అక్కడ మాత్రం వద్దు సార్ టైం వేస్ట్

రెండు రాష్ట్రాల్లో బ‌రిలోకి దిగుతామ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అందుకు త‌గిన‌ట్టే అడుగులు వేస్తున్నాడు. పార్టీలోకి జ‌న‌సైనికుల‌ను ఆహ్వానించేందుకు ప‌రీక్ష‌లు పెడుతూ.. 2019 ఎన్నిక‌ల‌కు సిద్ధమైపోతున్నాడు. ఈ ప‌రీక్ష‌ల్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా త‌ర‌లి వ‌స్తున్నారు యువ‌కులు!

ప్రస్తుతం తెలంగాణ‌లోనూ ఈ త‌ర‌హా శిబిరాలు నిర్వ‌హించాల‌న్న ప‌వ‌న్ నిర్ణ‌యంతో ఏపీ జ‌న‌సేన నేత‌లు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. తెలంగాణ‌లో కంటే ఏపీలోనే పార్టీకి ఎక్కువ మైలేజ్ వ‌చ్చే అవ‌కాశ‌ముందని చెబుతున్నారు. తెలంగాణాలో ఇలాంటి శిబిరాల వ‌ల్ల స‌మ‌యం వృథా అవుతుంది త‌ప్ప‌.. పార్టీకి పెద్ద ప్ర‌యోజ‌నం చేకూర‌ద‌ని గుస‌గుస‌లాడుతున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో జనసేన ఎంపిక శిబిరాలు విజయవంతం కావడంతో ఆ పార్టీ తెలంగాణాపై దృష్టిసారించింది. తెలంగాణ జిల్లాల్లో జనసైన్యాన్ని ఎంపికచేయాలని పార్టీ అధ్య‌క్షుడు పవన్‌ కల్యాణ్ నిర్ణ‌యించారు. ఈ నెల 24న ఆదిలాబాద్‌, 25న కరీంనగర్‌ జిల్లాల్లో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఈ నెల 24న మంచిర్యాల జిల్లాలోని ఫారెస్ట్‌ కాంట్రాక్టు అసోసియేషన్‌ ఫంక్షన్‌ హాలులో, 25న పెద్దపల్లి జిల్లాలోని డీసెంట్ ఫంక్ష‌న్‌ హాల్‌లో ఈ ఎంపిక శిబిరాలు ఏర్పాటుచేయనున్నట్టు పవన్‌ తెలిపారు. ఎవరైనా అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోని పక్షంలో నేరుగా వేదిక వద్ద తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

ప‌వ‌న్ నిర్ణ‌యంతో ఏపీ జ‌న‌సేన నేతల్లో ఆందోళ‌న మొద‌లైంది. ఒక‌ప‌క్క తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌.. ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతూ వీలైనంత‌గా ప్ర‌జ‌ల‌ను టీఆర్ఎస్‌తో విడిపోకుండా చూస్తున్నారు. ముస్లింలు, పేద‌లు, యువ‌త ఇలా అన్ని వ‌ర్గాలు టీఆర్ఎస్ త‌ప్ప ఇత‌ర పార్టీ గురించి ఆలోచించ‌కుండా చేస్తున్నారు.

ఇటువంటి స‌మ‌యంలో తెలంగాణ‌లో జ‌న‌సేన విస్త‌ర‌ణ‌కు కొంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఉండ‌వ‌చ్చ‌ని ఏపీ జ‌న‌సేన నేత‌లు భావిస్తున్నారు. తెలంగాణ‌లోని అభిమానులు వ‌చ్చినా ఏపీలో విజ‌య‌వంత‌మైన‌ట్లు అక్క‌డ కాక‌పోవ‌చ్చ‌ని చెబుతున్నారు. ఈ సమ‌యంలోనే ఏపీపై దృష్టిసారిస్తే.. మ‌రింత బ‌లం పెరుగుతుంద‌ని సూచిస్తున్నారు.