రంగంలోకి హ‌రీశ్.. ఇక ఆమెకు ట్ర‌బుల్స్ స్టార్ట్‌

April 14, 2018 at 4:08 pm
harish-trs-

టీఆర్ఎస్‌లో ట్ర‌బుల్ షూట‌ర్ మ‌ళ్లీ రంగంలోకి దిగారు! ముఖ్య‌మైన స‌మ‌యంలో టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌.. తన మేన‌ల్లుడు, మంత్రి హ‌రీశ్‌రావ్‌కు ప్ర‌త్యేక మైన బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం.. వాటిని హ‌రీశ్‌ అంతే నిబద్ధ‌త‌తో విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌డం తెలిసిందే! ఇప్పుడు అత్యంత కీల‌క‌మైన మ‌రో భారాన్ని మేన‌ల్లుడిపై కేసీఆర్ మోప‌బోతున్నారు. కాంగ్రెస్ కంచుకోటలో పాగా వేసి.. అక్క‌డి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మాజీ మంత్రిని ఓడించ‌డమే ఇప్పుడు హ‌రీశ్ ముందున్న క‌ర్త‌వ్యమ‌ని టీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. మేన‌మామ చెప్పిందే త‌డ‌వుగా.. ఆయ‌న కూడా రంగంలోకి దిగిపోయారు. ఆ మాజీ మంత్రిని ఓడించేందుకు త‌న మార్క్ వ్యూహాల‌తో దూసుకు వెళుతున్నారు. ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందిన హ‌రీశ్ రంగంలోకి దిగడంతో.. కాంగ్రెస్ నేత‌ల్లో అల‌జ‌డి మొద‌లైంది. 

 

కాంగ్రెస్‌లో బ‌ల‌మైన నాయ‌కురాలిగా ఉన్న కొండ సురేఖ‌ను ఆమె నియోజ‌క‌వ‌ర్గంలోనే ఓడించి అక్క‌డ టీఆర్ఎస్ జెండా రెప‌రెప‌లాడించిన వ్య‌క్తి ఆయ‌నే.. ఆమె టీఆర్ఎస్‌లో చేరిన త‌ర్వాత కాంగ్రెస్‌ను ఢీకొట్టి ఆమెను గెలిపించింది కూడా హ‌రీశ్‌రావే!! ఆయ‌న సామ‌ర్థ్యం, వ్యూహ‌ర‌చ‌న ఎలాంటిదో ఈ రెండు సంఘ‌ట‌న‌లు చూస్తే సులువుగా అంచ‌నా వేయ‌వ‌చ్చు. అందుకే హ‌రీశ్‌రావ్ అంటే సీఎం కేసీఆర్‌కు అంత గురి. పార్టీ క‌ష్ట‌కాలంలో నేనున్నానంటూ ముందుకొ చ్చి.. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందారు హరీశ్‌. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో హ‌రీశ్‌కు మ‌రింత క్లిష్ట‌మైన బాధ్య‌తను కేసీఆర్‌ అప్ప‌గించార‌ని తెలుస్తోంది. 

 

కాంగ్రెస్‌ కంచుకోట జహీరాబాద్‌. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అన్ని సీట్లలో కారు దుమ్మలేపినా.. ఇక్కడి ప్రజలు మాత్రం గీతారెడ్డినే ఆదరించారు. జహీరాబాద్‌ నియోజకవర్గంపై పట్టు జారిపోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ.. గులాబీ దళానికి సవాల్‌ విసురుతున్నారు. అందుకే.. ఈ సెగ్మెంట్‌పై కేసీఆర్‌ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు. మాస్‌లోకి చొచ్చుకు పోగల హరీశ్‌రావ్‌కు బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం. ఈ మధ్యే జహీరాబాద్‌ నియోజకవర్గంలోఆయ‌న‌  రెండు రోజులు పర్యటించారు. టౌన్‌లో సైకిల్‌పై గల్లీ గల్లీ తిరిగారు. ఒకేరోజు 406 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కరోజులో రూ.60 కోట్ల విలువైన పనులకు అనుమతులు లభించాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో కేవలం 15 గంటల్లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసి.. ప్రారంభోత్సవం కూడా నిర్వహించారు.

 

ఇన్నాళ్లు పెద్దగా పనులు జరగని చోట.. ఒక్కసారిగా నిధులు వెల్లువ‌లా ప్ర‌వ‌హించ‌డం హర్షించ‌ద‌గ్గ విష‌య‌మే అయినా.. ఒక్క‌సారిగా ఇంత భారీ మొత్తంలో విడుద‌ల అవ‌డం, అందులోనూ ట్ర‌బుల్ షూటర్‌గా పేరున్న హ‌రీశ్‌రావు ప‌ర్య‌టించ‌డంతో కాంగ్రెస్ నేత‌ల్లో గుబులు మొద‌లైంది. పక్కనే ఉన్న నారాయణఖేడ్‌ ఉప ఎన్నికల్లోను ఇదే స్ట్రాటజీ అమలు చేసి సక్సెస్‌ అయ్యారు హరీశ్‌రావ్. ఇప్పుడు జహీరాబాద్‌లోను అలాంటి వ్యూహాన్నే అమలుచేస్తున్నారు. హరీష్‌ టూర్ తర్వాత ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప‌ర్య‌టించారు. ఈ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో గీతారెడ్డిని ఎదుర్కోగల నాయకుడు గులాబీ పార్టీలో లేక‌పోవ‌డంతో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను కానీ, ఇతర నాయకుల్ని గానీ.. తీసుకు రావొచ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. గీతారెడ్డిని ఓడించాలనే బహుముఖ వ్యూహం అమలవుతోంది. మ‌రి హ‌రీశ్ వ్యూహాలు ఇక్క‌డ ఎలా ప‌నిచేస్తాయో వేచిచూడాల్సిందే!!

రంగంలోకి హ‌రీశ్.. ఇక ఆమెకు ట్ర‌బుల్స్ స్టార్ట్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share