లు అందించ‌డం కూడా ఈయ‌న ప‌నేన‌ని తెలిసిన విష‌యమే. అంత‌టి కీల‌కంగా సేవ చేస్తున్న ప‌ర‌కాల‌కు ప్ర‌మోష‌న్ ఇవ్వాల‌ని బాబు డిసైడ్ అయ్యార‌ని స‌మాచారం.

అయితే, మ‌రో వ‌ర్గం ప్ర‌చారం మాత్రం.. మీడియా స‌ల‌హాదారుగా ప‌ర‌కాల ఏమంత రిజ‌ల్ట్ చూపించ‌లేక‌పోయార‌ని, అందుకే ఆయ‌న‌ను ఎమ్మెల్సీ చేసేసి ప‌క్క‌న కూర్చోబెడితే బాగుంటుంద‌ని, ఆ బాధ్య‌త‌ను మ‌రో వ్య‌క్తికి అప్ప‌గించాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే బాబు ప్ర‌మోష‌న్ పేరుతో ప‌ర‌కాల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని భావిస్తున్నార‌ని స‌మాచారం. మీడియా సలహాదారుగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం నిర్వహించడంలో అటు సమాచారశాఖతో పాటు ఇటు పరకాల కార్యాలయం విఫలం చెందిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ‘పరకాల’ను సలహాదారు పదవిని నుంచి తొలగించి ఆయనను ఎమ్మెల్సీగా పంపుతున్నారని తెలుస్తోంది.

అదేస‌మ‌యంలో మీడియాలో విశేషమైన అనుభవం ఉన్న ఈనాడు బ్యూరో చీఫ్‌ డి.ఎన్‌.ప్రసాద్‌ను మీడియా సలహాదారుగా నియమించి ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నా వాటిని ప్రచారం చేసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పెన్షన్లు, రైతు రుణమాఫీ, సచివాలయ నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, చంద్రన్న భీమా పథకం తదితర పథకాలపై ప్రభుత్వం నామ మాత్రంగానైనా ప్రచారం చేయటం లేదు. దీంతో నే తాజా నిర్ణ‌యం వెలుగులోకి వ‌చ్చింద‌ని అంటున్నారు. మ‌రి బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.