మోడీ-ప‌వ‌న్ దూరంపై చంద్ర‌బాబు టెన్ష‌న్‌

2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఒక‌వైపు మోడీని.. మ‌రోవైపు ప‌వ‌న్‌ను పెట్టుకుని నెట్టుకొచ్చేశారు టీడీపీ అధినేత చంద్ర బాబు! అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా బీజేపీతో దోస్తీ.. జ‌నసేన‌తో మైత్రి.. కొన‌సాగిస్తూ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. మిత్రుల మ‌ధ్య దూరం పెర‌గడం ఆయ‌న్ను తీవ్రంగా ఇబ్బందుల‌కు గురిచేస్తోంద‌ట‌. ముఖ్యంగా బీజేపీ-జ‌న‌సేన మ‌ధ్య గ్యాప్ వ‌ల్ల‌.. టీడీపీ శ్రేణుల్లో ఆందోళ‌న మొద‌లైంద‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో దోస్తీ త‌ప్ప‌దు.. అలాఅని జ‌న‌సేన‌తోనూ వైరం కుద‌ర‌దు! దీంతో ఏం చేయాలో తెలియ‌క‌ ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఇబ్బందుల్లో ప‌డిపోతున్నార‌ట‌.

చంద్ర‌బాబు-మోడీ-ప‌వన్ క‌ల్యాణ్‌.. 2014 ఎన్నిక‌ల్లో సూప‌ర్ హిట్ కాంబినేష‌న్ అని చాలామంది అనుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఈ కూట‌మి ఘ‌న విజ‌యం సాధించింది. సొంతంగా పార్టీ పెట్టినా పోటీ చేయ‌కుండా టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ఇచ్చి ప‌వ‌న్ ఎక్కువ మార్కులే కొట్టేశాడు. అయితే అధికారంలోకి వ‌చ్చాక ఏపీకి బీజేపీ మొండి చెయ్యి చూపించ‌డంపై అంతే స్థాయిలో అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ తీవ్ర స్థాయిలో ధ్వ‌జమెత్తారు. ఈ నేప‌థ్యంలోనే కేంద్రాన్ని విమ‌ర్శించినా.. ప్ర‌ధాని మోదీని వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించ‌లేదు. కానీ అప్ప‌టి నుంచి మోదీ-ప‌వ‌న్ మ‌ధ్య దూరం పెరుగుతోంద‌నే ప్ర‌చారం మొద‌లైంది.

అయితే పవన్ ను మోడీ దూరం పెట్టేశారన్న సంకేతాలు వెలువడటంతో టీడీపీలోనూ కొంత గందరగోళ పరిస్థితినెలకొంది. పవన్, మోదీల మధ్య గ్యాప్ పెరిగిందని తెలియడంతో టీడీపీ శ్రేణుల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. వచ్చే ఎన్నికల్లో పవన్ తో కలిసి వెళదామని చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. పవన్ లేవెనెత్తిన సమస్యలన్నింటిపైనా చంద్రబాబు స్పందిస్తున్నారు. పవన్ కు తానిచ్ఛే ప్రయారిటీ ఇదీ అని చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పకనే చెప్పారు. నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల్లో తటస్థంగా ఉంటామని పవన్ ప్రకటించినా చంద్రబాబు దానిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

వచ్చే ఎన్నికల్లో పవన్ తనతో కలుస్తారన్న ఆశ చంద్రబాబుకు ఉంది. బాబుపై ఏదో ఒక మూల సాఫ్ట్ కార్నర్ ఉందని టీడీపీ శ్రేణులు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పవన్ తో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ గట్టిగానే కోరుకుంటోంది. బీజేపీతో పొత్తు గ్యారంటీ అంటున్న అధినేత పవన్ విషయంలో జరగుతున్న పరిణామాలను మాత్రం జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో మోదీ పవన్ ను దూరం పెట్టడంతో వచ్చే ఎన్నికల్లో పవన్ తమకు సహకరిస్తారా? లేదా? అన్న ఆలోచన టీడీపీ శ్రేణుల్లో బయలుదేరిందట‌.