తూర్పు గోదావ‌రికి ఐదుగురు కొత్త ఎమ్మెల్యేలు..!

ఏపీలో అధికారం ద‌క్కించుకునేందుకు కీల‌కమైన జిల్లాల్లో తూర్పు గోదావ‌రి జిల్లా ఒక‌టి. ఏపీలోని 13 జిల్లాల్లో తూర్పు గోదావ‌రి జిల్లాలోనే ఎక్కువ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. 19 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఈ జిల్లా నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మూడు ఎంపీ సీట్లు, మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలిచి అధికారంలోకి వ‌చ్చింది.

ఇక 2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు ముందు తూర్పు గోదావ‌రిలో 21 అసెంబ్లీ సీట్లు ఉండ‌గా పునర్విభ‌జ‌న‌లో రెండు కోల్పోవాల్సి వ‌చ్చింది. ఇక తాజాగా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు కేంద్రం సుముఖంగా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో ఏపీలోనే పెద్ద‌దైన తూర్పుగోదావ‌రి జిల్లాలో ఎన్ని కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు పెరుగుతాయి ?  ఏయే నియోజ‌క‌వ‌ర్గాలు వ‌స్తాయ‌న్న‌దానిపై రాజ‌కీయ వ‌ర్గాల్లో అప్పుడే చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి.

ఇక ఏపీలో ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎలా మార్చాలి ?  కొత్త నియోజ‌క‌వ‌ర్గాలుగా వేటిని చేయాల‌న అంశంపై ప్ర‌భుత్వం త‌ర‌పున క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ఇక ఈ టీం నుంచి విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల ద్వారా అందిన స‌మాచారం ప్ర‌కారం తూర్పు గోదావ‌రిలో కొత్త‌గా ఐదు నియోజ‌క‌వ‌ర్గాలు ఏర్ప‌డ‌నున్నాయి. 

రాజ‌మండ్రి 2, కాకినాడ 2 రానున్నాయి. ఈ రెండు న‌గ‌రాల్లో ఇప్ప‌టికే న‌గ‌ర‌, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా ఇప్పుడు వీటికి తోడు న‌గ‌రంలో రెండో నియోజ‌క‌వ‌ర్గం రానుంది. ఇక కోన‌సీమ కేంద్ర‌మైన రావుల‌పాలెం కొత్త నియోజ‌క‌వ‌ర్గం కానుంది. రావుల‌పాలెం ప్ర‌స్తుతం కొత్త‌పేట‌లో ఉంది. ఇక జిల్లాలో క‌లిసిన ముంపు మండ‌లాలతో చింతూరు కేంద్రంగా కొత్త నియోజ‌క‌వ‌ర్గం రానుంది. 

ఇక మెట్ట‌లో జ‌గ్గంపేట‌, ప్ర‌త్తిపాడు, తుని ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో మండ‌లాలు విడ‌దీసి ఓ నియోజ‌క‌వ‌ర్గం ఏర్పాటు చేయ‌నున్నారు. సో ఓవ‌రాల్‌గా మొత్తం ఐదు కొత్త నియోజ‌క‌వర్గాలు రానున్నాయని తెలుస్తోంది. మ‌రి పున‌ర్విభ‌జ‌న జ‌రిగే టైంకు ఈ లెక్క‌లు ఎలా మార‌తాయో ?  చూడాలి.