కేసీఆర్ ధైర్యం.. బాబులో క‌నిపించ‌ట్లేదే!

May 11, 2018 at 4:10 pm
cbn-kcr

కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులదీ చెరో దారి! ఒక‌రు స్లో అండ్ స్ట‌డీగా ఒక‌టికి ప‌దిసార్లు ముందు వెనుక ఆలోచిస్తే.. మ‌రొక‌రు దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో దిట్ట‌గా పేరొందారు. ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌ల విష‌యంలోనూ ఇద్ద‌రి మ‌ధ్య వ్య‌త్యాసం చాలానే క‌నిపిస్తోందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఈ ఎన్నిక‌ల‌ను గ‌డువులోగా నిర్వ‌హించి తీరుతామ‌ని స్ప‌ష్టంచేస్తుంటే.. ఏపీ సీఎం చంద్ర బాబు మాత్రం వీటి ఊసే ఎత్త‌డం లేదు. మ‌రికొన్ని నెల‌ల్లో అత్యంత‌ కీల‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌స్తుండ టంతో ఆచి తూచి అడుగులేస్తున్నారు చంద్ర‌బాబు. పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ ప్ర‌భావం త‌ప్ప‌నిస‌రిగా అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ప‌డుతుంద‌నే ఆయ‌న ఇలా మౌనంగా ఉన్నారంటున్నారు విశ్లేష‌కులు. ధైర్యంగా ఎన్నిక‌ల్లో పాల్గొని ప్ర‌త్య‌ర్థుల‌కు విజ‌యంతో స‌మాధానం చెప్పాల్సిన స‌మ‌యంలో ఇలా త‌ట‌ప‌టాయించ‌డంపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.   

 

తెలంగాణ‌లో కంటే ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం మ‌రింత హీటెక్కుతోంది. రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌థ‌కాల‌తో దూసుకుపోతూనే.. ప్ర‌తిప‌క్షాల‌కు ఏమాత్రం అవ‌కాశం దొరక్కుండా అన్ని వ‌ర్గాలపైనా ప‌ట్టు సాధించారు కేసీఆర్‌. ఇక ఏపీలో ప‌రిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఒక‌ప‌క్క ప్ర‌భుత్వంపై అవినీతి ఆరోప‌ణ‌లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి, హోదా విష‌యంలో పోరాటం చేసినా అంత సానుకూల స్పంద‌న రావ‌డం లేదు. ఇక మ‌రోప‌క్క ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పాదయాత్ర ప్ర‌జ‌ల్లోకి వెళుతోంది. ఇక బీజేపీ, జ‌న‌సేన పార్టీలు ప్ర‌భుత్వ అవినీతిపైనే ఎక్కువ‌గా దృష్టిసారించాయి. త‌న సీనియారిటీని అంతా ఉప‌యోగించినా.. ప‌రిస్థితులు ఒక కొలిక్కి రావ‌డం లేదు. అటు క్యాడ‌ర్‌లోనూ ఆత్మ‌విశ్వాసం దెబ్బ‌తింటోంది. ఇవ‌న్నీ చంద్ర‌బాబును ఉక్కిరిబిక్కిరి చేసిపాడేస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల న‌గారా ఆయ‌నకు త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతోంది. 

 

ఇప్పుడు పంచాయతీ ఎన్నికల సీజన్ వచ్చింది. ఆగస్టు 1న ప్రస్తుతం ఉన్న స్థానిక సంస్థల పదవీకాలం ముగుస్తుంది. నిబంధనల ప్రకారం 2వ తేదీ నాటికి కొత్త పాలక వర్గాలు గద్దె ఎక్కాలి. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్, ప్రభుత్వానికి లేఖ రాశారు. వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అందులో సూచించారు. ఈ విషయంలో కేసీఆర్ చాలా తెగువగా వ్యవహరిస్తున్నారు. గడువులోగా ఎన్నికలు పూర్తిచేస్తాం అని కేసీఆర్ ప్రకటించారు. కానీ చూడబోతే, చంద్రబాబుకు కేసీఆర్ కు ఉన్నంత ధైర్యం లేదేమో అనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాతి 6-8నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి మీద ప్రభావం చూపేట్లయితే పుట్టి మునుగుతుందని చంద్రబాబు భయపడుతూ ఉండచ్చ‌ని పలువురు అనుకుంటున్నారు.

 

వచ్చే ఎన్నికల్లో మొత్తం 175స్థానాలు గెలవాలని పడికట్టు పదాలు ఉపయోగించే ఆయన, పంచాయతీ ఎన్నికలకు పూనుకోవడం ద్వారా తన ధైర్యం నిరూపించుకునే ప్రయత్నం చేయడం లేద‌నే చ‌ర్చ మొద‌లైంది. ఈ ఏడాది ప్రారం భంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పంచాయతీ ఎన్నికలకు కేవలం పది లక్షలు మాత్రం కేటాయించినప్పుడే.. చంద్రబాబు సర్కార్ ఉద్దేశం ఏమిటో అందరికీ అర్థమైపోయింది. కొన్ని నగర కార్పొరేషన్ లకే ఎన్నికలు నిర్వహించ కుండా చాలా కాలంగా జాగుచేస్తున్న బాబు సర్కార్.. పంచాయతీలకు పెడుతుందనుకోవడం భ్రమేనంటున్నారు విశ్లేష‌కులు. 

సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల‌ ప్రజా ప్రయోజనాలకు తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్ని నష్టాలున్నారాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు పంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించడం జరగదని స్ప‌ష్టంచేస్తున్నారు. 

కేసీఆర్ ధైర్యం.. బాబులో క‌నిపించ‌ట్లేదే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share