హైద‌రాబాద్‌కు చేరిన క‌న్న‌డ రాజ‌కీయం

May 18, 2018 at 10:34 am
kcr-kanada camp politics

క‌ర్ణాట‌క రాజ‌కీయం హైద‌రాబాద్‌కు చేరుకుంది. త‌మ ఎమ్మెల్యేల‌ను కాపాడుకునేందుకు జేడీఎస్‌, కాంగ్రెస్ పార్టీలు నానాతంటాలు ప‌డుతున్నాయి. తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉంటూ పావులు క‌దుపుతున్నాయి. ఇదేస‌మ‌యంలో కాంగ్రెస్‌, జేడీఎస్ ఎమ్మెల్యేల‌ను త‌మ‌వైపు లాక్కునేందుకు అధికార బీజేపీ అస్త్ర‌శ‌స్త్రాలు వినియోగిస్తోంది. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా బీజేపీ శాస‌న ప‌క్ష నేత య‌డ్యూర‌ప్ప ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన కొద్దిగంట‌ల్లోనే ఆయ‌న ప‌రిపాల‌నాప‌రంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. 

 

ముందుగా ఐపీఎస్‌ల‌ను పెద్ద‌సంఖ్య‌లో బ‌దిలీలు చేప‌ట్టారు. అంతేగాకుండా జేడీఎస్‌, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు బ‌స‌చేసిన రిసార్ట్ వ‌ద్ద సెక్యూరిటీని తొల‌గించారు. ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప దూకుడుతో బెంబేలెత్తిపోయిన జేడీఎస్‌, కాంగ్రెస్ పార్టీలు త‌మ ఎమ్మెల్యేల‌ను కాపాడుకునేందుకు అన్నిమార్గాల‌ను వెతుకుతున్నాయి. ఇందులో భాగంగానే రాత్రికిరాత్రి సుమారు 40 మంది ఎమ్మెల్యేల‌ను బ‌స్సులు, కార్ల‌లో హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్కు త‌ర‌లించాయి. ఈ హోట‌ల్ కాంగ్రెస్ నేత సుబ్బ‌రామిరెడ్డిది కావ‌డం గ‌మ‌నార్హం. 

 

అయితే ముందుగా కేర‌ళ‌లోని కొచ్చికి త‌ర‌లించాల‌ని భావించినా ఆ త‌ర్వాత అన్నిర‌కాలు హైద‌రాబాదే సేఫ్ అంటూ ఇక్క‌డికి త‌ర‌లించ‌న‌ట్లు తెలిసింది. అంతేగాకుండా ఏ స‌మ‌యంలోనైనా మ‌ళ్లీ బ‌ల‌నిరూప‌ణ సంద‌ర్భంగా తొంద‌ర‌గా రోడ్డుమార్గాన బెంగ‌ళూరుకు వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని ఆ పార్టీలు భావించిన‌ట్లు తెలిసంది. మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో, తెలంగాణ‌లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలే కావ‌డం, టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌లు ఇద్ద‌రు కూడా ఇప్పుడు బీజేపీకి వ్య‌తిరేకంగానే మ‌సులుకుంటున్నారు. 

 

ఇప్ప‌టికే త‌మ పోరాటానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని జేడీఎస్ నేత కుమార‌స్వామి చంద్ర‌బాబుకు, కేసీఆర్‌కు ఫోన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యంలో చంద్ర‌బాబు కుమార‌స్వామికి ఎమ్మెల్యేల‌ను కాపాడుకునే విష‌యంలో ప‌లు సూచ‌న‌లు చేసిన‌ట్లు తెలిసింది. ఇదిలా ఉండ‌గా. మ‌రికొంద‌రు జేడీఎస్‌-కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను కూడా హైద‌రాబాద్‌కు త‌ర‌లించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా… హోట‌ల్ పార్క్ హ‌య‌త్ వ‌ద్ద భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేశారు.

హైద‌రాబాద్‌కు చేరిన క‌న్న‌డ రాజ‌కీయం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share