వైసీపీలోకి మాజీ మంత్రి..!

వైసీపీలోకి మరో సీనియర్ నేత….కీలకనేత చేరబోతున్నారు. గ‌తంలో స‌మైక్యాంధ్ర‌ప్రదేశ్‌కు మంత్రిగా ప‌నిచేసిన స‌ద‌రు కీల‌క నేత ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. దీంతో పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ మారేందుకు రెడీ అవుతోన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌కాశం జిల్లా కందుకూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన మానుగుంట మహీధర్ రెడ్డి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

మహీధర్ రెడ్డి మూడు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఆయ‌న కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు విముఖ‌త చూపారు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీలో కాంగ్రెస్ గాలిలో క‌లిసిపోవ‌డంతో ఇప్పుడు ఆయ‌న రాజ‌కీయంగా కొత్త‌దారులు వెతుక్కునే ప‌నిలో ఉన్నారు. ఇక గ‌త మూడేళ్లుగా ఆయ‌న పేరుకు మాత్రం కాంగ్రెస్‌లో ఉన్నా రాజ‌కీయంగా మాత్రం యాక్టివ్‌గా లేరు.

ఇక మ‌హీధ‌ర్‌రెడ్డి వైసీపీ ఎంట్రీకి జ‌గ‌న్ కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశారు. కొద్ది రోజుల క్రితం గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి కందుకూరు ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు టీడీపీలోకి జంప్ చేసేశారు. దీంతో ఇక్క‌డ వైసీపీ నుంచి స‌రైన అభ్య‌ర్థి ఎవ్వ‌రూ లేరు. ఇప్పుడు మ‌హీధ‌ర్‌రెడ్డి వైసీపీలో చేరి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ప్రకాశం జిల్లాలో సీనియర్ రాజకీయ నేతల అవసరం జ‌గ‌న్‌కు చాలా ఉంది. ఈ జిల్లా నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచిన న‌లుగురు ఎమ్మెల్యేలు జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చి పార్టీ మారిపోయారు. దీంతో ఇప్పుడు మ‌హీధ‌ర్‌రెడ్డి వైసీపీలో చేర‌డం జ‌గ‌న్‌కు చాలా వ‌ర‌కు క‌లిసిరానుంది. ఏదేమైనా ఎన్నిక‌ల వేళ టీడీపీలోకే కాదు వైసీపీలోకి కూడా భారీ ఎత్తుల వ‌ల‌స‌లు కంటిన్యూ అవ్వ‌నున్నాయి.