ఈ డ‌బుల్ గేమ్ తో పంచ్ పడేది ఎవరికి!

September 13, 2017 at 3:10 pm
BJP, MODI, KCR, TRS

రాజ‌కీయాల‌న్నాక కూసింత లౌక్యం మంచిదే, కానీ అది ముదిరితేనే ప్ర‌మాదం. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు బీజేపీ గురించే అంటున్నారు తెలంగాణ‌లోని రాజ‌కీయ పండితులు. త‌మ‌కు తామే మేధావుల‌మ‌ని, త‌మ‌ను మించిన వారు లేనేలేర‌ని, పాల‌నా ద‌క్ష‌త మాకే ఉంద‌ని ఇటీవ‌ల కాలంలో ఆగ‌కుండా అంద‌కుండా డ‌ప్పు బ‌జాయిస్తున్న బీజేపీ నేతలు, తెలంగాణ‌లో అనుస‌రిస్తున్న వైఖ‌రిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ నేత‌లు తెలంగాణ‌కు వ‌చ్చినా ఇక్క‌డి టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా… ప‌రిస్థితి మారిపోతోంది.

ఒక‌రినొక‌రు పొగిడేసుకోవ‌డం, జ‌బ్బ‌లు చ‌రుచుకోవ‌డం కామ‌నైంది. దీంతో తెలంగాణ‌లో బీజేపీ పాత్ర ఏంట‌నే విష‌యంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌సాగుతోంది. నిజానికి ఈ రెండు పార్టీలూ తెలంగాణలో ఉమ్మ‌డిగా ఏమీలేవు. 2014లోనూ ఎవ‌రిదారిలో వాళ్లు వెళ్లారు. ఆ త‌ర్వాత అనేక సంద‌ర్భాల్లో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని కిష‌న్ రెడ్డి, ల‌క్ష్మ‌ణ్‌, తాజాగా ద‌త్తాత్రేయ వంటి వారు ఇరుకున పెట్టేలాగ‌నే మాట్లాడారు. అదేవిధంగా టీఆర్ ఎస్ నేత‌లు కూడా స్థానిక నేత‌ల‌ను దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న వారు కూడా రాష్ట్రానికి ఏమీ చేయ‌డం లేద‌ని కేసీఆర్ స్వ‌యంగా ద‌త్తాత్రేయ‌ను దుయ్య‌బ‌ట్టారు.

అయితే, ఢిల్లీ వెళ్లేస‌రికి ప‌రిస్థితి మారిపోతోంది. మోడీని కేసీఆర్ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతుంటారు. మోడీ తీసుకున్న పెద్ద నోట్ల ర‌ద్దును ఫ‌స్ట్ స‌మ‌ర్ధించింది కూడా కేసీఆరే. అదేవిధంగా కేంద్రం నుంచి మంత్రులు హైద‌రాబాద్ వ‌స్తే.. కేసీఆర్ పాల‌న‌ను మెచ్చుకుంటారు. మ‌రి ఒక‌రినొక‌రు పొగుడు కోవ‌డం వెనుక ఏముందో అర్ధం కాక స్థానిక నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

ఇక‌, తెలంగాణ‌లో అయితే 2019 నాటికి ఎలాగైనా స‌రే బ‌ల‌మైన ప‌క్షంగా మారాల‌ని బీజేపీ భావిస్తోంది. కానీ, కేంద్రంలో ఒక‌లాగా, రాష్ట్రంలో ఒక‌లాగా వ్య‌వ‌హ‌రిస్తే.. ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తారా? అనేది ఇప్పుడు ప్ర‌ధాన డౌటు. మ‌రి ఇది బీజేపీకి ఏవిధంగా క‌లిసి వ‌స్తుందో వారే ఆలోచించుకోవాలి. ఏదేమైనా ఈ డ‌బుల్ గేమ్ రివ‌ర్స్ అయితే, అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ పూర్తిగా మూసేసే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని అంటున్నారు.

 

ఈ డ‌బుల్ గేమ్ తో పంచ్ పడేది ఎవరికి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share