మంత్రుల‌ మ‌ధ్య వార్‌.. మ‌రింత పెరుగుతోంది!

టీడీపీ మంత్రులు అయ్య‌న్న‌, గంటాల మ‌ధ్య త‌లెత్తిన వివాదం మ‌రింత‌గా రాజుకుంది. విశాఖ‌లో భూ కుంభ‌కోణాల‌పై త‌లెత్తిన వివాదం చిలికి చిలికి పెద్దాయ‌న దాకా చేర‌డం, దీనిపై సిట్ వేయ‌డం, అదీకాక‌, పార్టీ ప‌రంగా ఇద్ద‌రు మినిస్ట‌ర్ల మ‌ధ్య ఎందుకు వివాదం రేగిందో ప‌రిశీలించేందుకు త్రిస‌భ్య క‌మిటీని కూడా నియ‌మించ‌డం యుద్ధ ప్రాతిప‌దిక‌న జ‌రిగిపోయింది. దీనికి ముందు ప‌రిణామాలు చూస్తే.. అయ్య‌న్న ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ విశాఖ భూముల‌పై ఏకేశారు. నేరుగా మంత్రి గంటా పేరు ప్ర‌స్తావించ‌క‌పోయినా.. ఆయ‌న ఘాటైన కామెంట్లే చేశాడు.

ఇక‌, దీనిపై ఏమైందో తెలీదుకానీ.. మంత్రి గంటా శ్రీనివాస‌రావు.. అయ్య‌న్న‌పై నేరుగా అధినేత చంద్ర‌బాబుకే లేఖ రాశారు. అయ్య‌న్న కామెంట్ల‌తో ప‌రువు పోతోంద‌ని, ఇలాగైతే క‌ష్ట‌మ‌ని ఆయ‌న లేఖ‌లో స్ప‌ష్టం చేశారు. దీనిపై హుటాహుటిన స్పందించిన బాబు.. చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇక‌, ఇప్పుడు గంటా లేఖ‌పైనా అయ్య‌న్న ఘాటుగానే స్పందించాడు. విశాఖ‌లో పేద‌ల భూముల‌ను లాగేసుకుంటున్నార‌ని, దీనిలో టీడీపీ నేత‌లు కూడా ఉన్నార‌ని, వారికి అధికారులు స‌హ‌క‌రిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు.

పైకి.. గంటాను ఏమీ అన‌ని మంత్రి అయ్య‌న్న.. ప‌రోక్షంగా మాత్రం క‌డిగిపారేశాడు. వాస్త‌వానికి గంటా లేఖ‌పై పీక‌ల‌దాకా అక్క‌సు పెట్టుకున్న అయ్య‌న్న‌.. ఈ విష‌యంలో ఎంత‌వ‌రకైనా వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్న‌ట్టు చెప్పుకొచ్చాడు. త‌న మాదిరిగానే మంత్రి గంటా కూడా విచార‌ణ కోరుతున్నార‌ని అన్న అయ్య‌న్న‌.. ఈ విష‌యంలో సిట్ వేయ‌డం మంచిదేన‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, ఈ ప‌రిణామం ఇప్పుడు ఎటు దారి తీస్తుందో చూడాలి. మొత్తానికి మంత్రుల మ‌ధ్య వివాదం ఈ రేంజ్‌లో సాగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి క‌ష్ట‌మేన‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.