ఏపీలో ఆ జిల్లా అంతా వార‌సుల రాజ‌కీయాలే…

అపార రాజ‌కీయ అనుభ‌వం ఉన్న సీఎం చంద్ర‌బాబుతో నాయ‌కులు పోటీ ప‌డాలంటే కొంత ఆలోచించ‌క త‌ప్ప‌దు! మ‌రి ఇప్పుడు కొంత‌మంది నాయ‌కులు ఆయ‌న్ను ఆద‌ర్శంగా తీసుకుంటున్నారు. ఏ విష‌యంలో అంటారా? వార‌సుల‌ను రంగంలోకి దించ‌డంలో!! ప్ర‌స్తుతం వార‌స్వ‌త రాజ‌కీయాలు ఏపీలో జోరందుకున్నాయి! ఎన్నిక‌లకు మ‌రో ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉండ‌టంతో.. త‌మ వార‌సుల‌ను రంగంలోకి దించేస్తున్నారు నాయ‌కులు! ముఖ్యంగా టీడీపీలో త‌రాలు మారే స‌మ‌యం వ‌చ్చిందేమో అనిపించ‌క మాన‌దు! యువ‌ర‌క్తాన్ని నింపేందుకు సీఎం చంద్ర‌బాబుతో స‌హా ఇత‌ర నేత‌లు కూడా పోటీప‌డుతున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావ‌రి నేత‌లు ఇందులో ముందున్నారు!!

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు పెరిగిపోతున్నాయి. ముఖ్య‌మంత్రులే.. త‌మ వార‌సుల‌ను రంగంలోకి దించేస్తుంటే.. మేమెందుకు వెన‌క‌డుగు వేయాల‌నుకున్నారో ఏమో గాని.. ఇప్పుడు నేత‌లంతా వారసుల ఎంట్రీకి ప‌క్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్యెల్యేలు , మాజీ ఎమ్యెల్యేలు , ఎంపీల కుమారులు మంచి రోజులు చూసుకుంటూ పొలిటికల్ ఆరంగేట్రం సాగిస్తున్నారు. జగ్గంపేట ఎమ్యెల్యే జ్యోతుల నెహ్రు తన కుమారుడ్ని ఇప్పటికే జెడ్పి ఛైర్మెన్ గా కూర్చోపెట్టి వచ్చే ఎన్నికలకు తన సీట్ అందించే పనిలో వున్నారు.

ప్రత్తిపాడులో ఎమ్యెల్యే వరుపుల సుబ్బారావు తన కుమారుడు వరుపుల రాజాను డీసీసీబీ చైర్మన్ చేసి వచ్చే ఎన్నికలకు ప్రత్తిపాడు నుంచి అసెంబ్లీకి సిద్ధం చేశారు. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురం నుంచి తన కుమారుడు పిల్లి సూర్య ప్రకాష్ ను బరిలోకి దింపుతారని టాక్ . ఆయన ప్రత్యర్థి తోట త్రిమూర్తులు కుమారు డు తోట పృథ్వి రాజ్ ను దింపుతారా లేక ఆయనే ఈసారి రంగంలో ఉంటారో తేల్చ‌లేదు. ఇక మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు కుమారుడు జక్కంపూడి రాజా రాజానగరం నుంచి పోటీ చేయడానికి రెడీ గా ఉన్నారు . మాజీ ఎంపీ జివి హర్ష కుమార్ తనయుడు శ్రీరాజ్ కోనసీమ నుంచి బరిలోకి దిగనున్నారు.

దివంగత ఎర్రన్నాయుడు వియ్యంకుడు, ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తన కుమారుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ ను రాజమండ్రి అర్బన్ నుంచి పోటీకి సిద్ధం చేశారు. వీరందరూ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంసిద్ధులైపోతున్నారు. వారు పోటీ చేద్దామనుకుంటున్న నియోజకవర్గాల్లో భారీ హోర్డింగ్స్ , ఫ్లెక్స్ లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పండగా పబ్బాలకు ప్రాంతాల వారీగా క్యాడర్ ను తయారు చేసుకుంటున్నారు . తమ తండ్రులు పాల్గొనే మీటింగ్స్ లో వీరి హడావిడే ఎక్కువగా కనిపిస్తోంది! మ‌రి వీరిని ప్ర‌జ‌లు ఎంత‌వ‌ర‌కూ ఆదరిస్తారోవేచిచూడాల్సిందే!!