టీడీపీలోకి మాజీ సీఎం త‌మ్ముడు…. చంద్ర‌బాబు రెండు ఆఫ‌ర్లు..!

స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు చివ‌రి సీఎంగా ప‌నిచేసిన మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి పొలిటిక‌ల్ రీ ఎంట్రీ ఇస్తార‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. కిర‌ణ్ పొలిటిక‌ల్ రీ ఎంట్రీ బీజేపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్‌తో ఉంటుంద‌ని ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే కిర‌ణ్‌కుమార్ రెడ్డి సోదరుడు, ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పీలేరులో గ‌ట్టి ప‌ట్టున్న న‌ల్లారికిషోర్‌కుమార్‌ రెడ్డి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది.

నల్లారి కుటుంబానికి చిత్తూరు జిల్లా పీలేరులో గట్టి పట్టుంది. నల్లారి అమర్ నాధ్ రెడ్డి నుంచి ఆ నియోజకవర్గంలో పట్టు పెంచుకుంటూ వస్తున్న కిరణ్ కుమార్ సోదరులు గత మూడేళ్లుగా ఎటూ కాకుండా పోయారు. కిర‌ణ్ సీఎంగా ఉన్న‌ప్పుడు కిషోర్‌కుమార్‌ రెడ్డే పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో హ‌వా చెలాయించారు. గ‌త ఎన్నిక‌ల్లో కిర‌ణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై స‌మైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసిన న‌రేష్‌ ఓడిపోయారు.

ఇక ఇప్పుడు త‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం కిషోర్‌కుమార్‌ రెడ్డి టీడీపీలో చేరేందుకు చంద్ర‌బాబుతో డీల్ కుదిరినట్టు వార్తలు వ‌స్తున్నాయి. పీలేరులో టీడీపీకి కూడా స‌రైన నాయ‌క‌త్వం లేదు. కిషోర్‌కుమార్‌రెడ్డి ముందుగా వైసీపీలోకి వెళ్లాలన్నా అక్కడ తమ శత్రువు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. పీలేరులో కూడా వైసీపీ ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డి ఉన్నారు. దీంతో కిషోర్‌కుమార్‌ రెడ్డికు అక్క‌డ టిక్కెట్ రావ‌డం క‌ష్ట‌మే. అందుకే ఆయ‌న టీడీపీలోకి వెళ్లాల‌ని ప్లాన్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

టీడీపీలో చేరేందుకు ఓకే చెప్పిన కిషోర్‌కుమార్‌ రెడ్డి త‌న‌కు పీలేరు ఎమ్మెల్యే సీటు లేదా రాజంపేట ఎంపీ సీటులో ఏదో ఒక‌టి ఇవ్వాల‌ని అడిగిన‌ట్టు తెలుస్తోంది. ఈ రెండిట్లో ఏ సీటు ఇస్తాన‌న్న‌ది చంద్ర‌బాబు ఇప్ప‌టికిప్పుడు హామీ ఇవ్వ‌క‌పోయినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటులో ఏదో ఒక‌టి ఖ‌చ్చితంగా ఇస్తాన‌ని కిషోర్‌కుమార్‌కు హామీ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి సోద‌రుడు టీడీపీ ఎంట్రీపై మాజీ సీఎం కిర‌ణ్ ఎలా స్పందిస్తారో ? చూడాలి.