బాబు అభివృద్ధి చేశారా? అప్పుల పాలు చేశారా?

May 10, 2018 at 10:12 am
cbn-ap

ఏపీని అభివృద్ది చేశానంటూ.. గ‌డిచిన నాలుగేళ్లుగా చెబుతున్న సీఎం చంద్ర‌బాబు.. నిజంగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా?  లేక అస‌లే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మ‌రింత అప్పుల ఊబిలో ముంచారా? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నమ‌వుతున్నా యి. తాజాగా జ‌రుగుతున్న క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఏపీకి సంబంధించిన అప్పుల విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ప్ర‌భుత్వం వెల్ల‌డించిన అప్పుల వివ‌రాలు చూసి అంద‌రూ నివ్వెర పోయారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఏపీ ప్ర‌జ‌ల అభివృద్ధి, రాష్ట్ర ఆదాయం వంటి వివ‌రాల‌పై క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. 

 

ఈ సంద‌ర్భంగా  రాష్ట్ర ప్రజల తలసరి అప్పు రూ.42,324కు పెరిగినట్లుగా తేలింది. అంటే ఏపీలో నివ‌సించే ప్ర‌తి ఒక్క‌రి త‌ల‌పైనా రూ.42,324 రూపాయ‌ల అప్పు ఉంద‌న్న‌మాట‌! ఇక‌, గత ఏడాదితో పోలిస్తే.. ఈ అప్పు భారం దాదాపు 10 శాతానికి మించి పెరిగినట్లుగా గ‌ణాంకాలు వెల్ల‌డించాయి.  గత ఏడాది (2017-18)తో పోలిస్తే ఈ ఏడాది దాదాపుగా రూ.4292 మేర పెరగటం గమనార్హం. జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే.. ఏపీ జ‌నాభా తలసరి ఆదాయం ఎక్కువే అయినా.. అప్పు భారం సైతం భారీగా ఉండటం గమనార్హం. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. గడిచిన నాలుగేళ్లలో అప్పు భారం భారీగా పెరుగుతోంది. విభజన నాటి అప్పు భారం ఎంతో.. గడిచిన నాలుగేళ్ల వ్యవధిలో దాదాపు అంతే మొత్తాన్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అప్పుగా  తీసుకొచ్చింది. 

 

అయితే, ఇంత అప్పు చేసినా.. ఆర్థిక ప‌రిస్థితిలో సానుకూల మార్పులు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. విశ్లేష‌కుల అంచ‌నా ప్ర‌కారం.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేస్తున్న దుబారా వ్య‌యం ముందు ఎంతైనా స‌రిపోవ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. ఇక‌, ఈ పెరుగుతున్న అప్పు సంగతిని పక్కన పెడితే.. గత ఏడాదితో పోల్చినప్పుడు ఏపీ ప్రజల తలసరి ఆదాయం కూడా పెరుగుతున్న వైనం సానుకూలాంశంగా చెప్పాలి. ఆదాయపరంగా చూస్తే ఏపీలో కృష్ణా జిల్లా తొలిస్థానంలో నిలిస్తే.. విశాఖ.. పశ్చిమగోదావరి జిల్లాలు రెండు.. మూడు స్థానాల్లో నిలిచాయి. కృష్ణా జిల్లా రూ.189121 తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. 

 

ఇది జాతీయ తలసరి ఆదాయం కంటే ఎక్కువ.  ఆదాయం విషయంలో అంతరం ఏపీలో ఎంత ఎక్కువన్న విషయం తాజా ఉదాహరణ మరోసారి స్పష్టం చేస్తుందని చెప్పాలి. జిల్లాల మధ్య ఆర్థిక అంతరాలు అంతకంతకూ ఎక్కువ కావటం ఏ మాత్రం మంచిది కాదని చెప్పక తప్పదు. మ‌రి ఈ ప‌రిస్థితికి అడ్డుక‌ట్ట ప‌డేదెప్పుడు? అనే ప్ర‌శ్న ఉద‌యిస్తుంది. ఇప్ప‌టికైతే.. ఇంతే అనే స‌మాధానం ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. దీనినిబ‌ట్టి చంద్ర‌బాబు ఏపీని అభివృద్ది చేశారా? అప్పుల పాలు చేశారా? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

బాబు అభివృద్ధి చేశారా? అప్పుల పాలు చేశారా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share