కేంద్రంపై బాబు అస్త్రాల‌న్నీ రివ‌ర్స్ అవుతున్నాయే!

May 10, 2018 at 4:19 pm
cbn-modi-central

కేంద్రంపై యుద్ధ‌మేమో గానీ ఏపీ సీఎం చంద్ర‌బాబు తీరు మాత్రం రాష్ట్ర‌ ప్ర‌జ‌లపై తీవ్ర భారాన్ని మోపేలా ఉందనే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాష్ట్రాన్ని తీవ్ర అన్యాయం చేస్తోందంటూ బీజేపీ ప్ర‌భుత్వంపై వార్ ప్ర‌క‌టించారు టీడీపీ అధినేత‌. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏ ప‌ని చేప‌డుతున్నా ఆర్థికంగా అడ్డు త‌గులుతోందంటూ ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. కేంద్రం చేయ‌క‌పోతే తామే ఆ ప‌నులు చేసుకుంటామంటూ ప్ర‌క‌టించేస్తున్నారు. ఇప్పుడు ఇదే రాష్ట్ర ప్ర‌జ‌ల్లో అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తోంది. విభ‌జ‌న‌తో తీవ్ర లోటుతో ఉన్న రాష్ట్రంలో ఉద్యోగుల‌కు జీతాలు, పింఛ‌న్లు ఇవ‌న్నీ ఇచ్చే స‌రికి నిధులు వెతుక్కోవాల్సిందే! ఈ నేప‌థ్యంలో భారీ వ్య‌యంతో కూడుకున్న పోల‌వ‌రం, రాజ‌ధాని నిర్మాణం వంటివ‌న్నీ మేమే చేసుకుంటామ‌ని చెబుతుండ‌టం అందరినీ ఆశ్య‌ర్య‌ప‌రుస్తోంది. ఇప్పుడు జాతీయ ర‌హ‌దారులు కూడా తామే బాగుచేసుకుంటామంటూ చెబుతున్న తీరుపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. 

 

కేంద్రం తీర‌ని అన్యాయం చేస్తోందంటూ చంద్ర‌బాబు.. యుద్ధం ప్ర‌క‌టించారు. వీలైనంతంగా కేంద్రాన్ని నిల‌దీస్తూ.. ధ‌ర్మ‌పోరాటం చేస్తున్నాన‌ని, రాష్ట్ర ప్రయోజ‌నాలే ముఖ్య‌మని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్నా.. కేంద్రం ఆర్థిక సాయం చేయ‌క‌పోతే తామే అవ‌న్నీ నిర్మించేసుకుంటామ‌ని చెబుతుండ‌టం ఇప్పుడు అంద‌రినీ విస్తుపోయేలా చేస్తోంది. పోల‌వ‌రం నిర్మాణానికి నిధులు ఇవ్వరా? అయితే మేమే కట్టుకుంటాం! రాజధానికి నిధులు ఇవ్వరా?! అయితే మేమే నిర్మించుకుంటాం. ఏపీలోని జాతీయ రహదారులు బాగుచేయరా? అయితే మేమే చేసుకుం టాం. ఈ రహదారులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ రహదారులు అని పేరు పెట్టుకుంటామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించేశారు. కేంద్రంపై ధ‌ర్మ‌పోరాటం చేస్తున్నామంటే ఇదేనా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.  

 

పోలవరం, రాజధాని నిర్మాణం వంటి అంశాలు విభజన చట్టంలో విస్పష్టంగా ఉన్నాయని.. అలాంటి వాటి విషయంలో చంద్రబాబు ధోరణి ఏ మాత్రం సరిగాలేదనే వాదన ప్రభుత్వ వర్గాల నుంచే వినిపిస్తోంది. ప్రతి విషయంలో చంద్రబాబు ఇదే ధోరణి అవలంబిస్తే ఏపీ ప్రజలపై భారీ ఎత్తున భారం మోపినట్లు అవుతుందని చెబుతున్నారు. చంద్రబాబు వైఫల్యాలకు ప్రజలు ఎందుకు భారం మోయాలి? అని ప్రశ్నిస్తున్నారు. అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి కానీ.. ఇదేదో వ్యక్తిగత వ్యవహారంలా ప్రవర్తించటం సరికాదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని నిర్మాణం, మౌలికసదుపాయాలకు కేంద్రం ఖచ్చితంగా నిధులు ఇవ్వాల్సి ఉన్నా…అది 33 వేల ఎకరాల్లో నిర్మాణానికి ఇవ్వదు అనే విషయం అందరికీ  తెలిసిందే. 

 

రాజధానికి కేంద్రం నుంచి ఎంత సాయం వస్తుందనే అంశంపై ప్రభుత్వంలో కొనసాగిన నాలుగేళ్లలో ఓ అంగీకారానికి కూడా రాలేకపోవటం దారుణమని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రాజధాని నిర్మాణం.. మౌలికసదుపాయాల కల్పనకు దాదాపు ఏభై వేల కోట్ల రూపాయల వరకూ అవసరం అవుతాయని ఏపీసీఆర్ డీఏ అంచనా వేస్తోంది. ఈ విషయాన్ని కేంద్రం ముందు పెట్టి.. ఓ అంగీకారానికి వచ్చే ప్రయత్నమే జరగలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటు న్నాయి. పైగా ప్రతి విషయంలో ఏదో చిన్న పిల్లాడు అలిగినట్లు ఇలా అయితే అన్నీ తామే చేసుకుంటామని వ్యాఖ్యానించటం ఏమిటని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మ‌రి చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలి ఎంత త్వ‌ర‌గా మారితే అంత మంచిద‌ని సూచిస్తున్నాయి. 

కేంద్రంపై బాబు అస్త్రాల‌న్నీ రివ‌ర్స్ అవుతున్నాయే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share