ఏపీలో వైరం.. తెలంగాణ‌లో స్నేహం.. డ్యుయెల్ గేమ్‌

October 5, 2018 at 10:49 am

ఒకే ఒర‌లో రెండు క‌త్తులు ఇమ‌డ‌వు.. అనేది నానుడి! కానీ ఒకేసారి ప్రేమ‌, వైరం అనే రెండు క‌త్తులను ఇముడ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు ఏపీ సీఎం చంద్ర‌బాబు, కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ! రాజ‌కీయాల్లో శాశ్వ‌త శత్రువులు.. మిత్రులు ఉండ‌ర‌నే మాట కూడా వినిపిస్తుంది. కానీ ఏక‌కాలంలో.. అటు శ‌త్రువులుగా.. ఇటు మిత్రులుగా ఉండ‌టం కూడా వీరికే చెల్లింది! రెండు రాష్ట్రాల్లో రాజ‌కీయ ప‌రిణామాలు చిత్ర‌విచిత్రంగా మారాయి. ముఖ్యంగా టీడీపీ-కాంగ్రెస్ మ‌ధ్య గ‌ల రాజ‌కీయ `బంధం` గురించే ఇప్పుడు ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ఆనాడు రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభజించి ఏపీకి కాంగ్రెస్‌ అన్యాయం చేసింద‌ని.. సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే అన్ని స‌భ‌ల్లో చెబుతూ వ‌స్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, బీజేపీ ల‌క్ష్యంగా ప్ర‌చారానికి సిద్ధ‌మ‌వుతున్నా రు. ఇక మ‌రోప‌క్క అదే కాంగ్రెస్‌తో పొత్తుకు ప‌చ్చ‌జెండా ఊపారు. వీట‌న్నింటినీ ఆస‌క్తిగా గ‌మ‌నించిన కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ కూడా.. కొత్త పాత్ర‌లో ఒదిగిపోయారు. మొన్న ఏపీకి వ‌చ్చిన ఆయ‌న‌.. ఏపీ ప్ర‌భుత్వం, చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేయ‌క‌పోవ‌డం కూడా ఆస‌క్తిగా మారింది.

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. అటు కాంగ్రెస్‌, టీడీపీ, ఇత‌ర పార్టీలు.. మ‌హా కూట‌మి పేరుతో ఒకే గొడుగు కింద‌కు చేరాయి. మ‌రీ ముఖ్యంగా కాంగ్రెస్ వ్య‌తిరేక పునాదుల‌పై నిర్మించిన టీడీపీ.. అదే పార్టీతో జ‌త కడుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. కానీ రాజ‌కీయ అవ‌స‌రాల రీత్యా చేతులు క‌ల‌పాల్సి వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో ఏపీలో మాత్రం ఈరెండు పార్టీలు విరోధులుగా ఉండ‌టం విశ్లేష‌కుల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీల పొత్తు, ఏపీ సీఎం చంద్ర‌బాబుపై అటు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్‌.. ఇత‌ర ముఖ్యులంతా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. చంద్ర‌బాబు రాకాసి అని, తెలంగాణ ద్రోహి అంటూ కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ ఆత్మ‌కు కూడా చంద్ర‌బాబు వెన్నుపోటు పొడిచారంటూ కేటీఆర్.. ఆరోపించారు. అయితే పొత్తు వ‌ల్ల ఎవ‌రికి లాభం ఎవ‌రికి న‌ష్టం అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ఒక చోట ఫైటింగ్. మరో చోట ప్రేమ. ఇదీ కాంగ్రెస్ స్టైల్. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ కు పెద్దగా పోయేదేమీ లేదు. వస్తే తెలంగాణలో అధికారంలోకి వస్తారు. అయితే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి ఇది ఓ పెద్ద సమస్యగా మారబోతోంది.

టీడీపీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీ అయిన సమయంలోనే తీవ్ర విమర్శలు వినిపించాయి. అయినా ముందుకు వెళ్ల‌డానికే టీడీపీ రెడీ అయిపోయింది. ఒక‌ప‌క్క తెలంగాణ‌లో టీడీపీతో కాంగ్రెస్ నేత‌లు జ‌త‌కడితే.. తాజాగా ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు ప్రారంభించారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, అంత‌కు ముందు ఎంపీ కెవీపీ రామచంద్రరావు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం.. తాజా కర్నూలు పర్యటనలో ఏపీ ప్రభుత్వంపై ఈగ వాలనీయలేదు. ఓ చోట స్నేహం.. మరో చోట శతృత్వం సాధ్యమవుతుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌! ఇది రాజకీయంగా తమను భారీగా దెబ్బతీసే అవకాశం ఉందనే ఆందోళన టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆశతో ఉన్న కాంగ్రెస్.. టీడీపీతో పొత్తుకు రెడీ అయిపోయింది. ఇరు పార్టీల నేత‌లు కలసి ప్రచారం చేయటమే కాదు.. హామీల అమలు కోసం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక కూడా ప్రకటించేందుకు రెడీ అయిపోయారు. కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు రెడీ కావటాన్ని తొలుత టీడీపీ సీనియర్ నేతలు కె ఈ కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు వంటి వారు తీవ్రంగా తప్పుపట్టారు. చివరకు తెలంగాణ వరకూ అయితే ఓకే అన్నారు. ఏపీలో మాత్రం సాధ్యంకాదని తెగేసి చెప్పారు. అయితే ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచటం కూడా వ్యూహాత్మకమేనా? అన్న చర్చ సాగుతోంది. ఆకు వెళ్లి ముల్లు మీద ప‌డ్డా.. ముల్లొచ్చి ఆకు మీద ప‌డ్డా.. ఆకుకే న‌ష్టం అన్న చందంగా.. టీడీపీ ప‌రిస్థితి మారుతుందో వేచిచూడాల్సిందే!!

ఏపీలో వైరం.. తెలంగాణ‌లో స్నేహం.. డ్యుయెల్ గేమ్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share