కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ అక్క‌ర్లేదు.. చిన‌రాజ‌ప్ప స్టేట్‌మెంట్‌! 

రిజ‌ర్వేష‌న్ కోసం కాపులు భారీ ఎత్తున ఉద్య‌మిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. 2014 ఎన్నిక‌ల‌కు ముందుకు చంద్ర‌బాబు కాపుల‌ను బీసీల్లో చేరుస్తానంటూ పెద్ద హామీ ఇచ్చారు. దీని అమ‌లు కోసం మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. అనేక ఉద్య‌మాల‌కు పిలుపు కూడా ఇచ్చారు. ఇలా కాపు రిజ‌ర్వేష‌న్ కోసం రాష్ట్రంలో ఇన్ని జ‌రుగుతుంటే… అదే సామాజిక వ‌ర్గానికి చెందిన రాష్ట్ర హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప మాత్రం ఉన్న‌ట్టుండి డిఫరెంట్ ప్ర‌క‌ట‌న చేసేశారు. దీంతో ఒక్క‌సారిగా రాష్ట్రం ఉలిక్కి ప‌డింది. మ‌రిఅదేంటో చూద్దాం రండి..

కాపు రిజ‌ర్వేష‌న్ విష‌యంపై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నియ‌మించిన మంజునాథ‌ కమిషన్‌ నివేదికను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమర్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రితో భేటీ అయ్యేందుకు కాపు కుల సంఘాల నేత‌లు సోమ‌వారం విజయవాడ తరలి వచ్చారు. చినరాజప్ప ఆధ్వర్యంలో దాదాపు 2 వేల మంది కాపు నాయకులు., కార్యకర్తలు తరలివచ్చారు. అయితే ఈ సమావేశంలో హోంమంత్రి చినరాజప్ప చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ముద్రగడ ఓ రాజకీయ పార్టీ చేతిలో కీలుబొమ్మ అని య‌ధాలాపంగా విమర్శించిన రాజప్ప కాపులకు కేవలం విద్యా., ఉద్యోగ రిజర్వేషన్లు కల్పిస్తే చాలని వారికి రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదని ప్రకటించేశారు.

ఈ ప్ర‌క‌ట‌న ఒక్క‌సారిగా రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించింది. నిజానికి కాపు రిజర్వేషన్లలో రాజ్యాధికారం కూడా ఓ లక్ష్యం…. రాజకీయంగా కాపులు ఎదగలేకపోవడానికి కేవలం రిజర్వేషన్లు లేకపోవడమే కారణమని కాపు ఉపకులాలు భావిస్తున్నాయి. అయితే, వీరి ఆశ‌ల‌కు విరుద్ధంగా మంత్రి స్థానంలో ఉన్న కాపు జాతికి చెందిన చినరాజప్ప రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదని ప్రకటించడం వారికి మింగుడు ప‌డ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ముద్ర‌గ‌డ‌ను వ్య‌తిరేకిస్తూ ఎన్ని మాట్లాడినా తాము స‌హించామ‌ని, అయితే, అస‌లు రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్ అక్క‌ర్లేద‌ని చెప్ప‌డానికి ఈయ‌నెవ‌ర‌ని వారు ఘాటుగానే స్పందిస్తున్నారు.

అయితే, రాజ‌ప్ప ప్ర‌క‌ట‌న వెనుక చాలా విష‌యమే ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. నంద్యాల ఉప ఎన్నికతో పాటు., కాకినాడ మునిసిపల్ ఎన్నికల్ని కూడా ఎదుర్కోవాల్సిన సమయంలో రాజకీయ రిజర్వేషన్లు తెరపైకి వస్తే బీసీ ఓటర్లు టీడీపీ దూరమయ్యే ప్రమాదం ఉండటంతోనే చినరాజప్ప ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. రాజ‌కీయ వ్యూహంతోనే రాజ‌ప్ప అలా మాట్లాడి ఉంటార‌ని అంటున్నారు. ఏదేమైనా రాజ‌ప్ప ప్ర‌క‌ట‌న ఇప్పుడు కుంప‌టి రాజేస్తోంద‌న‌డంలో సందేహం లేదు. మ‌రి దీనికి ముద్ర‌గ‌డ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.