ఆ విష‌యంలో లోకేష్, రాహుల్ పోటీప‌డుతున్నారు

రాజ‌కీయ నేత‌ల మాట‌లు త‌డ‌బ‌డుతున్నాయి. స్టేజీల‌పై త‌ప్పులు మాట్లాడుతూ దొరికిపోతున్నారు. ఒక‌సారి కాదు రెండు సార్లు కాదు.. ఇలా ప‌దేప‌దే ఇలా టంగ్ స్లిప్ అవుతున్నారు. అగ్ర పార్టీల భావినేత‌లు కావాల్సిన వీరు ఇలా మాట్లాడుతుండ‌టం పార్టీ నేత‌ల‌కు త‌ల‌నొప్పులు తీసుకొస్తోంది. కీల‌క స‌మ‌యాల్లో కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్.. త‌ప్పుగా మాట్లాడి నాలుక క‌రుచుకుంటున్నారు. వీరిపై ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సెటైర్లు ప‌డుతున్నాయి.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రసంగాలలో తప్పులు దొర్లుతున్నప్పటికీ తన తీరు మార్చుకోవడం లేదు. కొద్ది రోజుల క్రితం లోక్ సభ సభ్యుల సంఖ్యను తప్పుగా చెప్పి నాలుక కరుచుకున్నారు. అంతకుముందు బెంగళూరులో ‘ఇందిరా క్యాంటీన్’లను ప్రారంభిస్తూ వాటిని ‘అమ్మ క్యాంటీన్’ లని సంబోధిస్తూ పొరబడ్డారు. తాజాగా రాహుల్ మరోసారి పప్పులో కాలేశారు. ‘మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్’ అర్జన్ సింగ్ కు సంతాపం తెలిపే సందర్భంలోనూ ఆయ‌న పొరబడ్డారు. `ఎయిర్ మార్షల్` అర్జ‌న్ సింగ్ మరణం తనకెంతో బాధను కలిగించిందన్నారు. అయితే అర్జ‌న్ సింగ్ ను ‘ఎయిర్ మార్షల్’గా సంబోధించి రాహుల్ మరోసారి దొరికిపోయారు.

భారత వాయు సేనలో ‘మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్’ ఫైవ్ స్టార్ ర్యాంకు కాగా – ‘ఎయిర్ మార్షల్’ త్రీ స్టార్ ర్యాంకు. ఈ తేడాను గ‌మ‌నించ‌లేక‌పోయారు రాహుల్‌! ఇక చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాబు పరిస్థితి కూడా ఇంచుమించు రాహుల్ లానే ఉంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం అప్పుడు మొదలైన తప్పుల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని జయంతిని చేసేశారు. గ్రామాల్లో నిధులు ఖర్చు పెట్టి సమస్యలు సృష్టిస్తామని చెప్పడం ఆయనకే చెల్లింది. అనేక సందర్భాల్లో సొంత పార్టీపైనే పొరపాటున చాలా సార్లు నెగెటివ్ కామెంట్స్ చేశారు లోకేష్.

తాజాగా కొద్ది రోజుల క్రితం విశాఖలో జరిగిన ఇన్నోవేషన్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ను కంపెనీగా సంబోధించారు. పొరపాట్లు చేయడం సహజమే అయినా వాటిని స‌రిదిద్దుకోవ‌డంలో మాత్రం వీరిద్ద‌రూ విఫ‌ల‌మ‌వుతున్నారు. భావి నాయ‌కులు ఈ తరహా పొరపాట్లను పదే పదే చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.