టీడీపీకి షాక్‌.. క‌మ‌ల‌ద‌ళంలోకి మాజీ ఎంపీ

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఖ‌మ్మంలోని చ‌క్కెర క‌ర్మాగారాల‌కు అధినేత‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు రైట్ హ్యాండ్స్‌లో ప్ర‌ముఖుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కూడా పార్టీ జంప్ చేసేందుకు రెడీ అయ్యార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న బాబుకు బై చెప్పి క‌మ‌ల‌ద‌ళం గూటికి వెళ్లిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు బీజేపీ నాయ‌కులు. టీడీపీలో సీనియ‌ర్ నేత‌గా అన్న‌గారి హ‌యాం నుంచి చ‌క్రం తిప్పారు నామా. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో బాబు ప‌క్షానే ఉండి పోరాడారు. ప‌లువురు నేత‌లు తెలంగాణ కోసం బాబుకు బై చెప్పినా.. నామా మాత్రం టీడీపీలోనే ఉండి.. బాబును అనుస‌రించారు.

అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో 2019లో మ‌ళ్లీ పోటీ చేయాల‌ని నామాపై ఒత్తిడి పెరిగింది. ప్ర‌స్తుతం ఆయ‌న టీడీపీలోనే ఉన్నా ఎక్క‌డా యాక్టివ్‌గా క‌నిపించ‌డం లేదు. రాష్ట్రంలో టీడీపీ నేత‌లు కేసీఆర్‌పై వివిధ స‌మ‌స్య‌ల‌పై దండెత్తుతున్నా.. నామా మాత్రం వీటిలో జోక్యం చేసుకోకుండా.. సైలెంట్‌గా త‌న‌ప‌నేదో తాను చేసుకుపోతున్నారు. నామా కుటుంబానికి ఖ‌మ్మంలో మంచి ప‌లుకుబ‌డి, ఫాలోయింగ్ రెండూ ఉన్నాయి. గ‌తంలో ఎంపీగా కూడా ఆయ‌న అధిక మెజారీటీతో సైకిల్ గుర్తుపై గెలిచారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత బాబు ఏపీకే ప‌రిమితం అవ‌డంతో నామా ప్ర‌త్య‌క్షంగా ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు వ‌చ్చిందిలేదు.

కానీ, ఇప్పుడు ఆయ‌న‌పై ఒత్తిడి పెరిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌కీయాల్లో త‌ల‌ప‌డాల‌ని, ఎంపీ స్థానానికి పోటీ చేయాల‌ని స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యులు కూడా ఒత్త‌డి చేస్తున్నారు. ఆర్థికంగా ఏలోటూ లేని నామా కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న సొంత‌గా త‌న నియోజ‌క‌వ‌ర్గం స‌హా ఖ‌మ్మంలో టీడీపీ ప‌రిస్థితిపై స‌ర్వే చేయించుకున్నారు. దీనిలో ఆ పార్టీకి మంచి మార్కులు ప‌డ‌లేదు. ఇక‌, వ్య‌క్తిగ‌తంగా నామాకు బాగానే మార్కులు ప‌డ్డాయి.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీజేపీలోకి జంప్ చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. నామాను చేర్చుకునేందుకు బీజేపీ నేత‌లు ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఆయ‌న వ‌స్తానంటే రెడ్ కార్పెట్ ప‌రిచేందుకు రెడీ అవుతార‌నే చ‌ర్చ సాగుతోంది. నామా క‌నుక పార్టీ మారితే, తెలంగాణ‌లో ముఖ్యంగా ఖ‌మ్మంలో తెలుగు దేశం పార్టీ పూర్తిగా చ‌తికిల ప‌డుతుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.