ఎంపీపై మాజీ మంత్రి పీత‌ల శ‌ప‌థం

ఏపీలో అధికార టీడీపీకి కంచుకోట అయిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో టీడీపీ గ్రూపు రాజ‌కీయాలు ప‌తాక స్థాయికి చేరుకున్నాయి. కొద్ది రోజులుగా మాజీ మంత్రి పీత‌ల సుజాత వ‌ర్సెస్ ఏలూరు ఎంపీ మాగంటి బాబు మ‌ధ్య జ‌రుగుతోన్న పోరు ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఇక పీత‌ల సుజాత ప్రాధినిత్యం వ‌హిస్తోన్న చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ ఏఎంసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇప్ప‌టి వ‌ర‌కు భ‌ర్తీ కాలేదు. పార్టీ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు దాటిపోయింది. జిల్లాలోని అన్ని ఏఎంసీ చైర్మ‌న్ ప‌ద‌వులు ఒక‌విడ‌త ప‌ద‌వీ కాలం కంప్లీట్ చేసుకుని, ఇప్పుడు రెండో విడ‌త కూడా పాల‌క ప‌గ్గాలు చేప‌ట్టాయి. అయితే చింత‌ల‌పూడి ఏఎంసీ పాల‌క‌వ‌ర్గం మాత్రం ఇప్ప‌ట‌కీ భ‌ర్తీ కాలేదు.

ఇందుకు పీత‌ల సుజాత వ‌ర్సెస్ ఎంపీ మాగంటి త‌మ వ‌ర్గానికి ఈ ప‌ద‌వి ఇప్పించుకునేందుకు ఆధిప‌త్యానికి దిగ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. చింతలపూడి మార్కెట్ యార్డు ఛైర్మన్ పోస్టు పదవి కోసం ఈ రెండు వర్గాలూ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. మాగంటి బాబు ఎలాగైనా తన అనుచరుడికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీత‌ల సుజాత కూడా త‌న వ‌ర్గానికే ఈ ప‌ద‌వి ఇప్పించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

వీరిద్ద‌రిలో ఎవ‌రికి స‌ర్ది చెప్పాలో తెలియ‌క అధిష్టానం కూడా ఈ ప‌ద‌విని మూడేళ్ల పాటు భ‌ర్తీ చేయ‌కుండా అలాగే ఉంచేసింది. ఇక కొద్ది రోజుల క్రితం మాగంటి ఈ ప‌ద‌విని త‌న చ‌రుడు అయిన కోనేరు వెంక‌ట సుబ్బారావుకు ఇప్పించుకుని, అధిష్టానం నుంచి ఉత్త‌ర్వులు కూడా తెచ్చారు. వెంట‌నే పీతల రంగంలోకి దిగి ఈ ఉత్త‌ర్వులు ర‌ద్దు చేశారు. పీత‌ల మాత్రం త‌న వర్గానికి చెందిన లింగ‌పాలెం మండ‌లానికి చెందిన నందిగం తిల‌క్‌కు ఈ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇక ఈ పంచాయితీ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు దృష్టికి వెళ్లింది. ఆయ‌న కూడా ఈ విష‌యంలో ఏం చేయ‌లేక చేతులు ఎత్తేశాడు. పీత‌ల త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి మాగంటి పెత్త‌నం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మాగంటి వ‌ర్గం మాత్రం పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచి క‌ష్ట‌ప‌డిన వారికి ఎందుకు ప్ర‌యారిటీ ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తోంది. ఎక్క‌డి నుంచో వ‌చ్చిన‌ నియోజ‌క‌వ‌ర్గంతో ప‌రిచ‌యం లేని సుజాత‌ను గెలిపిస్తే ఆమె ఇక్క‌డ గ్రూపు రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని ఎంపీ వ‌ర్గం మండిప‌డుతోంది.

మ‌రో వైపు ఎమ్మెల్యే పీత‌ల ఎంపీ మాగంటిపై శ‌ప‌థం చేశారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీ మాగంటి పెత్త‌నాన్ని తాను అస్సలు స‌హించ‌న‌ని, ఈ విష‌యాన్ని తాను సీఎం చంద్ర‌బాబుతోనే తేల్చుకుంటాన‌ని ఆమె ఫైర‌వుతున్నారు.