టీడీపీలో పురుష ఎమ్మెల్యే వ‌ర్సెస్ మ‌హిళా ఎమ్మెల్యే మ‌ధ్య వార్

ఏపీలో అధికార టీడీపీలో పురుష ఎమ్మెల్యే వ‌ర్సెస్ మ‌హిళా ఎమ్మెల్యే మ‌ధ్య వార్ జ‌రుగుతోంది. అధికార పార్టీకే చెందిన ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పంతానికి పోవ‌డంతో ఇప్పుడు అధిష్టానానికి పెద్ద చిక్కే వ‌చ్చిపడింది. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీకి ప్ర‌జ‌ల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దీంతో 48 వార్డుల్లో 35 చోట్ల టీడీపీ సైకిల్ జోరు సాగింది. ఇక‌, మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ల ఎన్నిక ప‌రోక్షం కావ‌డంతో అధికారులు ఇప్ప‌టికే నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16 లాస్ట్ డేట్‌గా కూడా నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో మేయ‌ర్ ప‌ద‌వి కోసం అధికార పార్టీలోని న‌లుగురు మ‌హిళా మ‌ణులు నువ్వా నేనా అనే రేంజ్‌లో పోటీకి దిగారు. ఇక‌, ఇప్పుడు డిప్యూటీ మేయ‌ర్ వంతు వ‌చ్చింది. దీనికి కూడా ఫుల్లు డిమాండ్ ఏర్ప‌డింది. ఈ ప‌ద‌విని త‌మ‌కు కేటాయించాలంటే.. త‌మ‌కే కేటాయించాల‌ని రెండు సామాజిక వర్గాల వారు కోరుతున్నారు. 

ఈ క్ర‌మంలోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై వారు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.  అంతేకాకుండా డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వి కోసం టీడీపీకే చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు రెండు వ‌ర్గాలుగా కూడా చీలిపోయారు. కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే వ‌న‌మాడి కొండ‌బాబు, రూర‌ల్ ఎమ్మెల్యే పిల్లి అనంత‌ల‌క్ష్మిలు త‌మ‌త‌మ సామాజిక వ‌ర్గాల‌కే ఈ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టాల‌ని పార్టీ అధినేత‌పై ఒత్తిడి పెంచుతున్నారు. అర్బన్ కు  చెందిన నేత‌ల‌కు మేయర్ పదవి ఇస్తున్నందున రూరల్ కి చెందిన నేత‌ల‌కు డిప్యూటీ ఇవ్వాలనే లాజిక్ తో రెండవ డివిజన్ నుంచి గెలిచిన తన అనుచరుడు కాళ్ళ సత్తిబాబును రూర‌ల్ ఎమ్మెల్యే పిల్లి అనంత ల‌క్ష్మి సిఫార్సు చేస్తోంది. 

దీనికితోడు మ‌రో లాజిక్‌ను కూడా ఆమె వినిపిస్తోంది. మేయ‌ర్ ప‌ద‌విని కాపుల‌కు కేటాయించారు కాబ‌ట్టి… డిప్యూటీ మేయ‌ర్‌ను శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత‌కు ఇవ్వాల‌ని ఆమె డిమాండ్ చేస్తోంది. ఇక‌, అర్బన్ ఎమ్యెల్యే వనమాడి వాద‌న మ‌రోలా ఉంది. మేయ‌ర్ పీఠం కాపుల‌కు ఇచ్చారు కాబ‌ట్టి.. ఆ సామాజిక వ‌ర్గం జ‌నం త‌ర్వాత ఎక్కువ‌గా ఉన్న మత్స్యకార సామాజిక వర్గానికి డిప్యూటీ మేయర్ ఇచ్చి తీరాలని  పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవ‌రి ప్ర‌తిపాద‌న‌కు త‌లొగ్గాలా? అని అధిష్టానం త‌ల‌ప‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రి చంద్ర‌బాబు ఈ చిక్కు ముడిని ఎలా విప్పుతారో చూడాలి.