వైఎస్ సాక్షిగా.. చిత్తూరు వైపీపీలో రేగిన‌ చిచ్చు!

September 16, 2017 at 10:19 am
Chithoor, YSRCP, YSR

నంద్యాల.. కాకినాడ ఫలితాలతో డీలాపడిపోయిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు గురుశిష్యుల పోరు పెద్ద తల నొప్పిగా మారింది. వీరి మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఇప్పుడు తారస్థాయికి చేరింది. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న కొద్దీ వైసీపీ నేతల మ‌ధ్య టికెట్ పోరు అధిక‌మ‌వుతోంది. ఇప్ప‌టికే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నివురుగ‌ప్పిన నిప్పులా ఉండ‌గా.. మ‌రి కొన్ని చోట్ల ఇది భ‌గ్గుమంటోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కోసం గురుశిష్యులిద్ద‌రూ ఇప్ప‌టినుంచే పోటీప‌డు తున్నారు. ముఖ్యంగా వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి సాక్షిగా బ‌ల‌నిరూప‌ణ‌కు సిద్ధ‌మ‌య్యారు. `వైఎస్ వార‌సులం మేమంటే.. కాదు మేం` అని పోరాటాల‌కు దిగుతున్నారు.

చిత్తూరు నియోజకవర్గం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపు తగదాలు భ‌గ్గుమ‌న్నాయి. వ‌చ్చేఎన్నిక‌ల్లో టికెట్ కోసం చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, చిత్తూరు నియోజకవర్గం వైకాపా ఇన్‌ఛార్జ్‌ జంగాలపల్లె శ్రీనివాసు తీవ్రంగా పోటీప‌డుతున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి నిజమైన వారసులం తామేనంటూ ఓ రెండు వర్గాలు చేసుకుంటున్న విమర్శలు, ప్రతివిమర్శలే ఇప్పుడు చిత్తూరులో హాట్‌టాపిక్‌గా మారాయి. 2014 ఎన్నిక‌ల్లో త‌న‌కు టీడీపీ టికెట్ రాద‌ని గ్ర‌హించిన జంగాలపల్లె శ్రీనివాసులు 2014 ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. చిత్తూరు టికెట్‌ సంపాదించారు. రాష్ట్ర విభజన త‌ర్వాత‌.. కాంగ్రెస్ నేత సీకే బాబు వైసీపీలో చేరిపోయారు.

అయితే సీకే బాబు.. జంగాల‌ప‌ల్లో శ్రీ‌నివాసులు త‌ర‌ఫున ప్ర‌చారం చేయాల్సి వ‌చ్చింది. అనంత‌రం జ‌రిగిన జెడ్పీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వీరి మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయింది. దీంతో సీకే బాబు రాజకీయాలకు కొంచెం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే జులై ఏడున వైఎస్‌ జయంతి వేడుకలను జంగాలపల్లె వర్గం ఘనంగా నిర్వహించింది. పోటీగా సీకే బాబు కూడా తన సతీమణి లావణ్యతో కలెక్టరేట్‌లో వేడుకలు జరిపించారు. ఈ సందర్భంగా లావణ్య చేసిన ప్రసంగం అగ్నికి ఆజ్యం పోసింది. వైఎస్‌ ఆశయాల కోసం ఎవరు పని చేస్తారో వారికే ప్రజలు పట్టం కట్టాలన్నారు. వైఎస్‌ సదా తమ గుండెల్లో కొలువై ఉంటారని.. ఎవరు అవునన్నా.. కాదన్నా వైఎస్‌తో సీకే బాబు అనుబంధం 40 ఏళ్లదన్నారు.

ఇది జరిగిన ఆరు రోజుల తర్వాత జంగాలపల్లె వర్గం ప్రెస్‌మీట్‌ పెట్టింది. వైఎస్‌కు తామే నిజమైన వారసులమని సీకే బాబు ఫ్యామిలీ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించింది. మరుసటి రోజు సీకేబాబు వర్గం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. వచ్చే ఎన్నికల్లో వైకాపా టికెట్‌ తమదేనని.. స్ప‌ష్టంచేసింది. టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్‌ను విమర్శించి.. ఇప్పుడు ఆయనకు తామే వారసులమని చెప్పడం విడ్డూరంగా ఉందని.. 2014 ఎన్నికల ప్రచారానికి సీకే బాబు వచ్చారు కాబట్టే జంగాలపల్లెకు ఆ మాత్రం ఓట్లయినా పడ్డాయన్నారు. ఇక‌ వైఎస్ వ‌ర్ధంతిని ఇరు వ‌ర్గాలు బ‌ల నిరూప‌ణ‌కు ఉప‌యోగించుకున్నాయి.

సీకే బాబు, ఆయన సతీమణి లావణ్యలు అనుచరులతో కలిసి కట్టమంచిలోని తమ ఇంటి నుంచి వైఎస్‌ విగ్రహం వరకు భారీ జనసందోహం నడుమ స్కూటర్‌ ర్యాలీని నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మరోమారు జంగాలపల్లె వర్గంపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్‌ బొమ్మను పెట్టకుని ప్రజల్లోకి వస్తున్నవారు ఈ మూడేళ్లలో ఏం చేశారో చెప్పాల ని డిమాండ్‌ చేశారు. సీకే బాబు బలమేమిటో జగన్‌కు తెలుసన్నారు. మొత్తానికి ఇరు వ‌ర్గాలు.. వైఎస్ బొమ్మ పెట్టుకుని రాజ‌కీయాల‌కు దిగుతున్నాయి!

 

వైఎస్ సాక్షిగా.. చిత్తూరు వైపీపీలో రేగిన‌ చిచ్చు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share