హైద‌రాబాద్ క‌మిష‌న‌ర్‌గా సీబీఐ మాజీ జేడీ?

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి సంబంధించిన అక్ర‌మాస్తుల కేసును స‌మ‌ర్థంగా విచారించి సంచ‌ల‌నాల‌కు కేంద్రంగా మారిన సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పేరు మ‌రోసారి తెలుగురాష్ట్రాల్లో వినిపించ‌బోతోందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన హైద‌రాబాద్ క‌మిష‌నర్ మ‌హేంద‌ర్ రెడ్డితో భేటీ కావ‌డం వెనుక కార‌ణ‌మేంట‌నే దానిపై ఇప్పుడు తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రో ఐదేళ్ల‌లో స‌ర్వీస్ ముగించుకోబోతున్న ఆయ‌న‌.. హైద‌రాబాద్‌లో త‌న స‌ర్వీసు ముగించాల‌ని భావిస్తున్నార‌నే వార్త తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ నాయకుల్లో మ‌ళ్లీ గుబులు పుట్టిస్తోంది. ఆయ‌న రాక‌తో మ‌ళ్లీ రాజ‌కీయ వేడి మొద‌ల‌వ‌డం ఖాయ‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఐపీఎస్‌ అధికారి, సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ తెలంగాణకు రావాలనుకుంటున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. జగన్‌ కేసులోనూ, ఆ సందర్బంలో వచ్చిన ఎంఆర్‌ ఎంజిఎఫ్‌ తదితర కేసుల్లోనూ ఆయన‌ పేరు మారుమోగిపోయింది. ఏ రోజు ఏ ప్రకటన చేస్తారా అని మీడియాతో పాటు ప్రజలూఎదురు చూసేవారు. నిజానికి కొద్దిలో తప్పిపోయింది గానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసు ఫైళ్లు కూడా ఆ యన దరిదాపుల్లోకి వచ్చాయి. డిప్యుటేషన్‌పై హైదరాబాద్‌ వచ్చిన లక్ష్మీనారాయణ తర్వాత మహారాష్ట్ర వెళ్లి పూనే కమిషనర్‌గా విధులు నిర్వహించారు.

అయితే రెండు రాష్ట్రాల్లో ఏ కార్య‌క్ర‌మం జరిగినా త‌ప్ప‌నిస‌రిగా హాజ‌ర‌వుతుంటారు. మొదట్లో రాజకీయ సామాజికాంశాలు ప్రస్తావించేవారు. త‌ర్వాత కేవలం ఆధ్యాత్మిక విద్యా విషయాలే మాట్లాడుతున్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన డీజీపీ అనురాగ్‌ శర్మతో భేటీ కావడం ఆసక్తి క‌లిగిస్తోంది. త్వరలోనే రిటైరయ్యే శర్మ స్థానంలో ప్రస్తుత హైదరాబాద్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి బాధ్యతలు తీసుకుంటారని, లక్ష్మీనారాయణ అప్పుడు నగర కమిషనర్‌ అవుతారని ఒక కథనం ప్ర‌చారంలో ఉంది.

ఇంకా అయిదేళ్లు సర్వీసు ఉన్నందున ఇక్కడే మిగిలిన కాలం గడపాలని ల‌క్ష్మీనారాయ‌ణ‌ కోరుకుంటున్నారట. కేంద్రం ఉభయ రాష్ట్రాలు ఒప్పుదలకు వస్తే కేంద్రం దీనిపై అభ్యంతరం పెట్టకపోవచ్చు. మొత్తంమీద‌ ఆయన ఏ బాధ్యతల్లోకి వచ్చినా హైదరాబాదులో ఉండ‌టం ఏపీ నేతలపై అటు చంద్రబాబు ఇటు జగన్‌లతో సహా రాజకీయ వేడి రగిలించడం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.