చెలియా TJ రివ్యూ

సినిమా : చెలియా
రేటింగ్ : 2.5/5
పంచ్ లైన్ : మనీ రాదు..రత్నం కాదు.

నటీనటులు : కార్తీ, అదితిరావ్ హైద‌రీ, శ్రద్ధ శ్రీనాథ్, రుక్మిణి విజ‌య్‌కుమార్‌, ఆర్‌.జె.బాలాజీ, ఢిల్లీ గ‌ణేష్ త‌దిత‌రులు
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి
మాటలు : కిర‌ణ్‌
సంగీతం : ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
సినిమాటోగ్ర‌ఫీ : ఎస్‌.ర‌వివ‌ర్మ‌న్‌
నిర్మాణ సంస్థ‌లు : మ‌ద్రాస్ టాకీస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
నిర్మాత‌లు : మ‌ణిర‌త్నం, శిరీష్‌
ద‌ర్శ‌క‌త్వం : మ‌ణిర‌త్నం

అనగనగ అశోకుడనే చక్రవర్తి భారత దేశాన్ని సుసంపన్నం గా పాలించెను.అశోకుడు రోడ్డుకిరువైపులా చెట్లు నాటించెను.అశోకుని పాలనలో ప్రజలంతా సుభిక్షంగా జీవించిరి.అది చరిత్ర.అలాగే అనగనగా మణిరత్నం,రాంగోపాల్ వర్మ అనే ఇద్దరు దర్శకులుండిరి.వారు తమ ప్రతిభతో అద్భుతమైన సినిమాలు తీసి మొత్తం సినీ గమనాన్ని మార్చిన ప్రతిభావంతులు..ఇది కూడా చరిత్రే.తేడా ఏంటంటే అశోకుడిది బీసీ కాలం నాటి చరిత్రయితే ఈ ఉద్దండ దర్శకులది ఈ 90 ల చరిత్ర.ఈ చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుందన్న మన ఆశ చావదు..మనపై వీళ్ళ దండయాత్ర ఆగదు.

చిన్నప్పటినుండి, ఆ మాటకొస్తే ఈ జనరేషన్ అంతా సినిమాల గురించి పెద్దగా తెలియక ముందే..దర్శకుల గురించి వినపడేది అంటే అది మణిరత్నం,వర్మ లాంటి వారి గురించే.అలా వారి గురించి వింటూ వారు తీసిన తొలినాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన వారికి ఆశ చావక,ఇంకా వారు అద్భుతాలు సృష్టిస్తారనుకుని ఎదురు చూడడం వల్ల ఒరిగేది ఆశాభంగం తప్ప అద్భుతం కాదని మణిరత్నం తన వంతుగా మళ్ళీ ప్రూవ్ చేసాడు.

మణిరత్నం సినిమా అనగానే ఓ వర్గం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తుంటారు.ఈ మధ్య కాలం లో ఓకే బంగారం పర్వాలేదనిపించుకున్నా మణిరత్నం రేంజ్ సినిమా కాదు.ఇలా ఒకటి ఆరా యావరేజ్ సినిమాలు తెప్పితే గత పదేళ్లలో తక్కినవన్నీ రత్నం గారు చేతులు కాల్చుకున్న సినిమాలే కనిపిస్తాయి.కార్తీ ని డిఫరెంట్ లుక్ లో ప్రెజెంట్ చేస్తూ చెలియా సినిమా,అందులోనా తెలుగులో దిల్ రాజు విడుదల అనడం తో కాస్త బజ్ అయితే క్రియేట్ చేయగలిగింది.దానికి తోడు సరైన పెద్ద సినిమా ఏది థియేటర్స్ తో తిష్ట వేసి లేకపోవడం తో సినిమా ఓ మోస్తరుగా వున్నా నెట్టుకుపోతుంది అన్న వాతావరణం ఉండగా..అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న చందాగా ఎన్ని మంచి శకునాలున్న సినిమా జన రంజకంగా లేకపోతే నెట్టడం ఎవ్వరి తరమూ కాదు.

కాశ్మీర్ లో ఓ ఫైటర్ పైలట్.పైలెట్ అంటే అతనేదో దేశ రక్షణ కోసం అహర్నిశలు కష్టపడిపోయే పైలెట్ కాదు సుమీ..అతనో రోమియో పైలెట్ టైపు అన్నమాట.అహర్నిశలు అమ్మాయిల ద్యాస తప్ప దేశ రక్షణ,బాధ్యత అనేవి మచ్చుకైనా ఈ పైలెట్ లో కనిపించవు.ఈ మాత్రం దానికి దేశం..ఎయిర్ ఫోర్స్ అంటూ పెద్ద బిల్డుప్ ఎందుకో ఎవ్వరికీ అర్థం కాదు.ఎయిర్ ఫోర్స్ ఫంక్షనింగ్ ఏ చిత్రాతి చిత్రం. ఇక ఆ పైలట్ కి డాక్టర్ హీరోయిన్ పరిచయం,ప్రేమ,గొడవ,ప్రేమ,గొడవ,ప్రేమ..ఇదో అంతులేని కథ..ఇలా ఉండగా పైలెట్ కార్గిల్ యుద్ధం లో పాకిస్థాన్ సైన్యానికి చిక్కడం..అక్కడ జైల్లో మగ్గిపోతూ చివరికి ఎలాగోలా తప్పించుకుని వెనక్కి రావడం వచ్చి రావడంతో మార్పు అనే పూనకంతో హీరోయిన్ ని వెతక్కుంటూ వెళ్లడం..ఇది కథ.

మణిరత్నం సినిమా అంటే హ్యూమన్ ఎమోషన్స్ అద్భుతంగా ఉండేవి.కానీ ప్రస్తుతం పరిస్థితి ఎలా తయారయ్యిందంటే ఎమోషన్స్ ఉండట్లేదా అంటే మోతాదుకు మించే ఉంటున్నాయి కాకపోతే సగటు ప్రేక్షకుడికి పిచ్చెక్కించే రేంజ్ ఎమోషన్స్ అన్నమాట.ఎందుకు గొడవ పడతారో ఎందుకు ప్రేమించుకుంటారో అర్థం కానీ పరిస్థితి.ఇంకా వాళ్ళ కుటుంబాలు,వాళ్ళ రిలేషన్స్ అన్ని అబ్బో అదో వింత ప్రపంచం.ఇంతకీ మని రత్నం గారు ఏ వర్గం ప్రేక్షకుల కోసం సినిమా తీస్తున్నారో కనీసం ఆయనకైనా తెలుసో లేదో.ఎంత వెతికినా అలాంటి వర్గం ఏది కనుచూపు మేర కనబట లేదు .

సినిమాలు రెండు రకాలు.విమర్శకుల మెప్పు పొందేవి,సగటు ప్రేక్షకుడు మెచ్చినవి.ఈ ఇద్దర్నీ మెప్పించిన దర్శకుడే మణిరత్నం.ప్రస్తుతం పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారయింది మని రత్నం సిన్మాలది.సినిమాలకి సాంకేతికవిలువలతో పాటు బలమైన సన్నివేశాలతో కథనం ఆసక్తిగా ఉండాలనేది బేసిక్ ఫార్ములా..అయితే మణిరత్నం గారి సమస్యేంటంటే సాంకేతిక అంశాలు అత్యద్భుతంగా ఉంటున్నాయి,కథ,కథనం అన్నీ ఉంటున్నాయి..సమస్యంతా సన్నివేశాల్లోనే..ఆ సన్నివేశాలు ఎవరూ ఎవరికీ రిలేట్ చేసుకోలేనంత వాస్తవ దూరంగా ఉండడమే.

కార్తీ కొత్తగా కనిపిస్తాడు.పూర్తి న్యాయం చేసాడు.కాకపోతే ఈ పాత్ర కి కార్తీ నే ఎందుకు ఎంచుకున్నారో అర్థం కాలా.హీరోయిన్ అతిధి రావు మణిరత్నం హెరాయిన్ లాగే ఎప్పటిలాగే ఇన్నోసెంట్ గా క్యూట్ గా ఆకట్టుకుంది.సినిమా మొత్తం వీళ్ళిద్దరూ తప్ప మూడో పాత్రకి అంత ప్రాధాన్యం లేదు.మిగతా నటీనటులంతా పర్లేదు.

మణిరత్నం సినిమాల్లో వుండే క్వాలిటీ,సాంకేతికత కి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది చెలియా కూడా.రవి వర్మన్ సినిమాటోగ్రఫీ సూపర్బ్.కాశ్మీర్ లొకేషన్ అన్ని స్క్రీన్ పై విజువల్ గా పీక్స్.శ్రీకర్ ప్రసాద్ ఎడిషన్ బాగుంది.రెహ్మాన్ నేపధ్య సంగీతం అద్భుతంగా వున్నా పాటలు మాత్రం కఠోరంగా వున్నాయి.స్క్రీన్ ప్లే కంచె తరహాలో ఇది వరకే చూసేసినా ఫ్రెష్ గానే అనిపిస్తుంది.

సినిమా చూస్తున్నంత సేపు ఒకేటే అనుమానం ఒక ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ ఆలోచనలు అంత అస్థవ్యస్థనంగా ఉంటాయా! అంత గందరగోళంగా ఉంటాయా అని.ఏమో రత్నం గారికే తెలియాలి.మామూలుగు కొన్ని సినిమాల్ని ఇది మల్టిప్లెక్స్ లకే పరిమితం అనో లేక బి,సి సెంటర్లలో ఆకట్టుకుంటుందనే రాయొచ్చు కానీ ఈ చెలియా ఆకట్టుకునే క్లాస్ కానీ సెంటర్ కానీ కానరావడం లేదు మరి.