బాబు కామెడీ.. అయిపోయిన పెళ్లికి బాజాలు

ఏదైనా ఓ ప్రారంభోత్స‌వ‌మో.. ఆవిష్క‌ర‌ణో జ‌ర‌గాలంటే.. అది లేటెస్ట్ అయి ఉండాలి. లేదా.. ఒక‌టి రెండు నెల‌ల కింద‌టిదైనా అయి ఉండాలి. కానీ, ఏపీ సీఎం చంద్ర‌బాబు మాత్రం ఏళ్ల త‌ర‌బ‌డి ఉన్న ఓ పాత‌చింత‌కాయ్ ప‌చ్చ‌డి వంటి ప్రాజెక్టుకు కొత్త రంగులు అద్ది.. దానిని కూడా త‌న క్రెడిట్‌గా చెప్పుకొనేందుకు త‌హ‌త‌హ లాడిపోతున్నారు. అయిపోయిన పెళ్లికి కొత్త‌గా బాజాలు వాయిస్తున్నారు. మ‌రి ఎవ‌రి చెవిలో పూలు పెట్టేందుకో అర్ధం కావ‌డం లేదంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. బుధవారం చంద్రబాబు విశాఖపట్నం జిల్లాకు వెళుతున్నారు. ఎటూ జిల్లాకు వస్తున్నారు కాబట్టి అనకాపల్లికి తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులు అనుకున్నారు.

అయితే, ఉప‌యోగం లేక‌పోతే, త‌న‌కు పొలిటిక‌ల్‌గా ప్ర‌జ‌ల్లో మైలేజీ ఉండ‌క‌పోతే.. విరిగిన వేలిపైన కూడా…. `అది` పోయ‌న‌ట్టుగా ఉంటుంది బాబు పాల‌సీ. దీంతో అన‌కాప‌ల్లి తెలుగు దేశం త‌మ్ముళ్లు బుర్ర‌బ‌ద్ద‌లు కొట్టుకున్నారు. ఏదో ఒక కార్య‌క్ర‌మం పేరుచెప్పి.. ఓ రెండు వంద‌ల మందిని అక్క‌డికి త‌ర‌లించేస్తే.. బాబు వ‌చ్చేస్తార‌ని, మైకుప‌ట్టుకుని దంచేస్తార‌ని, ఆయ‌న‌తో క‌లిసి ఫొటోలు దిగిపోవ‌చ్చ‌ని నేత‌లు ప్లాన్ చేసుకున్నారు. దీంతో వారికి అనకాపల్లి నియోజకవర్గంలోని నర్సాపూర్ ఇరిగేషన్ ప్రాజెక్టు గుర్తుకువ‌చ్చింది. దీనికి బాబుతో రిబ్బ‌న్ క‌ట్ చేయించాల‌ని డిసైడ్ అయ్యారు.

ఇంకేముంది.. బాబుకు విష‌యం చెప్పారు. న‌ర్సాపూర్ ప్రాజెక్టు ఓపెనింగ్ మీరే చేయాల‌ని, అప‌ర భ‌గీర‌థుడంటే మీరేన‌ని వివ‌రించారు. అంతే.. బాబు రెచ్చిపోయారు. ఆ ప్రాజెక్టు పూర్వాప‌రాలు ఏంటి? ఎవ‌రు క‌ట్టారు? ఎందుకు క‌ట్టారు? ఎవ‌రి ఉప‌యోగం? వ‌ంటివి ప‌ట్టించుకోకుండానే ప‌త్రిక‌ల్లో కోట్లు పోసి ప్ర‌క‌ట‌న‌లిచ్చేశారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ప్రారంభోత్సవం జరిపేందుకు ఏర్పాట్లు జ‌రిగిపోయాయి. అయితే, ఇప్పుడు దీనినే స్థానిక ప్ర‌జ‌లు స‌హా విమ‌ర్శ‌కులు ఎత్తి చూపుతూ.. బాబు ప్ర‌చారఆర్భాటాన్ని.. ఎండ‌గ‌డుతున్నారు.

నిజానికి ఈ ప్రాజెక్టు.. ఎప్పుడో ప్రారంభం అయింది. ఎప్పటి నుండో రైతులకు ఈ ప్రాజెక్టు నుండి నీరు కుడా విడుదల అవుతోంది. అయినా కూడా చంద్రబాబు బలహీనతను అవకాశంగా తీసుకుంటున్న కొంద‌రు నేత‌లు, అధికారుల మూలంగా అయిపోయిన పెళ్లికి.. బాబు ఇప్పుడు డ‌ప్పుకొట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో ఇలాగైతే ఎలా చంద్రం! అని విమ‌ర్శ‌కులు నోరెళ్ల బెడుతున్నారు.