బీజేపీని తొక్కే ప‌నిలో చంద్ర‌బాబు బిజీ

ఏపీలో మిత్రప‌క్షాలుగా ఉన్న అధికార టీడీపీ, మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ మ‌ధ్య పైకి ఎలా ఉన్నా లోప‌ల మాత్రం స‌ఖ్య‌త లేద‌న్న‌ది రాజ‌కీయ ఓన‌మాలు తెలిసిన వాళ్ల‌కు కూడా అర్థ‌మ‌వుతోంది. ఓ వైపు టీడీపీతో పొత్తు ప్ర‌స్తుతానికి కంటిన్యూ అవుతున్నా బీజేపీ కూడా తన సొంత వ్యూహాలతోనే ముందుకెళుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బలపడాలన్నది బీజేపీ టార్గెట్. అందుకు అనుగుణంగా చాప‌కింద నీరులా బీజేపీ ఇక్క‌డ ప్లాన్లు వేస్తోంది.

2019 ఎన్నిక‌ల్లో పొత్తు ఎలా ఉన్నా అప్ప‌టి వ‌ర‌కు ఈ రెండు పార్టీల స‌హ‌కారం ఇద్ద‌రికి అవ‌స‌ర‌మే. రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ మద్దతు బీజేపీకి అవసరం కాగా, కేంద్రం నుంచి నిధుల సమీకరణ విషయంలో బీజేపీ అవ‌స‌రం కూడా టీడీపీకి అంతే ఉంది. ఈ రెండేళ్ల‌లో కేంద్రంతో తెగ‌తెంపులు చేసుకున్నా, బీజేపీతో వైరం పెట్టుకున్నా అది టీడీపీకే లాస్‌. అందుకే ఇక్క‌డ బీజేపీ బ‌ల‌ప‌డేందుకు అమిత్ షా వేస్తోన్న ఎత్తుల‌ను గ‌మ‌నిస్తోన్న చంద్రబాబు మ‌రోవైపు బీజేపీని తొక్కే ప్ర‌య‌త్నాలు కూడా స్టార్ట్ చేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ఉండే ప్ర‌శ‌క్తే లేదు. ఒక‌వేళ ఏపీలో ఉంటుందా ? లేదా ? అన్న‌ది చెప్ప‌లేం. పొత్తు ఉన్నా బీజేపీ ఎక్కువ సీట్ల కోసం డిమాండ్ చేసే ఛాన్సులు ఉన్నాయి. అదే జ‌రిగితే చంద్ర‌బాబు టీడీపీ ఓడిపోయే, వీక్‌గా ఉన్న సీట్లు మాత్ర‌మే వ‌దులుకోవాల‌ని మ‌రో పెద్ద ప్లాన్ వేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక బీజేపీని చెల్లాచెదురు చేసేందుకు, ఆ పార్టీని స్ట్రాంగ్ కాకుండా చేసేందుకు ప్ర‌స్తుతం ఆ పార్టీ సిట్టింగ్ సీట్ల‌లోను కోత పెట్టేయ‌డం ఖాయ‌మ‌ని టీడీపీ వ‌ర్గాలే చెపుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిచిన న‌ర‌సాపురం ఎంపీ సీటు, తాడేప‌ల్లిగూడెం ఎమ్మెల్యే సీటు ఈ సారి బీజేపీకి ఇచ్చే ప‌రిస్థితి లేదంటున్నారు. అప్పుడు బీజేపీ మ‌రో ఆప్ష‌న్ చూసుకోవాలి.

టీడీపీ వీక్‌గా ఉండి, వైసీపీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు బీజేపీకి ఇస్తే ఆ పార్టీ ఎంత న‌ష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బీజేపీతో పొత్తు ఉంటే ఈ సారి రాయ‌ల‌సీమ‌లోని నంద్యాల‌, తిరుప‌తి, క‌డ‌ప సీట్ల‌లో ఏవైనా రెండు ఎంపీ సీట్లు వాళ్ల‌కు ఇవ్వ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఇవ‌న్నీ వైసీపీ బ‌లంగా ఉన్న‌వే. ఇక్క‌డ బీజేపీ ఓడిపోవ‌డం ఖాయం. ఇక అసెంబ్లీ సీట్ల కేటాయింపులోను చంద్రబాబు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నార‌ట‌. ఏదేమైనా బీజేపీ టీడీపీని కాద‌ని సొంతంగా ఎదిగే ప్ర‌య‌త్నాలు చేస్తుంటే….చంద్ర‌బాబు బీజేపీని మ‌ట్టానికి తొక్కేందుకు త‌న ప్ర‌య‌త్నాల్లో తాను ఉన్నార‌నే తెలుస్తోంది.