తెలంగాణలో కొత్త పార్టీతో ప‌వ‌న్ పొత్తు..!

ఏపీ, తెలంగాణ‌లో 2019 ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతోన్న జ‌న‌సేన ఏ రాష్ట్రంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది ? అన్న‌ది ఆస‌క్తిగా ఉంది. ఏపీలో జ‌న‌సేన‌కు ఇప్ప‌టి నుంచే క్రేజ్ క‌న‌ప‌డుతోంది. ఆ పార్టీతో పొత్తుకు రెడీ అని ఇప్ప‌టికే క‌మ్యూనిస్టులు ప్ర‌క‌టించారు. ఇక వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ సైతం జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే వ‌చ్చే లాభాల‌ను జ‌గ‌న్‌కు చెప్పిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి.

ఇదిలా ఉంటే తెలంగాణలోనూ జనసేన పార్టీ పోటీ చేయాలని భావిస్తోంది. ఇక్క‌డ ఇప్ప‌టికే అధికార టీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. టీఆర్ఎస్‌ను ఢీకొట్టేందుకు విప‌క్ష కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నా కేసీఆర్ దూకుడు ముందు అవి ఆగ‌లేక‌పోతున్నాయి. ఈ క్ర‌మంలోనే అక్క‌డ కేసీఆర్ ఒంటెద్దు పోక‌డ‌ల‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పేందుకు గ‌ద్ద‌ర్‌, కోదండ‌రాం లాంటి వాళ్లు ఒక్క‌ట‌వ్వాల‌న్న చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణ‌లో జ‌న‌సేన ఎంపిక‌ల‌కు సూప‌ర్ రెస్పాన్స్ రావ‌డంతో పార్టీ అధినేత ప‌వ‌న్ ఫుల్ ఖుషీగా ఉన్నాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకునేందుకు అక్క‌డ ఓ కొత్త పార్టీ ఇంట్ర‌స్ట్ చూపుతోంది. ఇటీవల తెలంగాణలో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ ఇంటి పార్టీ పేరిట మాజీ టీఆర్ఎస్ నేత చెరుకు సుధాకర్ ప్రారంభించారు. ఈ పార్టీ ఉపాధ్య‌క్షుడిగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే య‌న్నం శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

ఇక ప్ర‌జా గాయకుడు గ‌ద్ద‌ర్ ఈ పార్టీలో చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరితో ప‌వ‌న్ జ‌న‌సేన క‌ల‌వ‌డంతో పాటు కోదండ‌రాం సైతం వీరితో క‌లిస్తే తెలంగాణ రాజ‌కీయాల్లో టీఆర్ఎస్‌కు గ‌ట్టి ప్ర‌త్య‌ర్థి ఉన్న‌ట్టే ఉంటుంది. మ‌రి ఈ కూట‌మికి కొద్ది రోజుల్లోనే స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.