వైసీపీ నేత‌ల‌కు పీకే టీం టెన్ష‌న్

September 28, 2017 at 12:46 pm
ys-ph

వైసీపీ నేత‌ల‌కు ప్ర‌శాంత్ కిషోర్‌ షాడో టీం భ‌యం ప‌ట్టుకుంది. నుంచున్నా.. కూర్చున్నా.. పార్టీ స‌మావేశాల‌కు వెళ్లినా.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లినా.. షాడో టీం స‌భ్యులు వెన‌కే వ‌స్తుండటంతో వీరిలో టెన్ష‌న్ రోజురోజుకూ పెరుగుతోంది. మాట్లాడినా.. మాట్లాడ‌క పోయినా వీరు ప్ర‌తి విష‌యం నోట్ చేస్తుండ‌టంతో.. ఆందోళ‌న అధిక‌మ‌వుతోంద‌ట‌. వీళ్లు ఇప్పుడు ఏం రిపోర్టు ఇస్తారోన‌ని, ఇది ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్ రాకుండా ఎక్క‌డ అడ్డుప‌డుతుందోనని కంగారుప‌డుతున్నార‌ట‌. పార్టీ కార్య‌క్ర‌మాల‌న్నీ త‌మ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగేలా చూస్తుండ‌టంతో నేత‌ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ‌ట‌. ప్ర‌స్తుతం వీరి దృష్టిలో ప‌డేందుకు మ‌రికొంద‌రు అత్యుత్సాహం కూడా ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని తెలుస్తోంది!

వైసీపీ వ్యూహ‌క‌ర్త‌ ప్ర‌శాంత్ కిషోర్ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం వైసీపీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేసేందుకు త‌న టీంలోని స‌భ్యుల‌ను అన్ని జిల్లాల‌కు పంపిస్తున్నారు. అయితే స్థానిక నేత‌ల‌కు ఇప్పుడు ఈ స‌భ్యుల భ‌యం వెంటాడుతోంద‌ట‌. కానీ వ్యూహకర్తలు కూడా పార్టీల టార్గెట్ల కోసం కొత్త పంథాలను అవలంబిస్తున్నారు. అవసరమైతే పార్టీ కార్యకలాపాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. వైసీపీలో ఇలాంటి దృశ్యమే పార్టీలో హల్ చల్ చేస్తోంది. విజయనగరంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ పర్యటించడం, నాయకుల్ని సంప్రదించడం, పార్టీ వ్యవహారాలపై ఆరా తీయడం వంటివి నేత‌ల‌కు నిద్ర‌ప‌ట్ట‌కుండా చేస్తున్నాయి. 

కొద్ది కాలం నుంచి పీకే అండ్ టీం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తోంది. అన్ని జిల్లాలతోపాటు విజయనగరం జిల్లాలోనూ పీకే బృందం రెండు దఫాలుగా పర్యటించింది. ఇందులో పార్టీలో సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి వ‌ర్గాల మ‌ధ్య విభేదాలు ఉన్న‌ట్లు గుర్తించింది. అన్ని చోట్లా వైఎస్ఆర్ కుటుంబం అంటూ కొత్త కార్యక్రమం ప్రారంభిస్తే విజయనగరం జిల్లాలో అది ప్రారంభానికి నోచుకోలేదన్న సమాచారం అందుకున్న పీకే టీమ్ ఆగమేఘాలమీద వాలిపోయింది. గతంలో ఇద్దరు సభ్యులు వస్తే ఈసారి ఏకంగా 12 మంది రంగంలోకి దిగారు. 

జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలకు తొమ్మిది మంది ఇంచార్జ్‌లుగా ఒకరు పార్లమెంట్ ఇంచార్జ్‌గా మరో ఇద్దరు మీడియా ఇంచార్జ్‌లుగా రంగంలోకి దిగారు. వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి దగ్గరుండి షెడ్యూళ్లు వేస్తున్నారు. వారే మీడియాకూ సమాచారం ఇస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, జిల్లా సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావుల సారథ్యంలో జరిగిన వైఎస్ఆర్ కుటుంబం, నవరత్నాల సభను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నారు.  నేరుగా పీకే టీమే రంగంలోకి దిగి పార్టీ కార్యక్రమాల గురించి ఆరా తీస్తుండడంతో.. 2019 ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న ఆశావాహుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

జిల్లా సమన్వయకర్తల సమావేశాల్లో పీకే టీం హంగామా చేస్తుండటం యాక్షన్ ప్లాన్స్ వివరిస్తుండడం స్థానిక పరిస్థితులు ఆరా తీయడం వంటివి చూసి నాయ‌కులు తెల్లమొహం వేస్తున్నారట. వీళ్లు పీకేకు, జగన్ కు ఎలాంటి నివేదిక ఇస్తారోన‌ని టెన్ష‌న్ మొదలైంద‌ట‌. వైసీపీ నాయకులను పీకే టీమ్ షాడోలా వెన్నంటే ఉండటంతో కొంతమంది నాయకులైతే ఆ టీమ్ దృష్టిని ఆకర్షించేందుకు ఓవర్ యాక్షన్ కూడా చేస్తున్నారు. మరోవైపు పీకే టీమ్ తమ జిల్లాలోనే తిరుగుతోందా లేక అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందా అంటూ ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. మొత్తానికి షాడో టీమ్‌ల వ‌ల్ల ఉపయోగం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే!! 

వైసీపీ నేత‌ల‌కు పీకే టీం టెన్ష‌న్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share