కొడుక్కి రూల్స్ పెట్టిన చంద్ర‌బాబు

ఏదైనా ఒక విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డం ఎంత ముఖ్య‌మో.. అందులో త‌ప్పుడు లేకుండా మాట్లాడ‌టం కూడా అంతే ముఖ్యం! మ‌రీ ముఖ్యంగా రాజ‌కీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ లాంటి వారికి మ‌రింత కీల‌కం!! అందుకు కొడుకు వేస్తున్న త‌ప్ప‌ట‌డుగుల‌ను స‌రిదిద్దేందుకు చంద్ర‌బాబు వెంట‌నే రంగంలోకి దిగార‌ట‌. క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో స్టిక్ట్‌గా ఉండే చంద్ర‌బాబు.. అంత‌కంటే స్ట్రిక్ట్ గా కొడుకు దగ్గ‌ర వ్య‌వ‌హ‌రించా ర‌ట‌. ముఖ్యంగా తెలుగు విష‌యంలో త‌డ‌బ‌డుతున్న కొడుక్కి కొన్ని సూచ‌న‌లు కూడా ఇచ్చార‌ట‌. అంతేగాక ఉప‌న్యాసాలు కూడా ఇచ్చేలా ప్రాక్టీస్ చేయాల‌ని ఆదేశించార‌ట‌.

తన స్పీచ్ లతో పార్టీ, ప్రభుత్వం పరువు తీస్తున్న సుపుత్రుడు లోకేష్ కు చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట‌. అంబేద్కర్ జయంతిని వర్థంతి అని పలికిన లోకేష్.. అంతకు ముందు ఎమ్మెల్సీగా, మంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలోనూ తెలుగులో తడబడ్డారు. ఇక పార్టీ సమావేశంలో అవినీతి, కులపిచ్చి ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశమే అని అర్థం వచ్చేలా ప్రసంగించి నవ్వులపాలయ్యారు. అంతా భావి టీడీపీ నాయ‌కుడిగా భావిస్తున్న స‌మ‌యంలో ఇలా న‌వ్వుల పాలు అవ‌డం కొడుకుపై ఆగ్ర‌హం తెప్పించింద‌ట‌. గ‌తంలో చంద్ర‌బాబు కూడా ఇలానే అవినీతిలో అభివృద్ధిలో ఏపీ నంబర్ వన్ అని సాక్షాత్తూ అసెంబ్లీ లోనే బాబు ప్రకటించిన విష‌యం తెలిసిందే!

సీఎం పదవి చేప‌ట్టిన కొత్త‌లో సీఎం చంద్ర‌బాబు మంచి వక్త ఏమీ కాదు. అప్పట్లో పొరపాటు మాట్లాడినా, మీడియా ఇంత విస్తృతంగా లేకపోవడం, అసలు సోషల్ మీడియానే లేకపోవడం వల్ల ఈ విష‌యాలు పెద్దగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లేవి కావు. కానీ ఇప్పుడు ఏ చిన్న విష‌యం తెలిసినా.. అది విస్తృతంగా వైర‌ల్ అవుతోంది. దీంతో జ‌నాల్లో న‌వ్వుల‌పాలు కావాల్సి వ‌స్తోంది. ప్ర‌స్తుతం లోకేష్ ని సోషల్ మీడియా ఆడుకుంటోంది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా వీటికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో లోకేష్ ఇలాగే తప్పులు మాట్లాడుతుంటే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని చంద్ర‌బాబు తీవ్రంగా ఆందోళ‌న చెందుతున్నార‌ట‌.

తెరవెనక రాజకీయాలు చేయడం ఎంత ముఖ్యమో, ప్రజల్ని ఆకట్టుకునేలా మాట్లాడటం కూడా రాజకీయాల్లో అంతే ముఖ్యమని లోకేష్ కు చంద్రబాబు క్లాస్ పీకారట. మండలి బుద్దప్రసాద్, పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళ దగ్గర తెలుగు నేర్చుకోవాల‌ని, కనీసం రోజుకొక గంట అద్దం ముందు నిలబడి ఉపన్యాసాలు ప్రాక్టీస్ చేయమని స్ట్రిక్ట్‌గా ఆదేశించార‌ట‌. తెలుగు మీద పట్టు దొరికేవరకు మీడియాతో మాట్లాడవద్దని, పార్టీ మీటింగ్స్ లో కూడా మీడియా ఉన్నప్పుడు మాట్లాడ వద్దని లోకేష్ కు బాబు వార్నింగ్ ఇచ్చారట.