చిన్నమ్మ కోటరీకి బీటలు! విద్యా మంత్రి పన్నీర్ గూటికి జంప్!

త‌మిళ‌నాట రాజ‌కీయాలు రోజుకో ర‌కంగా మ‌లుపు తిరుగుతున్నాయి. నిన్నటి వ‌ర‌కు తిరుగులేద‌ని అనుకున్న చిన్న‌మ్మ‌.. ఆశ‌లు ఒక్క‌సారిగా ఆవిర‌వుతున్నాయి. ప‌న్నీర్ సెల్వాన్ని విజ‌య‌వంతంగా సీఎం సీటు నుంచి రాజీనామా చేయించిన చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌.. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ప్ర‌మాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంది. ఇంత‌లో క‌థ అడ్డం తిరిగింది. ప‌న్నీర్ తిరుగుబావుటా ఎగురేశారు. దీనికి వెనుక ఎవ‌రున్నారు?  ముందు ఎవ‌రున్నారు? అనే సందేహాలు వ్య‌క్తమ‌వుతున్న త‌రుణంలో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌కు అడుగులు వేశారు.

ఈ ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణే ఇప్పుడు శ‌శిక‌ళ కొంప ముంచుతోంది. జ‌ల్లి క‌ట్టు ఉద్య‌మం కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గానే విజ‌య‌వంత‌మైన నేప‌థ్యంలో ఇప్పుడు ప‌న్నీర్ సెల్వం కూడా ఇదే బాట ప‌ట్ట‌డం.. అంద‌రూ ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం వెయ్యి ఏనుగుల బ‌లాన్ని చేకూర్చించింది. ఇప్పుడు ఇదే అభిప్రాయానికి త‌ల‌వంచుతున్నామంటూ.. శ‌శిక‌ళ కోట‌రీలో ప్ర‌ముఖ నేత‌గా ఉన్న విద్యాశాఖ మంత్రి పాండ్య‌రాజ‌న్‌.. ప‌న్నీర్ గూటికి చేరుకునేందుకు రెడీ అయ్యారు. నిన్న‌గాక మొన్న ప‌న్నీర్‌ను విమ‌ర్శించి చిన్న‌మ్మ‌కి జైకొట్టిన పాండ్య‌రాజ‌న్‌.. ప‌న్నీర్‌కి మ‌ద్ద‌తివ్వ‌డం పెద్ద మ‌లుపుగా భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాట చిన్న‌మ్మ ఆశ‌లు ఇక ఆవిరేన‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ప‌న్నీర్ గూటికి చేరేందుకు మొగ్గు చూపుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోప‌క్క‌, శ‌శిక‌ళ మీద కేసులు నానాటికీ పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే ఆదాయానికి మించి ఆస్తుల కేసు న‌మోదు కాగా, ఎమ్మెల్యేల‌ను అప‌హ‌రించార‌నే కేసు కూడా న‌మోదైంది. ఈ ప‌రిణామాల‌తో ఆమెను న‌మ్ముకుంటే సముద్రంలో క‌ల‌వ‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్న అన్నాడీఎంకే నేత‌లు.. ప‌న్నీర్ సెల్వం బాట‌లో న‌డిచేందుకు రెడీ కావ‌డం సంచ‌ల‌న నిర్ణ‌యం. మ‌రి రాబోయే రెండు మూడు రోజుల్లో మ‌రింతగా ఈ ప‌రిణామాలు జోరందుకునే ఛాన్స్ క‌నిపిస్తోంది.