నంద్యాల వార్ భూమా, శిల్పాది కాదు బాబు-జ‌గ‌న్ మ‌ధ్యే

భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఖాళీ అయిన నంద్యాల ఎమ్మెల్యే సీటుకు ఉప ఎన్నిక త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ కూడా జారీ చేసింది. అయితే, ఈ ఉప ఎన్నిక‌పై అంచ‌నాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. వాస్త‌వానికి ఈ ఉప ఎన్నిక పార్టీ ల మ‌ధ్య కాకుండా పార్టీ అధినేత ల మ‌ధ్య ఫైట్‌గా మారిపోయింది. సుదీర్ఘ అనుభ‌వం ఉన్న రాజ‌కీయ నేత‌గా బాబుకు, యువ‌నేత‌గా జ‌గ‌న్‌కు మ‌ధ్య సాగుతున్న పోరుగా నంద్యాల ఉప ఎన్నిక మారిపోవ‌డం గ‌మ‌నార్హం. నిజానికి చెప్పాలంటే.. దివంగ‌త వైఎస్‌తోనూ ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయాలు న‌డిపిన చంద్ర‌బాబు.. ఇప్పుడు ఆయ‌న కుమారుడు జ‌గ‌న్‌తో ప‌డుతున్న పోటీని కానీ, ప‌డుతున్న టెన్ష‌న్‌కానీ.. వైఎస్‌తో ఏనాడూ ప‌డ‌లేదు. 

పైకి చెప్ప‌క‌పోయినా.. నంద్యాల గెలుపును అటు చంద్ర‌బాబు, ఇటు జ‌గ‌న్‌లు చాలా చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. మూడేళ్ల త‌న పాల‌న‌కు ప్ర‌జ‌లు వేసే మార్కులుగా బాబు ఆఫ్‌ది రికార్డుగా అభివ‌ర్ణిస్తుంటే.. అదే మూడేళ్ల బాబు అవినీతికి ప్ర‌జ‌లు తీర్పు చెప్ప‌బోతున్నారంటూ.. జ‌గ‌న్ బాహాటంగానే విమ‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ ఉప ఎన్నిక ప్ర‌తిష్టాత్మకంగా మారింది. రాష్ట్రంలో గ‌డిచిన మూడేళ్ల‌లో తిరుప‌తి, ఆళ్ల‌గ‌డ్డ‌ స‌హా మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. అప్ప‌ట్లో లేని వేడి, వాడి ఇప్పుడు నంద్యాల‌లో చోటు చేసుకుంది. వైసీపీ త‌ర‌ఫున గెలిచి టీడీపీలోకి జంప్ చేసిన భూమాను టీడీపీ, వైసీపీ ఏపార్టీకి ఆపార్టీ సెంటిమెంట్‌గా ప్ర‌చారం చేసుకుంటోంది. 

మా పార్టీలో గెలిచాడు కాబట్టి ఇది మాసీట‌ని వైసీపీ చెబుతుండ‌గా.. ఆ పార్టీలో ఉండ‌గా మ‌ర‌ణించాడు కాబ‌ట్టి ఈ సీటు మాద‌ని టీడీపీ వాదిస్తోంది.సీఎం చంద్ర‌బాబు ఈ క్ర‌మంలోనే త‌ల్లీదండ్రీ లేని పిల్ల‌ల‌పై జ‌గ‌న్ పోటీ పెట్టాడంటూ .. సెంటిమెంటు గంధాన్ని అద్దేశారు. అయితే, అస‌లు మంత్రి ఆశ‌తో పార్టీ ఫిరాయింపున‌కు ప్రోత్స‌హించింది కాకుండా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా భూమా ప్రాణం తీసింది ఎవ‌ర‌ని వైసీపీ పెద్ద ఎత్తున మ‌రింత సెంటిమెంటును రాజేస్తోంది. ఇక‌, అధికార పార్టీ చేతికి ఎముక లేకుండా ప్ర‌జ‌ల‌పై వ‌రాల వ‌ర్షం కురిపిస్తోంది. అడిగిన వారికి అడిగినంత అన్న‌ట్టుగా నంద్యాల ప్ర‌జ‌ల స‌క‌ల కోరిక‌ల‌ను క్ష‌ణాల మీద నెర‌వేర్చేస్తోంది. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఉన్న స‌మ‌స్య‌ల‌ను సైతం ప‌రిష్క‌రిస్తోంది. దీంతో గెలుపు త‌మ‌దే న‌ని టీడీపీ అధినేత భావిస్తున్నారు. 

ఇక‌, సెంటిమెంట్ త‌మ‌కు అచ్చివ‌స్తుంద‌ని, శిల్పాకు మంచి పేరుంద‌ని ఈ అనుభ‌వంతో గెలుగు త‌మ‌దేన‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఈ ఎన్నిక‌ను వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. నిత్యం ఈ నియోజ‌క‌వ‌ర్గంపై స‌మీక్షించ‌డం, మంత్రుల‌ను లెక్క‌కు మిక్కిలి ఇక్క‌డ‌కు పుర‌మాయించ‌డం, బోండా ఉమా వంటి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేకి ప్ర‌చార బాధ్య‌త అప్ప‌గించ‌డం జ‌రిగిపోయాయి. ఇక‌, వైసీపీలోనూ మేధావుల‌ను జ‌గ‌న్ రంగంలోకి దింపాడు. బొత్స స‌త్య‌నారాయ‌ణ వంటి కీలక నేత‌ల‌కు ఆయ‌న బాధ్య‌త అప్ప‌గించాడు. తాను కూడా రెండు వారాల పాటు స్వ‌యంగా ప్ర‌చారం చేయాల‌ని, బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. సో.. ఏదేమైనా ఈ వార్‌లో అభ్య‌ర్థుల క‌న్నా.. జ‌గ‌న్‌, బాబుల చుట్టూనే రాజ‌కీయం తిరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.