టీడీపీలో మ‌ళ్లీ పాత రోజులు.. నేత‌ల‌కు బాబు దూరం!  

టీడీపీలో క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌స్తోందా? చ‌ంద్ర‌బాబు నేత‌ల‌కు దూరం అవుతున్నారా? కేడ‌ర్‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదా? 1990ల నాటి ప‌రిస్థితులే పున‌రావృతం అవుతున్నాయా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఉమ్మ‌డి ఏపీలో 23 జిల్లాలకు సీఎంగా ఉన్న స‌మ‌యంలోనూ ఇప్పుడు కేవ‌లం 13 జిల్లాల‌కు సీఎం గా ఉన్నారు. అయినా కూడా చంద్ర‌బాబు అప్ప‌ట్లో ఎంత బిజీగా ఉన్నారో.. ఇప్పుడు కూడా అంతే బిజీగా ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఇక్క‌డ విష‌యంలోకి వ‌చ్చేస‌రికి ఆయ‌న అప్ప‌ట్లో టీడీపీ కేడ‌ర్‌ని నిర్ల‌క్ష్యం చేసిన‌ట్టే.. ఇప్పుడు కూడా పార్టీని పూర్తిగా నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున సాగుతోంది. అంతేకాదు, ఆయ‌న కుమారుడు, ఐటీ, పంచాయితీరాజ్ శాఖ‌ల మంత్రి లోకేష్ కూడా పార్టీ నేత‌ల‌ను ద‌గ్గ‌ర‌కు రానీయ‌డం లేద‌ని నేత‌లు ఫీల‌వుతున్నారు.

నిజానికి ఇప్పుడు ఎన్నిక‌ల సీజ‌న్ కాక‌పోయినా.. 2019 వేడి మాత్రం ఇప్పుడే పుట్టుకు వ‌చ్చింది. ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ అధికారమే ల‌క్ష్యంగా దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న న‌వ‌ర‌త్నాలు పేరుతో ప్ర‌జ‌లపై హామీల జ‌ల్లు కురిపించారు. అంతేకాకుండా కేడ‌ర్‌ను బ‌ల‌ప‌రుచుకునే ప‌నిలో ప‌డ్డారు. అందుకే పార్టీలో చేరేవారి కోసం బూత‌ద్దం ప‌ట్టుకుని వెతుకుతున్నారు. అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటున్నారు. అంతేకాదు, కేడ‌ర్‌కు స‌మ‌యం కేటాయించాల‌ని ఈ మ‌ధ్య జ‌గ‌న్ స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిశోర్ చేసిన సూచ‌న‌ల‌పైనా జ‌గ‌న్ సానుకూలంగా స్పందించిన‌ట్టు స‌మాచారం. అంటే, రేపో మాపో ఆయ‌న గ‌ల్లీ స్థాయి వైసీపీ నేత‌ల‌తో సైతం మాట్లాడేందుకు స‌మ‌యం కేటాయించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

మ‌రి ఈ ప‌రిస్థితి టీడీపీలో ఉందా? కేడ‌ర్‌ను దూరం చేసుకోను. కేడ‌ర్ నా సొంత కుటుంబం. గతంలో చేసిన పొర‌పాట్ల‌ను తిరిగి చేయ‌ను. అని ప‌దే ప‌దే చెప్పుకొచ్చిన సీఎం చంద్ర‌బాబు ఇప్పుడు చేస్తోంది ఏమిటి? కేడ‌ర్‌కు స‌మ‌యం కేటాయిస్తున్నారా? కేడ‌ర్ స‌మ‌స్య‌ల‌ను వింటున్నారా? వాటిని ప‌రిష్క‌రిస్తున్నారా? అంటే స‌మాధానం చెప్ప‌డం చాలా క‌ష్టం. ఆయ‌న త‌న ప‌రిపాల‌న‌ను మాత్ర‌మే చూసుకుంటున్నారు. పాల‌న‌తోనే స‌మ‌యం గ‌డిపేస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌డంతోనే ఆయ‌న రోజు మొత్తాన్ని చ‌క్క‌బెట్టే్స్తున్నారు. ఇక‌, లోకేష్ ప‌రిస్థితి కూడాదీనికి భిన్నంగా ఏమీ లేదు. మంత్రి కాక ముందు కొంత మేర‌కు పార్టీ కార్యాల‌యంలో కేడ‌ర్‌కు అందుబాటులో ఉన్న ఆయ‌న ఇప్పుడు క‌నీసం ల‌ఘు ద‌ర్శ‌నానికి కూడా నోచుకోవ‌డం లేదు. దీంతో ఇప్పుడు టీడీపీలో కేడ‌ర్ స‌త్తువ కోల్పోతోంద‌నే ప్ర‌చారం సాగుతోంది.

నిజానికి పాల‌న ఎంత బాగున్నా.. ప్ర‌జ‌లు ఎంత‌గా మీటింగుల‌కు వ‌చ్చినా.. చంద్ర‌బాబు ఒక్క‌డిగా సాధించేది ఏమీ లేద‌ని గ‌త 2004 ఎన్నిక‌ల్లోనే తేలిపోయింది. క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్ బ‌లం లేక‌పోతే.. ఏ పార్టీకైనా.. ఇబ్బందులు త‌ప్ప‌వు. ముఖ్యంగా ప‌దేళ్ల త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ వంటి పార్టీలో కేడ‌ర్ అనేక ఆశ‌లు పెట్టుకుంది. చిన్నా చిత‌కా పార్టీ నుంచి, ప్ర‌భుత్వం నుంచి ల‌బ్ధి పొందాల‌ని నేత‌లు ఆశించ‌డం త‌ప్పుకాదు. అయితే, వీరి స‌మ‌స్య‌ను వినేందుకు స్థానికంగా ప‌రిస్థితిని తెలుసుకునేందుకు చంద్ర‌బాబు కానీ, ఆయ‌న కుమారుడు కానీ అస్స‌లు స‌మ‌యం కేటాయించ‌కోవ‌డ‌మే ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించింది. రాబోయే రోజుల్లో అయినా .. బాబు త‌న వైఖ‌రిని మార్చుకుని కేడ‌ర్‌ను ఆద‌రిస్తేనే సీఎం సీటులో సుదీర్ఘ‌కాలం కూర్చోవాల‌న్న బాబు ఆశ‌లు నెర‌వేరేది!!