ముద్ర‌గ‌డ దీక్ష‌.. చిన‌రాజ‌ప్ప విందు.. డిఫ‌రెంట్ స్టోరీ!

రాజ‌కీయాల్లో ఒక్కొక్క సారి జ‌రిగే.. సిల్లీ ఘ‌ట‌న‌లు భ‌లే స‌ర‌దాగా ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం విష‌యంలో జ‌రిగింది. కాపులకు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌నే ఏకైక అజెండాతో అధికార ప‌క్షానికి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు ముద్ర‌గ‌డ‌. నిరాహార దీక్ష‌లు, ఆత్మ‌హ‌త్యా హెచ్చ‌రిక‌లు వంటివి ఆయ‌న ప్ర‌ధాన ఆయుధాలు. గ‌తంలోఆయ‌న భార్యా స‌మేతంగా చేసిన హ‌ల్‌చ‌ల్ అంతా ఇంతా కాదు. ఇక‌, దీనికి ప్ర‌భుత్వం నుంచి కౌంట‌ర్ తీవ్రంగానే ఉంటోంది. ముద్ర‌గ‌డ‌కు అనుమ‌తి లేద‌ని, కాపుల‌కు ఆయ‌న మాత్ర‌మే ప్ర‌తినిధి కాద‌ని ఇలా ప్ర‌భుత్వం త‌ర‌ఫున హోం మంత్రి అదే సామాజిక వ‌ర్గానికి చెందిన నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప కామెంట్లు కుమ్మ‌రిస్తుండడం తెలిసిందే.

ఇక‌, ఇప్పుడు విష‌యంలోకి వ‌స్తే.. ముద్ర‌గ‌డ చేప‌ట్టిన దీక్ష‌ల‌కు స్థానికంగానే కాకుండా ఢిల్లీ నుంచి కూడా మీడియా ప్ర‌తినిధులు కిర్లంపూడికి చేరుకున్నారు. అయితే, అక్క‌డ వారికి క‌నీసం తాగేందుకు నీరు కానీ, తినేందుకు ఆహారం కానీ లేక‌పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో మీడియాతో స‌న్నిహితంగా ఉండే చిన‌రాజ‌ప్ప‌కు మీడియా మిత్రులు ఫోన్ చేసి ఇలా ముద్ర‌గ‌డ స‌మాచారం క‌వ‌ర్ చేసేందుకు వ‌చ్చామ‌ని, అయితే, త‌మ‌కు తినేందుకు ఏమీ లేక ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని చెప్పార‌ట‌. దీనికి ప్ర‌తిగా.. చిన‌రాజ‌ప్ప‌.. నాకేంటి సంబంధం.. మీరు వెళ్లింది ప్ర‌భుత్వానికి యాంటీగా ఆందోళ‌న చేస్తున్న వ్య‌క్తి ద‌గ్గ‌ర‌కి కాబ‌ట్టి మీ తిప్ప‌లు మీరు ప‌డండి అని ఊరుకోలేద‌ట‌.

వెంట‌నే దాదాపు 100 మంది జ‌ర్న‌లిస్టుల‌కు స‌రిప‌డా భోజ‌నాలు పంపించేశారు. అంతేకాదు.. మొన్నామ‌ధ్య పాద‌యాత్ర అంటూ హ‌డావుడి చేసిన స‌మ‌యంలో ఇటు జ‌ర్న‌లిస్టులు, అటు పోలీసుల‌కు కూడా మొత్తంగా 1000 మందికి భోజ‌నాలు పంపిన‌ట్టు రాజ‌ప్ప తాజాగా స్వ‌యంగా చెప్పుకొచ్చారు.

‘మళ్లీ పాదయాత్ర చేస్తానంటున్నారు కదా…మరోసారి భోజనాలు మీకు ఏర్పాటు చేయాలి.. ఈసారి ఎలాంటి ఇబ్బంది రాకుండా మా వాళ్లను పురమాయించాను…అన్ని ఏర్పాట్లు చేశాను.. బిర్యానీ సిద్ధం చేయాలని కూడా చెప్పాను.. గతంలో ఒకసారి అప్పటికప్పుడు ఫోన్‌ చేసి ..వరుపుల రాజాకు చెప్పి భోజనాలు ఏర్పాటు చేయించాను. మీతో పాటు పోలీసులకు వెయ్యి మందికి కూడా నేనే భోజనాలు ఏర్పాటు చేయిస్తున్నాను. ఇందుకోసం ఓ కల్యాణమండపం బుక్‌ చేశాను.’ అంటూ రాజప్ప చెప్పుకొచ్చారు. సో.. మొత్తానికి ముద్ర‌గ‌డ దీక్ష‌కు.. రాజ‌ప్ప విందు ఏర్పాటు చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంద‌న్న‌మాట‌.