
రాజకీయ వ్యూహ చతురతలో ఏపీ సీఎం చంద్రబాబు నాలుగు ఆకులు ఎక్కువగానే చదివినట్టు తెలుస్తోంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టిన చందంగా అవకాశవాద రాజకీయాలకు ఆయన తెరదీస్తున్నారు. తనకు అనుకూలంగా ఉంటే.. హైదరాబా ద్ గడ్డపై అడుగు కూడా పెట్టనివ్వనని అన్న నరేంద్ర మోడీతో సీటు పంచుకున్నారు. నాలుగేళ్లు కాపురం చేశారు. అంతేకా దు, ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదాను సైతం అటకెక్కించారు. ఇక, తనకు చెడేసరికి మోడీ నేడు కేడీ అయ్యారనే ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. వద్దన్న నోటితోనే ప్రత్యేక హోదా అవసరమని ప్రకటించారు. దీనికోసం ధర్మ పోరాటం అంటూ ప్రజాధనాన్ని మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు.
మరి ఇలాంటి చంద్రబాబు అత్యంత కీలక మైన ఎన్నికల సమయంలో ఏం చేయాలో అదే చేస్తున్నారు. ముందస్తు ముచ్చటకు తెరదీసిన తెలంగాణాలో టీడీపీని గట్టుకు చేర్చేందుకు ఇప్పటికే వెంటిలేటర్‌పై పడి ఉన్న టీడీపీ ని బతికించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. బద్ధ శత్రువే అయినా రాజకీయ ప్రయోజనాల ముందు ఇవేవీ ప్రాతిపదికలు కావని చంద్రబాబు భావించి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే, కాంగ్రెస్‌తో కలవడం ద్వారా టీఆర్ ఎస్‌కు కోపం తెప్పించడం ఖాయమనేది చంద్రబాబుకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు.
ఏదేమైనా ఏపీ మూలాలున్న వారికి ఒకింత టీడీపీపై అభిమానం లేకపోదుగా.. వారి ఓట్లు ఇప్పుడు కాంగ్రెస్‌కు పడే ఛాన్స్ ఉంటుంది. దీనిని గమనించిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఇది అపవిత్ర పొత్తుగా అభివర్ణించారు. ఇక, ఎన్నికలు సమీపించే సరికి.. ఈ దూకుడు దాడి మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిని గమనించిన చంద్రబాబు కేసీఆర్ దూకుడు, దాడి నుంచి తనను తాను రక్షించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఏకంగా తన మనసు లో కేసీఆర్‌తోనే కలిసి ముందుకు వెళ్లాలని ఉందని పెద్ద బిస్కట్ వేశారు. ఇక, దీనిని బీజేపీ చెడగొట్టిందని ఆయన నెపం మొత్తాన్ని బీజేపీ పై తెలివిగా నెట్టారు. ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన మోడీపై విరుచుకుపడ్డారు.
అయితే, చంద్రబాబు చెప్పినట్టు ఈయన వెళ్లి టీఆర్ ఎస్తో పొత్తుకు రెడీ అయితే మాత్రం ఆ పార్టీ నేతలు ఎలా ఒప్పుకొంటారు? అనేది ప్రధాన ప్రశ్న. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబును కేసీఆర్ మచ్చిక చేసుకుంటారని ఎలా అనుకుంటారు? ఎవరు అనుకుంటారు? కేవలం తెలంగాణ ఎన్నికల్లో తనను ఎవరూ విమర్శించకుండా,, ముఖ్యంగా టీఆర్ ఎస్ నుంచి దాడిని తప్పించుకునేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడే ఈ ప్రకటన, దాడి అని అంటున్నారు విశ్లేషకులు.