చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా ఆ న‌లుగురు మంత్రులు

సామాజిక వ‌ర్గాలను సంతృప్తి ప‌ర‌చ‌డానికో, అసంతృప్తులను బుజ్జ‌గించ‌డానికో, పార్టీ బ‌లోపేతానికో కారణం ఏదైనా ఒకే జిల్లాలో ఇద్ద‌రికి మంత్రి ప‌దవులు క‌ట్ట‌బెట్టారు సీఎం చంద్ర‌బాబు! ఇద్ద‌రూ స‌మన్వ‌యంతో ప‌నిచేసి పార్టీని బ‌లోపేతం చేస్తార‌ని ఆయన ఆశించారు. కానీ ఇప్పుడు వీరి మ‌ధ్య పచ్చ‌గడ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత‌గా విభేదాలు ర‌గులుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇవి పైకి క‌నిపిస్తుండ‌గా.. మ‌రికొన్ని జిల్లాల్లో అంత‌ర్గ‌తంగా కొన‌సాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర జిల్లాలకు చెందిన న‌లుగురు మంత్రుల‌తో అధినేత‌కు త‌ల‌నొప్పులు త‌ప్ప‌డంలేదు. ఒక‌రు య‌స్ అంటే మ‌రొక‌రు నో అంటారు! ఒక‌రు ఎడ్డెం అంటే మ‌రొక‌రు తెడ్డెం అంటుండ‌టంతో వీరి మ‌ధ్య తెలుగు త‌మ్ముళ్లు న‌లిగిపోతున్నారు! 

ఉత్త‌రాంధ్ర టీడీపీలో లుక‌లుక‌లు ముదిరి పాకాన‌ప‌డుతున్నాయి. వెనుక బ‌డిన జిల్లాల‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని చెప్పేందుకు ఏకంగా విశాఖ‌, శ్రీ‌కాకుళం జిల్లాల‌కు చెరో రెండు మంత్రి ప‌ద‌వులు కేటాయించారు. అయితే ఇప్పుడు ఈ మంత్రుల మ‌ధ్య విభేదాలు తార‌స్థాయికి చేరిన‌ట్టు తెలుస్తోంది. శ్రీకాకుళంలో టీడీపీ విభేదాలు ఆ పార్టీకి నష్టం కల్గించేలా ఉన్నాయి. మంత్రులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడుల మధ్య తీవ్రస్థాయిలో తలెత్తాయి. కళావెంకట్రావుకు మంత్రి పదవి ఇవ్వడాన్ని అచ్చెన్నాయుడు వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు. తనపై లోకేష్ కు, చంద్రబాబుకు లేనిపోనివి చెప్పి బద్ నామ్ చేశారని అచ్చెన్న అనుమానిస్తున్నారు. 

ఇసుకు వ్యాపారాల దగ్గర నుంచి అన్నింటికీ మంత్రి కళా వెంకట్రావు అడ్డుకోవడమే కాకుండా పదవుల విషయంలో కూడా అడ్డుపడుతున్నారని అచ్చెన్న‌ భావిస్తున్నారు. అయితే ఇద్దరూ బహిరంగంగా బయటపడకపోయినా ఇద్దరూ ఒకే వేదిక మీద కలిసినా కేవలం ముక్తసరి మాటలే తప్ప, మనస్ఫూర్తిగా చర్చించుకున్న సంద‌ర్భాలు లేవ‌ని చెబు తున్నారు. పలాస మున్సిపల్ ఛైర్మన్ పూర్ణ చంద్రరావు, ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ మధ్య వివాదాన్ని ఇద్దరూ గాలికి వదిలేయడంతో ఇప్పుడు రచ్చ అవుతోంది. ఇద్దరూ చెరొక వర్గానికి కొమ్ము కాయడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని పార్టీ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.

ఇక పార్టీ కార్యక్రమాలకు తప్ప ఇద్దరూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. సీతంపేట ఐటీడీఏ పాలవర్గ సమావేశం ఏడాద‌యినా నిర్వ‌హించ‌క‌పోవ‌డానికి వీరి విబేదాలే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఇక మ‌రో ప‌క్క విశాఖ‌లోనూ ప‌రిస్థితి దారుణంగా ఉంది. అయ్య‌న్న, గంటా శ్రీ‌నివాస‌రావు మ‌ధ్య ఎప్ప‌టినుంచో పొస‌గ‌డం లేదు. ఇటీవ‌ల విశాఖ భూ కుంభకోణంలోనూ ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్దం జ‌రిగింది. ఏకంగా సీఎం చంద్ర‌బాబుకు లేఖ‌లు రాసుకోవ‌డం వ‌ర‌కూ వెళ్లింది. మొత్తం మీద ఈ న‌లుగురి మంత్రులు చెరో దారి అంటుండటంతో  ఉత్త‌రాంధ్ర‌లో తెలుగు తమ్ముళ్లు సతమత మవుతున్నారు. అధిష్టానం జోక్యం చేసుకుని మంత్రుల మ‌ధ్య విభేదాలు చ‌క్క‌దిద్దాల‌ని కోరుతున్నారు.