గెలుపుపై బాబుకు సందేహాలు..అందుకే కొత్త మైండ్‌గేమ్‌

May 12, 2018 at 11:24 am
cbn-tdp-2019

2019 ఎన్నిక‌లకు సీఎం చంద్ర‌బాబు అప్పుడే మైండ్ గేమ్ మొద‌లుపెట్టేశారా?  2014లో `టీడీపీ గెలుపు చారిత్ర‌క అవ‌స‌రం` అంటూ చేసిన ప్ర‌చారాన్నే మ‌ళ్లీ తెర‌పైకి తీసుకొస్తున్నారా?  నాలుగేళ్ల‌లో చేసిన అభివృద్ధిని ప్ర‌చారాస్త్రంగా చేసుకుని ముందుకెళ్లాల్సిన ఆయ‌న‌.. మ‌ళ్లీ ఊక‌దంపుడు ఉప‌న్యాసాలే ఎందుకు ఇస్తున్నారు? ఇంకా ఎన్నిక‌ల‌కు ఏడాది ఉండ‌గానే ఇటువంటి ప్ర‌చారాన్నే ఎందుకు న‌మ్ముకున్నారు?  గెలుపుపై ఆయ‌న‌కు న‌మ్మ‌కం స‌న్న‌గిల్లిందా? అనే సందేహాలు అంద‌రిలోనూ వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న ప్ర‌సంగాల తీరు గ‌మ‌నించిన వారంతా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో గెలుపుపై ఆయ‌న‌కు న‌మ్మ‌కం లేకుండా పోయింద‌ని, అందుకే ప్ర‌జ‌ల్లోకి ఇలాంటి సంకేతాలు పంపిస్తున్నార‌నే చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. విజ‌యంపై ఆత్మ‌విశ్వాసం పోయి.. ఆందోళన మొద‌లైంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. 

 

ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని ఆశించ‌డంలో త‌ప్పేమీ లేదు. కానీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీని గెలిపించ‌క‌పోవ‌డం చారిత్ర‌క త‌ప్పిదం అంటూ ప్ర‌జ‌లతో మైండ్‌గేమ్ ఆడ‌టంతోనే చిక్కులతో పాటు అనేక సందేహాలు వ‌స్తుంటాయి. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యం దగ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ.. ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇలాంటి మైండ్‌గేమ్ స్టార్ట్ చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ప‌డేస్తోంది. స‌వాళ్ల‌తో మొద‌లైన ఏపీ ప్ర‌యాణంలో.. ఆయ‌న అక్క‌డ‌క్క‌డా త‌డ‌బ‌డినా అనుభ‌వంతో వాటిని మేనేజ్ చేసుకుంటూ వ‌చ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు మేనేజ్ చేయ‌డం కుద‌ర‌ద‌ని భావించిన ఆయ‌న‌.. స‌రికొత్త గేమ్ ప్లాన్ అమ‌లుచేయ‌బోతున్నారని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పార్టీ విస్తృత‌స్ధాయి స‌మావేశంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌న‌మంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెల‌వ‌ట‌మ‌న్న‌ది చారిత్ర‌క అవ‌స‌రంగా చంద్ర‌బాబు ప‌దేప‌దే చెప్ప‌డం సందేహాలకు తావిస్తోంది.

 

ఒక‌వైపు పాద‌యాత్ర‌తో ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి దూసుకు పోతున్నారు. మ‌రోవైపు బీజేపీ నేత‌లు చంద్ర‌బాబుపై మైండ్ గేమ్ ఉద్ధృతం చేస్తున్నారు. మిత్రుడిగా భావించిన  జ‌న‌సేనాని కూడా హ్యాండ్ ఇచ్చారు. ఇంకోవైపు అవినీతి ఆరోప‌ణ‌లు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుపై చంద్ర‌బాబులోనే న‌మ్మ‌కం లేక‌పోవ‌డంతోనే ప‌దే ప‌దే గెలుపు గురించి మాట్లాడుతున్న‌ట్లు అంద‌రిలోనూ అనుమానాలు మొద‌ల‌య్యాయి. రాష్ట్ర విభ‌జ‌న‌లో టీడీపీ-బీజేపీల‌కూ భాగ‌స్వామ్యం ఉన్నా జ‌నాలు చంద్ర‌బాబును అంద‌లం ఎక్కించారు. రాష్ట్రానికి అనుభ‌వ‌జ్ఞుడి అవ‌సరం ఉంద‌ని ఆలోచించి సీఎం పీఠం క‌ట్ట‌బెట్టారు. అయితే త‌ర్వాత ఆ సీనియార్టీని ఉప‌యోగించి చేసిందేమిటో అంద‌రికీ తెలిసిందే!

 

2014 ఎన్నిక‌ల్లో సీఎంగా చంద్ర‌బాబు ఉండ‌టం అవ‌స‌ర‌మ‌ని జ‌నాలు న‌మ్మి అధికారం అప్ప‌గించినా.. ఆ న‌మ్మకాన్ని  నిల‌బెట్టుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యారనే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. ఎన్నిక‌ల్లో గెల‌వ‌ట‌మే ల‌క్ష్యంగా ఆచ‌ర‌ణ కాని హామీలు గుప్పించి.. వాటిని పూర్తిగా అమ‌లు చేయ‌లేద‌నే అప‌కీర్తి మూట‌గ‌ట్టుకున్నారు. ఇక ప్ర‌త్యేక‌హోదా, రైల్వే జోన్, పోలవ‌రం వంటి అంశాలు ఆయ‌న‌కు మ‌చ్చ‌గానే మిగిలిపోయాయి. వీటికితోడు ప్ర‌భుత్వంపై అవినీతి ఆరోప‌ణ‌లు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చేస్తున్న స‌రికొత్త ప్ర‌చారం ఎంత వ‌ర‌కూ సత్ఫ‌లితాలు ఇస్తుందో వేచిచూడాల్సిందేనంటున్నారు విశ్లేష‌కులు.

గెలుపుపై బాబుకు సందేహాలు..అందుకే కొత్త మైండ్‌గేమ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share