
రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి టర్న్‌లు తీసుకుంటాయో చెప్పడం కష్టం. ఎవరికి ఎలాంటి వ్యూహం ఉంటుందో.. ఎవరికి ఎలాంటి అవకాశం వస్తుందో కూడా చెప్పడం కష్టం. రాజకీయాల్లో స్థితిగతులను అంచనా వేయడం కూడా ఇబ్బందికరం గా నే ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏ విషయాన్నయినా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సీఎం చంద్రబాబు సిద్ధ హస్తుడిగా మారిపోయారు. అనుకూల వ్యతిరేక విషయాలను సైతం ఆయన తనకు పాజిటివ్‌గా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక హోదా విషయంలో ఆయన నాలికకు నరంలేకుండా పోయిందనే వాదన కూడా వచ్చింది.

ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేంటని ప్రశ్నించిన నాయకుడుగా చంద్రబాబు విషయం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అదే సమయంలో హోదా కోసం ఉద్యమం చేసిన వారికి చుక్కలు చూపించారు. అయితే, ప్రజల మనోభావాలు మాత్రం ప్రత్యేక హోదా చుట్టూతానే తిరుగుతున్నాయని తెలియడంతో ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నారు. ప్రత్యేక హోదా పై యూటర్న్ తీసుకున్నారు. ధర్మపోరాట దీక్షలకు కూడా దిగారు. ఇక, ఇప్పుడు ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో మరింత తీవ్రంగా హోదా కోసం పోరుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఏపీ భవన్లో చంద్రబాబు దీక్ష చేపట్టారు. దీనికి భారీ ఎత్తున ప్రజలను సమీకరించారు కూడా!

వచ్చే ఎన్నికలకు సంబంధించి మళ్లీ విజయం సాధించాలనే కృత నిశ్చయంతో ఉన్న చంద్రబాబు హోదా విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పోరాటాలకు దిగుతున్నారు. అయితే, నిన్న మొ న్నటి వరకు హోదా అవసరం లేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకుని దీక్షలకు దిగుతుంటే.. ప్రజలకు మాత్రం వాస్తవాలు తెలియవా? అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో తన విజయం కోసం బాబు నాటకాలు ఆడుతున్నారనే వారు కూడా ఉన్నారు. మొత్తంగా పరిశీలిస్తే.. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక రకమైన ఇబ్బంది కర వాతావరణం కనిపిస్తోందని చెప్పకతప్పదు! మరి దీనిని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఢిల్లీ దీక్షలతో వచ్చేది చంద్రబాబుకు రాజకీయ లబ్ధి తప్ప.. ఏపీకి ప్రత్యేక హోదా మాత్రం కాదు!