విశాఖ‌లో వీధికెక్కిన మంత్రుల కీచులాట .. బాబుకు గంటా లేఖ‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలోని ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమంటోంది. విశాఖ‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు, ఆ పార్టీ, ఈ పార్టీ తిరిగి చివ‌రాఖ‌రికి 2014లో టీడీపీ లో చేరి మంత్రి ప‌ద‌వి కొట్టేసిన గంటా శ్రీనివాస‌రావుల మ‌ధ్య ఇప్పుడు ప‌చ్చ‌గ‌డ్డి వేసిన భ‌గ్గుమంటోంది. ఇటీవ‌ల వెలుగు చూసిన విశాఖ భూ కుంభ‌కోణం తో వీరిద్ద‌రి మ‌ధ్య మ‌రింత‌గా గొడ‌వలు రాజుకుని, అవి అధినేత చంద్ర‌బాబు వ‌ర‌కు చేరాయి.

మొన్నామ‌ధ్య మీడియాతో మాట్లాడిన మంత్రి అయ్య‌న్న‌.. ప‌రోక్షంగా గంటాపై విరుచుకుప‌డ్డారు. విశాఖ భూ కుంభ‌కోణంలో పెద్ద త‌ల‌కాయ‌లు ఉన్నాయ‌ని, దీనిని ప‌ట్టించుకోక‌పోతే.. పార్టీ పరువు పోతుంద‌ని చెప్పుకొచ్చారు. దీనిపై దృష్టి పెట్టిన చంద్ర‌బాబు పార్టీలోను, ప్ర‌భుత్వంలోనూ చ‌ర్చించాక సిట్‌ను ఏర్పాటు చేశారు. ఇంత‌లో స్పందించిన మంత్రి గంటా ఇప్పుడు అయ్య‌న్న‌పై అధినేత‌కు ఫిర్యాదులు మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న చంద్ర‌బాబుకి లేఖ రాశారు

ఇప్పుడు చంద్ర‌బాబుకి గంటా రాసిన లేఖ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ లేఖ‌లో నేరుగా అయ్య‌న్న పేరును పేర్కొన్న గంటా.. ఆయ‌న వ్య‌వ‌హార‌శైలితో పార్టీ ప‌రువు పోతోంద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అంతేకాకుండా అయ్య‌న్న‌వి నిరాధార ఆరోపణలని, వీటి వల్ల విశాఖ ప్రతిష్ట దిగజారటమే కాకుండా..దాని ప్రభావం పార్టీపై కూడా పడుతుంద‌ని రాశార‌ట‌. గతంలో కూడా విశాఖ ఉత్సవ్, ల్యాండ్ పూలింగ్, చంద్రన్న సంక్రాంతి కానుకలపై కూడా ఇటు వంటి నిరాధార ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని అయ్యన్న ఇరకాటంలో పెట్టారని పేర్కొన్నార‌ట.

ఇలాంటి సంఘటనలను ఆసరా చేసుకుని విప‌క్ష నేత‌లు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, బీజేపీ నేత‌ పురందేశ్వరి, సీపీఐ, సీపీఎం నాయకులు, రోజా తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజల్లో ఒక అపనమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని గంటా త‌న లేఖ‌లో చంద్ర‌బాబుకు వివ‌రించార‌ట‌. అయ్య‌న్న ప్ర‌వ‌ర్త‌న ఇలా ఉంటే.. దీని వల్ల విశాఖతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కూడా దెబ్బతింటోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశార‌ట‌. మ‌రి బాబు వీరి ద్ద‌రి ర‌గ‌డ‌పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మొత్తానికి ఆర్థిక న‌గ‌రంలో ఇద్ద‌రు నేత‌లూ అల‌జ‌డి సృష్టించారు.