కాంగ్రెస్ గూడు ఖాళీ.. వైసీపీలోకి మాజీ మంత్రి

ఏపీలో ఎలాగైనా స‌రే మ‌ళ్లీ అస్థిత్వం నిల‌బెట్టుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఇప్ప‌ట్లో సాకార‌మ‌య్యేలా లేవు. విభ‌జ‌న తాలూకు ఆగ్ర‌హం ఇంకా ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తూనే ఉంది. దీంతో కాంగ్రెస్ ఇప్ప‌ట్లో కోలుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో ఈ పార్టీలోని సీనియ‌ర్ నేత‌లు ఒక్క‌క్క‌రుగా జెండాలు మార్చేసి.. త‌మ భ‌విష్య‌త్తును చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి, క‌డ‌ప‌కు చెందిన డీఎల్ ర‌వీంద్రా రెడ్డి కూడా ఫ్యూచ‌ర్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు జెండా మార్చేయాల‌ని డిసైడ్ అయ్యారు. వాస్త‌వానికి ఆయ‌న డిసైడ్ అయి చాలా కాల‌మే అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికి ముహూర్తం కుదిరింది.

కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత – మాజీ మంత్రి డీఎల్ త్వ‌ర‌లోనే జ‌గ‌న్ పంచ‌న చేర‌నున్నారు. కాంగ్రెస్ ప‌రిస్థితి దారుణంగా మార‌డం, కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి అంత యాక్టివ్‌గా లేక‌పోవ‌డం, ప్ర‌జ‌ల్లో పూర్తిగా కాంగ్రెస్ ప‌ట్ల వ్య‌తిరేక‌త త‌గ్గ‌క‌పోవడం నేప‌థ్యంలో ఇంకా కాంగ్రెస్ గూటిలోనే ఉంటే భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని డిసైడ్ అయిన డీఎల్.. జ‌గ‌న్ చెంత‌కు చేరాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త్వ‌ర‌లోనే జ‌గ‌న్ చేప‌ట్టనున్న పాద‌యాత్ర ప్రోగ్రాంను త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని డిసైడ్ అయ్యారు.

అక్టోబర్ 27 నుంచి జగన్ పాదయాత్ర మొదలుపెడుతుండడం… అది కూడా కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచే ప్రారంభం కానుండడంతో అంతకుముందు కానీ.. అదే రోజున కానీ డీఎల్ చేరిక ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు జగన్ పాదయాత్ర సమయంలో ప్రతి జిల్లాలోనూ ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు వైసీపీలో చేరేలా ప్రణాళిక రచిస్తున్నారు. పాదయాత్ర ఆర్నెళ్లు సాగనుండడంతో 2018 మార్చి నాటికి పాదయాత్ర బలం… సీనియర్ల చేరికలతో మరింత బలం సమకూర్చుకుని ఎన్నికలకు వైసీపీ సిద్ధం కానుంది. ఏదేమైనా.. మ‌రింత మంది కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి జంప్ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.