చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపిస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే

September 23, 2017 at 5:50 am

ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇటీవ‌ల కాలంలో మీడియాలో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు. ముఖ్యంగా స‌దావ‌ర్తి భూముల విష‌యంలో తీవ్ర వివాదానికి కార‌ణ‌మైన ఈ వైసీపీ నేత ప్ర‌భుత్వంతో మూడు చెరువుల నీళ్లు తాగించారు. 86 ఎక‌రాల సత్రం భూముల‌ను రూ.22 కోట్ల‌కు విక్ర‌యించ‌డాన్ని త‌ప్పుబడుతూ.. ఆయ‌నే స్వ‌యంగా రూ.5 కోట్లు అద‌నంగా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో.. హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టులు కూడా జోక్యం చేసుకుని తిరిగి వేలం నిర్వ‌హించ‌డం తెలిసిందే. అలా.. ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నులను ప్ర‌శ్నిస్తున్న నేత‌.

నిజానికి ఆళ్ల ఇప్పుడు కొత్త‌గా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్న నేత‌కాదు! 2014 చివ‌రి నుంచి ఆయ‌న బాబుకు కొర‌క‌రాని కొయ్య‌గా మారిపోయారు. రాజ‌ధాని భూములు, హ‌రిత‌ట్రిబ్యున‌ల్‌, కృష్ణాన‌ది ఒడ్డున ఇళ్లు క‌ట్టుకుని ఉంటున్నార‌ని, ఫ‌లితంగా వాతావ‌ర‌ణం దెబ్బ‌తింటుంద‌ని, ఆయ‌న పిల్స్ అనేకం వేశారు. కేవలం న్యాయపోరాటంతోనే టీడీపీ నేత‌ల‌కు ఈయ‌న చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. తొలుత అమరావతి నిర్మాణం కోసం భూసమీకరణ ద్వారా భూములను సేకరించాలని ప్రభుత్వం భావించింది. మూడు పంటలు పండే భూములు తాము రాజధానికి ఇవ్వలేమని కొందరు రైతులు అడ్డం తిరిగారు. బాధితుల పక్షాన ఆర్కే దిగి న్యాయపోరాటానికి దిగారు.

అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం స్థానంలో ఇంగ్లీష‌ మీడియాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్కే వ్యతిరేకించారు. దీనివల్ల పేదపిల్లలు నష్టపోతారని కోర్టును ఆశ్రయించారు. మ‌రో స‌మ‌స్య‌లో ప్రకాశం బ్యారేజీపై భారీ వాహనాలను అనుమతించడంపై కూడా కోర్టుకు వెళ్లారు. ఇందులోనూ ఆర్కే సక్సెస్ అయ్యారు. ఇక కృష్ణానదిలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతివ్వడంపై కూడా ఆళ్ల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్టే సాధించారు. ఇక ఏపీ అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణ నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ కోర్టుకెక్కారు ఆర్కే. ఆయన విద్యార్హతలపై తన పిటిషన్ లో సందేహం వ్యక్తం చేశారు. దీనిపై కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది.

తాజాగా కృష్ణానది కరకట్టపై ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఏర్పరచుకోవడాన్ని కూడా ఆర్కే తప్పుపట్టారు. పది మందికి నీతులు చెప్పాల్సిన ముఖ్యమంత్రి నదిని ఆక్రమించుకుంటే ఎలా అని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ముఖ్యమంత్రి తో పాటు నదిని ఆక్రమించుకుని కట్టడాలు నిర్మించిన 57 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలు అవునో…? కాదో? మూడువారాల్లో చెప్పాలని హైకోర్టు నోటీసుల్లో పేర్కొంది. ఇలా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. మ‌రి ఆర్‌కే ను బాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి!!

 

చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపిస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share