రాంగ్ రూట్‌లో వెళుతున్న ప‌వ‌న్‌

ప్ర‌శ్నించ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌న్నాడు.. అంతిమ లక్ష్యం విజ‌యం కాదు అంటున్నాడు.. సినిమాలు, రాజ‌కీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తానంటున్నాడు!! స‌రికొత్త ఒర‌వ‌డికి నాంది ప‌లికాడు జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌! అలా భావించిన వారంతా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. తెగిన గాలిప‌టంటా.. ల‌క్ష్యం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎప్పుడుప్ర‌జ‌ల్లోకి వ‌స్తాడో తెలియ‌దు.. ఎప్పుడు ట్విట‌ర్‌లో స్పందిస్తాడో తెలియ‌దు.. అప్ప‌టిక‌ప్పుడు ఆవేశంగా మాట్లాడి.. త‌ర్వాత సైలెంట్ అయిపోతాడు! మ‌రి ఇటువంటి వైఖ‌రితో రాజ‌కీయాల్లో రాణించగ‌ల‌డా? అనే సందేహాలు అందరిలోనూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అంతులేని అభిమానం.. వెంట న‌డిచే అభిమాన గ‌ణం ప‌వ‌న్ క‌ల్యాన్ సొంతం! కానీ ఆ అభిమానుల మాయ‌లో నుంచి బ‌య‌ట‌ప‌డి వాస్త‌వ ప‌రిస్థితుల‌ను ప‌వ‌న్‌ తెలుసుకోవ‌డం లేద‌ట‌. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీచేస్తాన‌ని చెప్పినా.. సంస్థాగ‌తంగా ఇప్ప‌డిప్పుడే పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టాడు. కానీ వాస్త‌వ మేంటంటే.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ గురించి తెలిసినవాళ్ళు చాలా తక్కువ. ముఖ్యంగా కీలకమైన గ్రామీణ ఓటర్లకు అందులోనూ మహిళలకు జనసేన పార్టీ గురించి ఏ మాత్రం అవగాహన లేదు. ఈ విషయంలో ప‌వ‌న్ నిర్ల‌క్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప‌వ‌న్‌ను హీరోగా గుర్తిస్తున్నారు త‌ప్ప తమకు మంచి భవిష్యత్తు ఇచ్చే ఒక పార్టీ నాయకుడిగా మాత్రం క్షేత్ర‌స్థాయి ప్ర‌జ‌లు చూడ‌టం లేద‌ట‌.

ముఖ్యంగా పవన్ నిలకడగా ఒక దారిలో వెళ్లకపోవడం అనేది కారణం. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నో దుర్ఘటనలు జరిగినా కాలు బయట పెట్టలేదు. దివాక‌ర్ బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగింది దానిపై స్పంద‌న‌లేదు! రైతులు స‌మ‌స్య‌ల‌పై స్పందించిన దాఖ‌లాలు లేదు! క‌రువుతో ప్ర‌జ‌లు అల్లాడుతున్నారు.. కానీ ఎక్క‌డా మాట్లాడింది లేదు! కానీ ఒక ప్రెస్ ఆఫీస్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగితే వెంట‌నే వారిని ప‌రామ‌ర్శించ‌డాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి! ఇక పవన్ కళ్యాణ్ పార్టీ కేవలం ప్రెస్ మీట్, ప్రెస్ నోట్, ట్విట్టర్ లో మాత్రమే యాక్టివ్ గా ఉంది. క్షేత్ర స్థాయిలో సమస్యలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయకపోవడం విమర్శలకు అవకాశం ఇస్తోంది.

టీడీపీ విధానాల పట్ల ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉన్న సమయంలో వాటి గురించి స్పందించకుండా కప్పు దాటు పద్ధతి లో పోవడం చూసి పవన్ వ్యవహార శైలిపై అందరికి లేనిపోని సందేహాలు క్రియేట్ చేస్తోంది. గుంటూరు రైతుల ఆవేదనపై ప్రత్యక్షంగా ఒక్క మాట మాట్లాడకపోవడం దారుణం. ఎవ‌రికి రాశారో కూడా లేకపోవడం నిర్లక్ష్యాన్ని బయట పెడుతోంది. ఇది గుర్తించకుండా కేవలం తన చుట్టూ ఉండే వారి మాట‌లు న‌మ్మి సైడ్ ట్రాక్‌లో ప‌డ్డాడ‌ననేది విశ్లేష‌కుల అభిప్రాయం!! మ‌రి జ‌న‌సేన మ‌రో ప్ర‌జారాజ్యంలా మారిపోతుందేమో వేచిచూడాల్సిందే!!