లోకేశ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించ‌డం బాబుకు ప‌రీక్షే

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు వ‌చ్చే ఎన్నిక‌లు పెద్ద అగ్నిప‌రీక్ష‌లా మారాయి. ఆ ఎన్నిక‌ల్లో రెండోసారి గెలిచేందుకు ఎన్నో ప్లాన్లు వేస్తోన్న బాబు ముందు మ‌రో పెద్ద స‌వాల్ కూడా ఉంది. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీని స్టేట్‌లో రెండోసారి గెలిపించ‌డం ఒక ఎత్తు అయితే, త‌న త‌న‌యుడు లోకేశ్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌కు స‌రైన బాట వేయ‌డం రెండో ప‌రీక్ష‌. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ గెలిచి బాబు సీఎం అయినా ఆ ట‌ర్మ్‌లో బాబు పూర్తికాలం సీఎంగా ఉంటార‌న్న గ్యారెంటీ లేద‌ని తెలుస్తోంది.

మ‌ధ్య‌లో ఎప్పుడైనా స‌రే ఆయ‌న లోకేశ్‌ను సీఎంగా చేసి, టీడీపీ భావి వార‌సుడిగా ప్ర‌క‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌కంటే ముందుగా లోకేశ్‌, బ్రాహ్మ‌ణిలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో దిగుతార‌ని కూడా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. బ్రాహ్మ‌ణి గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తార‌ని అంటున్నారు. ఇక బాబుకు ఇప్పుడు వ‌చ్చిన చిక్క‌ల్లా త‌న త‌న‌యుడు లోకేశ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించ‌డ‌మే.

లోకేశ్ ఎమ్మెల్యేగా గెల‌వ‌డం ఇప్పుడు అత‌డి ముందున్న పెద్ద స‌వాల్‌. లోకేశ్ ప్ర‌స్తుతం మంత్రి అయినా ఆయ‌న దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయ్యి చ‌ట్ట‌స‌భ‌ల్లోకి వెళ్లి, మంత్రి అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా లోకేశ్ పోటీ చేయ‌క‌పోతే చ‌ట్ట‌స‌భ‌ల‌ను ఎదుర్కొనే ధైర్యం లేద‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి ఉంటోంది. ఇప్ప‌టికే లోకేశ్‌పై ఈ విమ‌ర్శ‌లు ఎక్కువ‌య్యాయి. ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతోన్న రాజ‌కీయ వార‌సులు అంద‌రూ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో గెలిచి వ‌చ్చిన‌వారే. ఒక్క లోకేశ్ మాత్ర‌మే ఇందుకు మిన‌హాయింపు.

ఈ క్ర‌మంలోనే లోకేశ్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు చంద్ర‌బాబు రెడీగానే ఉన్నారు. అయితే ఇందుకు త‌గిన నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంపిక చేయ‌డ‌మే బాబుకు స‌వాల్‌గా మారింది. సొంత జిల్లా చిత్తూరులో సొంత నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌గిరి అంత సేఫ్‌కాదు. అక్క‌డ రెడ్ల ఆధిప‌త్యం ఎక్కువ. అక్క‌డ గ‌తంలో చంద్ర‌బాబే ఓ సారి ఓడిపోయారు.

ఇక హిందూపురం టీడీపీకి కంచుకోట‌, నంద‌మూరి ఫ్యామిలీకి క‌లిసొచ్చిన నియోజ‌క‌వ‌ర్గం. అయితే అక్క‌డ నుంచి ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న లోకేశ్ మామ బాల‌య్యే తాను మ‌రోసారి అక్క‌డ నుంచే పోటీ చేస్తాన‌ని చెప్పారు. దీంతో ఇక కృష్ణా జిల్లా వైపు బాబు క‌న్ను ప‌డింది. అక్క‌డ పెన‌మ‌లూరు నుంచి లోకేశ్ పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నా, దివంగ‌త మాజీ మంత్రి దేవినేని నెహ్రూ త‌న‌యుడు అవినాష్ ఆ సీటు త‌న‌కు ఇవ్వాలంటున్నారు. త‌న తండ్రికి ఎమ్మెల్యే సీటు ఇస్తాన‌ని మాట ఇచ్చినందున ఆ సీటు త‌న‌కు ఇవ్వాల‌ని మెలిక పెడుతున్నాడు.

ఇక గుడివాడ‌లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిని ఎదుర్కోవ‌డం లోకేశ్‌కు పెద్ద స‌వాలే. అది కూడా రిస్క్‌. దీంతో ఇప్పుడు లోకేశ్‌కు అనువైన ఎమ్మెల్యే సీటు వెతికేందుకు చంద్ర‌బాబుకు కాస్త ఇబ్బందిగానే ఉంద‌ట‌. మ‌రి ఫైన‌ల్‌గా ఎన్నిక‌ల వేళ త‌న‌యుడికి బాబు ఏ సీటు కేటాయిస్తారో ? చూడాలి.