ఆ వైసీపీ ఎమ్మెల్యే గుడ్‌… మైన‌స్ అంతా బాబుకే

May 30, 2018 at 10:47 am
babu-ycp

ఆయ‌న క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే.. ఐజ‌య్య. 2014లో జ‌గ‌న్ పార్టీ వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన ఈయ‌నకు ప్ర‌జ‌ల్లో మంచి సానుభూతి ఉంది. వివాద ర‌హితునిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండే వ్య‌క్తిగా ఆయన గుర్తింపు సాధించారు.  అయితే, నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి విష‌యానికి వ‌స్తే మాత్రం.. ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఉంది ప‌రిస్థితి. ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధి అంతంత మాత్రమే. హామీలు అమలు కాలేదు. గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబుకు పలుమార్లు విన్నవించినా ఫలితం కనిపించలేదు. 

 

ఫ‌లితంగా నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డి అభివృద్ధి అక్క‌డే ఆగిపోయింది. మ‌రో ప‌క్క‌, ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్నాయి. దీంతో ఐజ‌య్య ఇప్పుడు యాంటీ ప్ర‌చారానికి తెర‌దీశారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేయాల‌ని త‌న‌కు ఎంతో ఉంద‌ని, అయితే, ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే తాను ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేక‌పోతున్నాన‌ని ప్ర‌జ‌ల‌కు సంపూర్ణంగా వివ‌రిస్తున్నారు. ఈ ప‌రిణామం చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి తీవ్ర విఘాతం క‌లిగించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌జ‌ల్లో ఎమ్మెల్యేపై ఎలాంటి వ్య‌తిరేక‌తా లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ప్ర‌భుత్వం ఇవ్వ‌క‌పోతే.. ఆయ‌న మాత్రం ఏం చేస్తాడు అనే కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. 

 

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఐజ‌య్య విజ‌యం సాధించే అవ‌కాశం లేక‌పోలేద‌ని చెబుతున్నారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండే.. ఐజ‌య్య‌.. నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు తెప్పించేందుకు ఎంతోకృషి చేశారు. టీడీపీ నాయకులకు ప్రతిపాదిత పనులకు 60 శాతం నిధులు ఇస్తే.. ఎమ్మెల్యేగా తాను ప్రతిపాదించిన పనులకు 40 శాతం నిధులు ఇవ్వాలని సీఎంకు ఆయ‌న వివ‌రించారు. ముఖ్యంగా ఇది రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఎస్సీ సబ్‌ప్లాన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా యువతకు రుణాలు ఇవ్వాలని విన్నవించినా.. ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న అంతంత మాత్రంగానే ఉండిపోయింది. దీంతో ఇక్క‌డ అభివృద్ధి జ‌ర‌గ‌డం లేదు. ఓవ‌రాల్‌గా చూస్తే ఐజ‌య్య హిట్ అయితే వ్య‌తిరేక‌త అంతా బాబు ప్ర‌భుత్వానిదే అన్న‌ట్టుగా అక్క‌డ పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం ఉంది.

 

అయినా కూడా ఐజ‌య్య ఎలాంటి జంకు లేకుండా ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. ప్ర‌జ‌లు త‌న‌ను ఆశీర్వ‌దిస్తార‌ని ఆయ‌న చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా జ‌గ‌న్ అధికారంలోకి రాకుండా పోర‌ని ఎదురు చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల‌లో ఐజ‌య్య ప్ర‌ముఖులు. మ‌రి ఈయ‌న క‌ల సాకార‌మై జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని అబివృద్ధి చేస్తాన‌ని చెబుతున్నారు ఐజ‌య్య‌. మొత్తంగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి లేక‌పోయినా.. ఎమ్మెల్యేని ప్ర‌జ‌లు ఆరాధిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

ఆ వైసీపీ ఎమ్మెల్యే గుడ్‌… మైన‌స్ అంతా బాబుకే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share