వైసీపీకి ఆ మూడు పార్టీల మ‌ద్ద‌తు

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో ఇప్పుడు కొత్త జోష్ క‌నిపిస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎవ‌రు పార్టీలో ఉంటారో? ఎవ‌రు ఎప్పుడు జంప్ చేస్తారో? తెలియ‌ని పెద్ద సందిగ్ధావ‌స్థ‌లో కూరుకుపోయిన వైసీపీ నేత‌లు స‌హా అధినేత జ‌గ‌న్‌లో ఇప్పుడు ఏదో తెలియ‌ని కొత్త జోష్ క‌నిపిస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌ను తిట్టిపోసిన కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు స‌హా లోక్‌స‌త్తా పార్టీలు ఇప్పుడు జ‌గ‌న్ చెంత చేరి.. జై కొడుతున్నాయ‌ట‌. అదే స‌మ‌యంలో అధికార టీడీపీని ఏకేస్తున్నాయ‌ట‌.

ఈ ఊహించ‌ని ప‌రిణామం.. జ‌గ‌న్ అండ్‌కో లో కొత్త జోష్ నింపేసింది. విశాఖ‌లో ప‌ర‌వాడ త‌దిత‌ర ప్రాంతాల్లో జ‌రిగిన భారీ కుంభ‌కోణంపై వైసీపీ గురువారం భారీ ఎత్తున విశాఖ‌లో ధ‌ర్నాకు పిలుపునిచ్చింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం స‌హ‌జ‌మే. అయితే, ఈ ధ‌ర్నాకు వైసీపీకి కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు, లోక్‌స‌త్తా పార్టీలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. సేవ్ విశాఖ పేరుతో జగన్ పార్టీ చేస్తున్న ధర్నాకు కాంగ్రెస్, వామపక్షాలు, లోకసత్తా పార్టీలు మద్దతిస్తున్నాయి.

జగన్‌ 2019లో ముఖ్యమంత్రి కావడం ఖాయమని నెల్లూరు ప్లీనంలో నేతలు ప్రకటించారు. ఉత్తరాంధ్రంలోనూ వూపు చూపిస్తున్నారు. వచ్చే నెలలో విజయవాడలో జరిగే రాష్ట్ర ప్లీనంతో వైసీపీ రాజకీయంగా కీలకమైన కార్యాచరణ ప్రారంభించవచ్చు. అంటే దూకుడు పెంచడం, అభ్యర్థుల ఎంపికలు.వనరుల సమీకరణ వంటివన్న మాట. సామాజికంగా తమను బలపర్చే దళిత వర్గాలు దూరం కాలేదనీ, కొత్త వారు కూడా వచ్చే అవకాశముందని వారంటున్నారు.

సో.. ఏదేమైనా ఇప్పుడు అనూహ్యంగా జ‌గ‌న్ పార్టీకి అన్ని వైపుల నుంచి బ‌లం, మ‌ద్ద‌తు ల‌భించింద‌నే చెప్పాలి. ఈ ట్రెండ్ 2019 వ‌ర‌కు కొన‌సాగితే.. సీఎం సీటు జ‌గ‌న్‌కి ఖాయ‌మే అంటున్నారు విశ్లేష‌కులు.