ఈ దందా తెలిస్తే బాబు కూడా షాక‌వుతారు!

`బ్రింగ్ బ్యాక్ బాబు(బీబీబీ)` దీనిని.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉద్య‌మంలా ప్ర‌చారం చేశారు. ఎక్క‌డ చూసినా ఈ స్లోగ‌న్ ఉన్న పోస్ట‌ర్లే! బాబు వ‌స్తే జాబు వ‌స్తుంది అనే ట్యాగ్‌లైన్ పెట్టి మ‌రీ కొంత‌మంది టీమ్ స‌భ్యులు విప‌రీతంగా ప్ర‌చా రం క‌ల్పించారు. అయితే బాబు వ‌చ్చారు.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌ జాబులు వ‌స్తున్నాయి. కానీ అవి ఎవ‌రికి వెళుతు న్నా యనేది మాత్రం ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. ఇప్పుడు ఈ గుట్టు ర‌ట్ట‌యింద‌నే ప్ర‌చారం సోష‌ల్ మీడియా లో జో రుగా జ‌రుగుతోంది. ఉద్యోగానికో రేటు.. బీబీబీ స‌భ్యుల‌కు మ‌రో రేటు.. డిస్కౌంట్లు.. ఆఫ‌ర్లు.. ఇలా బీబీబీ స‌భ్య‌లు పెద్ద దందా న‌డుపుతున్నార‌నే వార్త వైర‌ల్ అవుతోంది. దీనిని ఆ సంస్థ‌కు చెందిన వ్య‌క్తే ఫేస్‌బుక్ వేదిక‌గా బ‌య‌ట‌పెట్టారు!

2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అధికారంలోకి రావ‌డానికి తోడ్ప‌డిన అంశాల్లో `బ్రింగ్ బాబు బ్యాక్` ప్ర‌చారం కూడా ఒక‌టి. బాబు వ‌స్తే జాబు వ‌స్తుంద‌నే స్లోగ‌న్ నిరుద్యోగ యువ‌తలోకి బాగా వెళ్లిపోయింది. అయితే బాబు అధికారంలోకి వ‌చ్చి.. నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. నిరుద్యోగుల‌కు దక్కాల్సిన ఉద్యోగాలను బ్రింగ్ బ్యాక్ బాబు (బీబీబీ) టీమ్ లోని కొంత మంది సభ్యులే అంగట్లో అమ్మకానికి పెట్టార‌నే టాక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇందులో ప‌నిచేసిన వారు ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసినా.. డ‌బ్బులు మాత్రం క‌ట్టాల్సిందేనట‌. దీనిపై బిబిబి టీమ్ లో పనిచేసిన వారే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల వేదికగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

`బ్రింగ్ బ్యాక్ బాబు.. ఇది ఒక నినాదంలాగా తీసుకుని పనిచేశాం. ఎంతో మంది వ‌లంటీర్లు ఏమీ ఆశించకుండా పనిచేశారు. కానీ ఇవ్వాళ టీమ్ లో పనిచేసిన కొన్ని దుష్టశక్తులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి బీబీబీ పరువు తీస్తున్నాయి. అది కూడా ఫిక్స్ డ్ రేట్స్ అట. 2.., 2.5 లక్షలు అంట. కొంద‌రు ఫోన్ చేసి మీ టీమ్ అంటగా రేట్ కొంచెం తగ్గించమని చెప్పు అని అడుగుతున్నారు. సిగ్గేస్తోంది.` అని ఒక యువ‌కుడు ఫేస్ బుక్ లోనే అసలు విషయాన్ని చెప్పేశాడు. ఈ దందా ఎప్పటినుంచో కొన‌సాగుతోంద‌నే ప్ర‌చారం కూడా మొద‌లైంది.

విద్యుత్ శాఖలో స్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగాలు మొత్తం దాదాపు 300కిపైగా ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయటానికి నిర్ణయం తీసుకున్నారు. తొలుత టెరాసాఫ్ట్ కు ఈ బాధ్య‌త‌ అప్పగించారు. పోస్టుల అమ్మ‌కంపై పెద్ద ఎత్తున దుమారం రేగటంతో కాంట్రాక్ట్ ను క్యూ9 సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించారు. ఈ కంపెనీలో డైరక్టర్లుగా ఉన్నది మద్దినేని వెంకట మహేష్ బాబు, వెంకటరావు గోనుగుంట్ల. వీరు కూడా బీబీబీ సభ్యులేన‌ట‌. గతంలో డబ్బు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి పెరగటంతో ఈ బ్యాచ్ రూటు మార్చి మరో బినామీ కంపెనీని తెరపైకి తెచ్చి పని పూర్తి చేసుకుందనే ప్ర‌చారం జ‌రుగుతోంది.