చంద్ర‌బాబు వ్యూహం బెడిసికొడుతుందా?

October 17, 2018 at 10:56 am

రాజ‌కీయాల్లో వ్యూహాలు కామ‌న్‌. ఇవి లేకుంటే రాజ‌కీయాలే ఉండ‌వని అంటారు. ముఖ్యంగా రాజ‌కీయ అప‌ర‌చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు.. వ్యూహం వేస్తే.. తిరుగు ఏముంటుంది?- టీడీపీ నాయ‌కులు త‌ర‌చుగా అనే మాట‌. ఎక్క‌డ త‌గ్గాలో.. ఎక్క‌డ నెగ్గాలో తెలిసిన వ్య‌క్తిగా ఆయ‌న‌కు పెద్ద పేరు కూడా ఉంది. గ‌త ఎన్నిక‌ల‌నే తీసుకుంటే.. ఆయ‌న ప‌ట్టుబ‌ట్టి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను త‌న‌కు అండ‌గా నిల‌బెట్టుకున్నారు. అదేస‌మ‌యంలో కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న బీజేపీ పీఎం అభ్య‌ర్థి న‌రేంద్ర మోడీని కూడా త‌న ప‌క్క‌న పెట్టుకున్నారు. ఏపీలో విస్తృతంగా ప్ర‌చారం చేయించుకున్నారు. అయితే, ఇప్పుడు వారిద్ద‌రితోనూ రాజ‌కీయంగా బాబుకు బెడిసి కొట్టింది. ఇందులో ఒక్క న‌రేంద్ర మోడీ విష‌యంలోనే చంద్ర‌బాబు దూరంగా ఉండ‌గా, ప‌వ‌న్ విష‌యంలో మాత్రం బాబు ఇప్ప‌టికే పాజిటివ్‌గానే ఉన్నారు. ప‌వ‌న్ విష‌యంలో చంద్ర‌బాబు సానుకూలంగానే స్పందిస్తున్నారు.

క‌ట్ చేస్తే.. ఎన్నిక‌ల‌కు మ‌రో ఆరు మాసాలే స‌మ‌యం ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏపీలో రాజ‌కీయాలు కూడా భారీ ఎత్తున మారిపోతున్నాయి. ఒక‌ప‌క్క విప‌క్షం వైసీపీ నాయ‌కుడు జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌తో దూసుకుపోతున్నారు. మ‌రోప‌క్క‌, త‌న‌కు అండ‌గా ఉంటాడని భావించిన ప‌వ‌న్ కూడా సొంత కుంప‌టితో సై! అంటున్నాడు. ఈ నేప‌థ్యంలో బాబు ఎలా ముందుకు వెళ్లాలి? ఏ రాష్ట్రంలో అయినా.. ప్ర‌భుత్వాలు ఎన్ని ప‌థ‌కాలు అమ‌లు చేసినా.. సీఎం ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. కింది స్థాయిలో నేత‌లు చేసే రాజ‌కీయాల ఫ‌లితంగా స‌హ‌జంగానే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ప‌ట్టి పీడిస్తుంది. ఇప్పుడుఏపీలోనూ చంద్ర‌బాబు అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టారు. సంతృప్త సూచీ అంటూ పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు సేక‌రిస్తున్నారు. అయితే, ఆయ‌న ఆశించిన మేర‌కు ప్ర‌భుత్వంపై సంతృప్తి ల‌భించ‌డం లేదు. దీంతో రాష్ట్రంలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీకి ఎదురు గాలి వీస్తోంది. దీంతో ఆయ‌న వ్యూహాత్మ‌కంగా వెళ్లాల‌ని నిర్ణ‌యించారు.

దీనికిగాను ఆయ‌న ఎంచుకున్న సూత్రం కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకోవ‌డం, పొత్తు పెట్టుకోవ‌డం. అయితే, ఇది లోపాయికారీగా ఉండాలా? లేక బ‌హిరంగంగానే పొత్తు పెట్టుకోవ‌చ్చా? అనే ప్ర‌శ్న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నిజానికి ఏపీ ప్ర‌జ‌లు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఎదురు చూస్తున్న అంశం ప్ర‌త్యేక హోదా! దీనిని కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తాను కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఇస్తాన‌ని చెప్పారు. తొలి సంత‌కం కూడా దానిపైనే అని ఉద్ఘాటించారు. మ‌రి ఇది ప్ర‌జ‌ల్లో బాగానే వెళ్లినా.. కాంగ్రెస్‌కు మాత్రం ఆశించిన మేర‌కు మైలేజీ మాత్రం రాలేదు. ఎవ‌రూ కాంగ్రెస్‌ను విశ్వ‌సించ‌డం లేదు. వాస్త‌వానికి రాహుల్‌తో ఈ ప్ర‌క‌ట‌న చేయించింది కూడా చంద్ర‌బాబేన‌ని తాజాగా వెలుగు చూస్తున్న విష‌యం. ఇలా అయినా.. ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు మొగ్గు చూపితే.. టీడీపీ బ‌ల‌హీనంగా ఉన్న కొన్ని స్థానాల‌ను కాంగ్రెస్‌కు క‌ట్ట‌బెట్ట‌డం ద్వారా ఆయా స్థానాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తే.. దానిని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని బాబు ప్ర‌ణాళిక‌. అయితే, కాంగ్రెస్ వేసిన బిస్క‌ట్ల‌కు ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల నుంచి ఆశించిన స్పంద‌న రాలేదు. దీంతో ఇప్పుడు అస‌లు కాంగ్రెస్ మాటే ఎత్త‌డం మానేశారు చంద్ర‌బాబు. రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తుఅంటే .. ప్ర‌జ‌లు కూడా విశ్వ‌సించ‌ర‌నే భావ‌న‌లోనే ఆయ‌న ఉన్నారు. మొత్తానికి ఈ ప‌రిణామంతో చంద్ర‌బాబు వ్యూహం బెడిసి కొడుతుంద‌నే అంటున్నారు సీనియ‌ర్లు. ఈ నేప‌థ్యంలో ఒంట‌రిగానే పోరుకు దిగాల‌ని, అయితే, బ‌ల‌హీనంగా ఉన్న స్థానాల్లో ఏం చేయాల‌నే భావ‌న‌తో బాబు ఉన్నార‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. మరి ఏం జ‌రుగుతుందో చూడాలి.

చంద్ర‌బాబు వ్యూహం బెడిసికొడుతుందా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share