బాబు డైరెక్ష‌న్‌లో భ‌జ‌న‌.. మీకే ఇబ్బంది త‌మ్ముళ్లు!

January 11, 2019 at 11:58 am

ఏ గూటి చిల‌క ఆగూటి ప‌లుకే ప‌లుకుతుంది!- అంటారు. రాజకీయాల్లో ఇలాంటి కామెంట్లు నిజం చేస్తున్నారు నాయ‌కు లు. ముఖ్యంగా టీడీపీలో అధినేత చంద్ర‌బాబుపై ఈగ వాల‌కుండా చూస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి జంప్ చేసి టీడీపీలో చేరిపోయిన నాయ‌కులు గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ల కోసం జ‌గ‌న్ చుట్టూ తిరిగిన నాయ‌కులు కూడా ఇప్పుడు బాబు డైరెక్ష‌న్ మేర‌కు నోటికి ప‌ని చెబుతున్నారు. జ‌గ‌న్‌పై విరుచుకుప‌డుతున్నారు. తన అవసరాల కోసం మోడీ, కేసీఆర్‌కు, సోనియాకు అమ్ముడుపోయిన చరిత్ర జగన్‌దే. ఆయనకు మమ్ముల్ని విమర్శించే నైతిక హక్కు లేదు. అని వైసీపీ జంపింగ్ మంత్రులు వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

‘సంతలో పశువుల మాదిరిగా వారిని టీడీపీ కొనుగోలు చేసింది’ అని జగన్‌ చేసిన విమర్శకు స్పందనగా మంత్రులు అమర్‌నాథ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, భూమా అఖిలప్రియ, సుజయ్‌ కృష్ణ రంగారావు, పలువురు ఎమ్మెల్యేలు కలిసి సంయుక్తంగా మాట‌ల దాడి చేశారు. మీ అవినీతి కేసుల నుంచి బయట పడటానికి మోడీకి అమ్ముడుపోయారు. కాంట్రాక్ట్‌ పనుల కోసం కేసీఆర్‌కు అమ్ముడుపోయారు. చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై బయటకు రావడానికి సోనియా గాంధీకి అమ్ముడుపోయారు. అంటూ వ్యాఖ్యలు సంధించారు. అయితే, ఇక్క‌డే వారు అడ్డంగా దొరికిపోయారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన విష‌యాల‌ను జోడించి జ‌గ‌న్‌పై దాడిచేయ‌డాన్ని సోష‌ల్ మీడియాలో ప్ర‌జ‌లు దుమ్మెత్తి పోస్తున్నారు.

విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌క పోయినా.. వాస్త‌వాల‌ను ప‌క్క‌న పెట్టి కేవ‌లం బాబు మెప్పుకోస‌మే అన్న‌ట్టుగా వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని విమ‌ర్శిస్తున్నారు. జంపింగ్ మంత్రులకు ఇప్పుడు వారివారినియోజ‌క‌వ‌ర్గాల్లో తీవ్ర‌మైన ఎదురు గాలులు వీస్త‌న్నాయి. పైగా ఆధిప‌త్య పోరులో త‌ల‌మున‌క‌లై ఉన్నారు. ఈ న‌లుగురు మంత్రులకు ఓట‌మిఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు వీరికి టికెట్ ఇవ్వ‌డం కూడా క‌ష్ట‌మ‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఒక‌వేళ త‌ప్పదు కాబ‌ట్టి ఇచ్చినా.. గెలిచే స‌త్తా లేదు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబును మ‌చ్చిక చేసుకునేందుకు ఇలా వ్యాఖ్య‌లు సంధిస్తున్నార‌ని నెటిజ‌న్లు అంటున్నారు. సోనియాగాంధీకి అమ్ముడు పోయిన విష‌యం తెలిసిన‌ప్పుడు, నాడు పార్టీలోనే జ‌గ‌న్ చెంత‌నే ఉన్న ఈ ప్ర‌బుద్ధులు ఎందుకు ఖండించ‌లేదో చెప్పాల‌ని నిల‌దీస్తున్నారు. ఏదేమైనా భ‌జ‌న మితిమీరితే.. త‌మ‌కే న‌ష్ట‌మ‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు.

బాబు డైరెక్ష‌న్‌లో భ‌జ‌న‌.. మీకే ఇబ్బంది త‌మ్ముళ్లు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share